సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11న నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ స్పష్టం చేశారు. పసుపు, మొక్కజొన్న రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిపోయిన విషయం తెలిసిందే. తమకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి సరిపడా సమయం లభించలేదని, నిజామాబాద్ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల బరిలో నిలిచిన రైతులు గత శుక్రవారం రజత్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన తన కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం, రాజకీయాల పట్ల అవగాహన లేకపోవడం వల్లే గుర్తుల కేటాయింపుపై కొందరు అభ్యర్థులు ఆందోళన చెందారని తెలిపారు. తన నిజామాబాద్ పర్యటనలో భాగంగా అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేశానని, వారూ సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్ సమయం సరిపోదనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభ్యర్థులు ఎంత మంది ఉన్నా పోలింగ్ నిర్వహించడానికి ఈవీఎంలకు అంతే సమయం పడుతుందని చెప్పారు. అభ్యర్థుల సమక్షంలో మాక్ పోలింగ్ సైతం నిర్వహించామని తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంలను పరీక్షించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల సంఖ్య 50కి మించితే, గరిష్టంగా 50 ఓట్లు మాత్రమే వేసి మాక్ పోలింగ్ నిర్వహించాలని నిబంధనలు పేర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఇక నిజామాబాద్‌లో 185 అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో మాక్ పోలింగ్ కోసం ఒక గంట సమయం పట్టనుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధం..
నిజామాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని రజత్‌కుమార్ తెలిపారు. నిజామాబాద్ ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎం యంత్రాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. 2,209 కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లకు ప్రథమ స్థాయి తనిఖీలు పూర్తి చేశామని చెప్పారు. ఒక యంత్రానికి ఈ తనిఖీలు నిర్వహించడానికి మూడు గంటల సమయం పడుతుందని, 2,209 యం త్రాలకు తనిఖీల కోసం అధిక సమయం, సిబ్బంది అవసరమని తెలిపారు. తనిఖీల తర్వాత ఈవీఎంలలో కేండిడేట్ల సెట్టింగ్ ప్రక్రియకు మరో మూడున్నర గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. అన్ని యంత్రాలకు ఈ పక్రియలు పూర్తి చేశామని, వాటిని పంపిణీ కేంద్రాలకు రవాణా చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
9తో ప్రచారానికి తెర..
పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను విరమించాల్సి ఉంటుందని రజత్‌కుమార్ తెలిపారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ప్రచార కార్యక్రమాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో సైతం ప్రచారం ఆపేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వేదికగా టీఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును ఈసీ పరిశీలనకు పంపామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కొత్త ఓటర్లకు 95 శాతం ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. హైదరాబాద్‌లో కొంత తక్కువ పంపిణీ జరిగిందన్నారు. సోమవారం నాటికి 100 శాతం ఫొటో గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment