సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో నాయకులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ప్రచారంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ స్పందించింది. టీఆర్‌ఎస్ మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తెదేపా నేత రేవూరి ప్రకాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఈ నోటీసులకు 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు.. అభ్యర్థుల అనుమానల గురించి రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల కోసం ఇప్పటికే 32,500 పోలీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థలు ఫార్మ్ ఏ, ఫార్మ్ బీని ఎలా సబ్మిట్ చేయాలని అడుగుతున్నారన్నారు. ఫార్మ్ ఏని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) దగ్గర.. ఫార్మ్ బీని ఆర్‌వో దగ్గర ఇవ్వాలన్నారు. మేనిఫెస్టో మూడు కాపీలను తెలుగుతో పాటు ఇంగ్లీష్ లేదా హిందీలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఫార్మ్ 8ని సెల్ఫ్ డిక్లరేషన్‌తో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాలేట్ బాక్స్, ఓటర్ స్లిప్‌కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేశారు. బ్యాలేట్ తెలుపు రంగులో ఉంటుందని.. ఓటర్ స్లిప్ పింక్ కలర్‌లో ఉంటుందని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 64.36 కోట్ల రూపాయల డబ్బుతో పాటు రూ. 5 కోట్ల విలువైన మద్యం సీజ్ అయ్యిందని వెల్లడించారు. 77,384 మంది బైండోవర్ అయ్యారని.. సీఆర్‌పీసీ కింద 14,730 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నాయకులు వాడే భాష కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే నలుగురు నాయకులకు నోటీసులు జారీ చేశామన్నారు. కొందరు మేనిఫెస్టో ఇచ్చారని కానీ కావలసిన పద్దతి ప్రకారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో నమోదయిన కేసుల విషయంలో.. ఎన్నికల తర్వాత సాక్షులు రావడం లేదు కాబట్టి విచారణ కొనసాగడం లేదని తెలిపారు. ఈ సారిఎన్నికల ఖర్చు విషయంలో కఠినంగా ఉంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment