గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఈసీకి నివేదిక వెళ్లింది. నేడోరేపో ఆదేశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. పోలింగ్ తర్వాత తలెత్తిన నాలుగు వివాదాలపై నెల్లూరు, కృష్ణా, విశాఖ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ వివాదాలు తలెత్తడానికి బాధ్యులైన ఆర్వో, ఏఆర్వోలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
అక్కడి ఈవీఎంలను తరలించకూడదు
ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలను కదిలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ వినియోగించని ఈవీఎంలను తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో అందరి సమక్షంలో తరలించాల్సిందిగా అధికారులకు ఆదేశాలను జారీ చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, భద్రత పెంపు సాధ్యాసాధ్యాలపై డీజీపి నుంచి వివరణ తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆర్వో, ఏఆర్వోలపై కేసు నమోదు....
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్‌ల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఇప్పటికే ఆర్వో చిన రాముడు, ఏఆర్వో విద్యాసాగర్‌లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈవీఎంలను పరిశీలించిన తర్వాత వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్‌లను ఎన్వలప్ కవర్లలో భద్రపర్చాలని, కానీ రెండు కవర్లలోని స్లిప్పులను ఉద్దేశ్య పూర్వకంగా బయటపాడేసినట్లు తెలుస్తోందన్నారు. ఈ వివాదాలకు సంబంధించి మీడియా వద్ద వాస్తవ వివరాలు ఉంటే ఆ సంస్థలు కూడా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
5 చోట్ల రీపోలింగ్‌కు సిఫార్సు
జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్రంలో ఐదు చోట్ల రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు దివ్వేది తెలిపారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి బూత్‌లు, ప్రకాశం జిల్లాలో ఒక బూత్‌కు సంబంధించి రీ–పోలింగ్‌కు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌కు చాలా సమయం ఉండటంతో రీ–పోలింగ్‌పై వెంటనే నిర్ణయం తీసుకోలేదని, ఏ క్షణమైనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రీ–పోలింగ్‌కు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలున్నాయన్నారు.
వీవీప్యాట్ స్లిప్పులు దగ్ధం చేశారు: ఆత్మకూరు డీఎస్పీ
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని 134వ పోలింగ్ బూత్‌లోని కొన్ని వీవీ ప్యాట్ స్లిప్పులు బహిర్గతం కావడంతో పాటు కొన్ని మాయమయ్యాయని ఆరోపణలు వచ్చాయని స్థానిక డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఆత్మకూరు మండలంలోని దేపూరు గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌కు సంబంధించి వీవీప్యాట్ స్లిప్పులు కొన్నింటిని దగ్ధం చేశారని, స్లిప్‌లు భద్రపరిచే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిచిన ఆర్.ఓ, ఏఆర్‌ఓ, సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు.
నూజివీడు ఏఆర్వోకు షోకాజ్ నోటీసు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా యూనివర్సిటీ భవనంలో భద్రపరిచిన నూజివీడు నియోజకవర్గ రిజర్వు ఈవీఎంల తరలింపుపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్న నూజివీడు తహసీల్దార్ తేజేశ్వరరావుకు ఎన్నికల అధికారులు హడావుడిగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన సబ్ కలెక్టర్ ఈవీఎంల తరలింపుపై తనకు ఆదేశాలు ఇచ్చారని, తదనంతరం రాజకీయ పార్టీల నాయకులకు ఫోన్ ద్వారా సమాచారం కూడా ఇచ్చినట్లు ఎఆర్వో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసు తీసుకునేందుకు తహసీల్దార్ అందుబాటులో లేకపోవటంతో ఆయన నివాసానికి అంటించినట్లు సమాచారం. స్ట్రాంగ్ రూంలలో ఉన్న ఈవీఎంలను కదలించకూడదని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా వీటికి ఎందుకు తరలించారనే దానిపై పైఅధికారులు విస్తృత విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment