సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు సంబంధించిన 18 వేర్వేరు చట్టాలను కలిపి కొత్తగా ఒక సమీకృత నీటిపారుదల చట్టాన్ని తెస్తున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని, బడ్జెట్ సమావేశాల్లో కాకుండా ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందన్నారు. నీటిపారుదలశాఖపై ఈఎన్‌సీ సి.మురళీధర్‌తో కలసి మంగళవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
నిజాం కాలం నాటి ఫసలి చట్టం 1935 అమల్లో ఉండగా రాష్ట్ర నీటిపారుదల రంగంలో సమూల మార్పులు రావడంతో కొత్త చట్టం అనివార్యమైందన్నారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణతోపాటు నీటి నిర్వహణ పద్ధతులు, ఆర్థికపరమైన అధికారాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు వచ్చాయని... నీటిపారుదల ఆస్తుల పరిరక్షణ, నీటి భద్రత, నిర్వహణ అంశాలు పాత చట్టాల్లో లేవని, కొత్త చట్టంలో వాటిపై కచి్చతమైన నిబంధనలను పొందుపరచనున్నట్లు రజత్‌కుమార్ వెల్లడించారు.
సెక్షన్–3పై వెనక్కి తగ్గలేదు..
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాల కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రజత్‌కుమార్ తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను కొత్త ట్రిబ్యునల్‌కు అప్పగించాలా లేక ఇప్పటికే మనుగడలో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–2 లేదా మరే ఇతర ట్రిబ్యునల్‌కు అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ సలహా మేరకు చర్యలు తీసుకుంటామని గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
దీనిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ అధికారులు గతేడాది డిసెంబర్‌లో హామీ ఇచ్చారని... అందువల్ల ఈ విషయమై మళ్లీ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాలనే భావనతో ఉన్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని, ట్రిబ్యునల్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. గోదావరి జలాల విభజనకూ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును ఏపీ కోరడంపై స్పందిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు.
ఎనిమిది డ్యామ్‌ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు..
ఆనకట్టల భద్రతా చట్టం కింద కడెం, మూసీ, స్వర్ణతోపాటు మొత్తం 8 డ్యామ్‌ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు నీటమునగనున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని రజత్‌కుమార్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment