
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనే పూర్తి వివరాలు మంగళవారం తెలియజేస్తామని ఆయన మీడియాకు వివరించారు. శుక్రవారం నాటికి అసెంబ్లీకి 1,419, లోక్‌సభకు 199 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని, ఎన్నికల ప్రత్యేక పరిశీలకుల పర్యవేక్షణలో ఇది జరుగుతుందని, ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ కూడా చేయనున్నట్లు ద్వివేదీ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 28గా తెలిపారు. గత శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుందని చెప్పారు.
788 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు
కాగా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 788 కేసులు నమోదు చేసినట్లు దివ్వేది తెలిపారు. అలాగే, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.55 కోట్ల నగదు, 91 కేజీల బంగారం, 231 కేజీల వెండి, 60 డైమండ్లు, 125 వాహనాలు, రూ.12 కోట్ల విలువైన 2.5 లక్షల లీటర్ల మద్యం, 1,000 కేజీల గంజాయి ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులపై ఇప్పటివరకు 367 నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి నిర్మాత వచ్చి వివరణ ఇచ్చి వెళ్లారని, దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికల సంఘం న్యాయ విభాగంతో చర్చించి ఈ సినిమాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment