
సమావేశంలో పాల్గొన్న ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్, దాన కిషోర్, ఆమ్రపాలి తదితరులు
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ బూత్‌కు ఉండాల్సిన తప్పనిసరి ఎత్తు ఎంత? ప్రతి పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేయాల్సిన కనీస సదుపాయాల జాబితా ఏమిటి? వంటి మౌలిక అంశాల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన అవగాహన ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించనున్న సమీక్షకు సర్వసన్నద్ధంగా రావాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలపట్ల కలెక్టర్లు, ఎస్పీలకు ఉన్న పరిజ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం బృందం పరీక్షించనుందన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఈసీ బృందానికి సమగ్ర వివరాలతో నివేదించాలని కోరారు.
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సోమవారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ బృందం మరుసటి రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సన్నాహకంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసుకోవాలని వారికి సూచించారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల మధ్య సమన్వయం, సత్వ ర స్పందన అత్యంత కీలకమన్నారు. వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు కల్పించాల్సిన సదుపాయాలు ఈసీ లక్ష్యాల్లో ముఖ్యమైనవన్నారు. సమావేశంలో ఆబ్కారీశాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, అదనపు సీఈఓ జ్యోతి బుద్దప్రకాశ్, జాయింట్ సీఈఓ కాటా ఆమ్రపా లి, పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ టీఈకే రెడ్డి, వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
సరైన దిశలో ఏర్పాట్లు: సీఈఓ
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహకాలు అన్ని జిల్లాల్లో ఓ దశకు చేరాయని, పనులు సవ్యంగా సాగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల్లో ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లపై సమీక్షించామన్నారు. ఓటర్ల జాబితా, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, శాంతిభద్రతలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలపై భేటీలో చర్చించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తొలుత రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతుందని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ఇద్దరు ప్రతినిధులతో జరిపే ముఖాముఖిలో ఎన్నికల సంఘం అధికారులు... పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు. అనంతరం రాష్ట్ర అధికారులతో ఈసీ బృందం సమీక్షిస్తుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రూ. 10 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ. 44 లక్షలు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ. 59 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, ఎన్నికల వినియోగం కోసమే ఈ డబ్బులను తరలిస్తున్నట్లు తమకు సమాచారముందన్నారు. ఈ కేసులపై విచారణ జరుగుతోందన్నారు. డబ్బు పంపిణీపై రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లోనూ నిఘా ఉంటుందన్నారు.
శిథిల భవనాల్లో పోలింగ్ బూత్‌లు వద్దు..
పోలింగ్ బూత్‌లను శిథిల భవనాల్లో కాకుండా పక్కా భవనాల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఈఓ రజత్‌కుమార్ ఆదేశించినట్లు తెలిసింది. సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుపై ఆయన వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు తీసుకున్న భద్రతా చర్యల గురించి ఆరా తీశారు. ఈ నెల 25లోగా ఓటర్ల తుది జాబితాలను రాజకీయ పార్టీలకు అందజేయాలన్నారు.