సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార, విపక్షాల నేతలు పరస్పరం వ్యక్తిగత ఆరోపణలకు దిగడం, దుర్భాషలాడుకోవడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. నేతలు అసభ్యంగా, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సంఘం చట్టాలతోపాటు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలపై గత ఐదు రోజులుగా అధికార, విపక్షాల నేతలు ఫిర్యాదు చేయడం పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దుర్భాషల వల్ల పార్టీలకు కలిగే అదనపు ప్రయోజనమేమీ లేదని హితవు పలికారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావుపై టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యక్తిగత ఆరోపణలతోపాటు ఒంటేరుపై హరీశ్‌రావు వాఖ్యలపైనా ఫిర్యాదులు అందడంతో ఇరువురికీ నోటీసులు జారీ చేశామన్నారు. భాషకు సంబంధించి 8 ఫిర్యాదులొచ్చాయని, అందరికీ నోటీసులు జారీ చేశామన్నారు.
మేనిఫెస్టోతోపాటు అఫిడవిట్ సమర్పించాలి..
రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటించిన మూడు రోజుల్లోగా ఆంగ్ల/హిందీ భాషల్లో అనువదించి తమ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందని రజత్‌కుమార్ తెలిపారు. మేనిఫెస్టోతోపాటు అందులో పేర్కొన్న హామీలకు నిధులెలా సమీకరిస్తారన్న అంశంపై అఫిడవిట్ రూపంలో డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ మేనిఫెస్టో అమల్లో ఏదైనా పార్టీ విఫలమైతే అఫిడవిట్ ఆధారంగా ప్రజలు కోర్టులను ఆశ్రయించడానికి వీలుంటుందన్నారు.
నేర స్వభావం కూడా తెలపాలి...
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే వారు క్రిమినల్ కేసుల నంబర్లు, సెక్షన్లను మాత్రమే ప్రకటిస్తే సరిపోదని, నేర స్వభావాన్ని తెలిపే వివరాలతో పత్రికలు, వార్తా చానళ్లలో మూడు రోజులు ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుందని రజత్‌కుమార్ వివరించారు.
నామినేషన్ దాఖలు సమయంలోనూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. నేరచరిత్ర ప్రకటనల జారీ ఖర్చు అభ్యర్థుల వ్యయం కిందకు వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చిందన్నారు. అభ్యర్థుల నేర చరిత్రను ప్రజలకు తెలిపే కొత్త సంప్రదాయం అమల్లోకి రావడంతో భవిష్యత్తు రాజకీయాల్లో నేర చరిత్రగల నేతల ప్రాతినిధ్యం తగ్గిపోనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గులాబీ ఓటరు చిట్టీలకు నో...
గులాబీ రంగుకు బదులు తెలుపు రంగు ఓటరు స్లిప్పులను ఓటర్లకు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం సూచించిందని రజత్‌కుమార్ తెలిపారు. గులాబీ రంగు ఓటరు స్లిప్పులు, బ్యాలెట్ల వినియోగంపై విపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నారు. డిసెంబర్ 1 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఓటరు స్లిప్ ముందు భాగంలో ఓటరు వివరాలతో పాటు వెనక భాగంలో పోలింగ్ స్టేషన్ రూట్ మ్యాప్ ఉంటుందన్నారు.
భద్రత కట్టుదిట్టం...
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పట్ల రజత్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరపాలని డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.64.36 కోట్ల మేర లెక్కలు చూపని నగదు, రూ. 5.16 కోట్ల విలువ చేసే 2.18 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకునట్లు తెలిపారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 78,384 మందిని బైండోవర్ చేశామని, 14,730 మందిపై సీఆర్‌పీసీ కేసులు నమోదు చేశామని, 7,367 మందికి నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేశామని రజత్‌కుమార్ వివరించారు. ఎన్నికల అక్రమాలపై సీ–విజిల్ యాప్‌కు ఇప్పటివరకు 1,849 ఫిర్యాదులురాగా వాటిలో 1,012 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఎన్నికల ర్యాలీలకు సువిధ పోర్టల్ ద్వారా 4,462 అనుమతులు జారీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment