
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు 82 మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. వాటిలో హైదరాబాద్‌లోనే 33 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో డీజీపీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఏపీ పోలీసులు డబ్బులు పంచారనే ఆరోపణల మీద విచారణ చేశామని.. వారి వద్ద నుంచి ఎటువంటి డబ్బులు సీజ్ చెయ్యలేదని ఇరు రాష్టాల డీజీపీలు నివేదిక సమర్పించారని పేర్కొన్నారు. జనగామలో డబ్బులు పంచె విషయంలో కేసు నమోదు అయిందని వెల్లడించారు. పాత జిల్లాలను ఆధారంగా తీసుకుని సిబ్బందిని వాడుతున్నట్టు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో డీఈవోలకే పూర్తి అధికారం ఉంటుందని.. పోలీసుల తరఫు నుంచి కొంత ఇబ్బంది వస్తోందని అన్నారు. ఈ విషయంలో సమన్వయం చెయ్యడానికి డీఎస్పీ స్థాయి అధికారుల సేవలను వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని పోలీసు సిబ్బంది సరిపోకపోవడంతో.. తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి 5 వేల మంది హోంగార్డ్స్‌ను అడిగినట్టు తెలిపారు. ఎవరు ఎన్నికల కోసం డబ్బులు పంచినా కేసులు బుక్ చేస్తామని అన్నారు. డబ్బులు తీసుకెళ్లే విషయంలో ప్రోటోకాల్ అమలులో ఉందని.. డబ్బులకు ఫ్రూప్ ఉంటే సరిపోతుందని.. ఎంత మొత్తం అన్నదానిపై లిమిట్ లేదని స్పష్టం చేశారు. మేనిఫెస్టో ప్రజలకు విడుదల చేసే 3 రోజుల ముందు ఎన్నికల కమిషన్‌కు 3 కాపీలు అందజేయాలని పార్టీలను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ కార్యకలపాలలో పాల్గొనరాదని తెలిపారు. ఎన్నికల వరకు మద్యం అమ్మవద్దని కొందరు డిమాండ్ చేశారని.. కానీ అది చేయలేమని అన్నారు. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం మద్యం ద్వారానే వస్తోందని గుర్తుచేశారు.
‘పెయిడ్ న్యూస్ విషయంలో అనేక నిబంధనలు ఉన్నాయి.. వాటిని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. పోయిన ఎన్నికల్లో 76 కోట్లు సీజ్ చేశాం.. కానీ ఈసారి ఆ మొత్తం పెరిగేలా ఉంది. సోషల్ మీడియాను కూడా మానిటరింగ్ చేస్తున్నాం. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు గడువుపై మాకొచ్చిన వినతులను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) దృష్టికి పంపాం. అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇప్పటివరకు 3.31 కోట్ల రూపాయల మద్యం సీజ్ చేశాం. ఈసీఐ నిబంధనల ప్రకారం శాసనసభ ఎన్నికలకు పింక్ బ్యాలెట్ వాడతాం. గత నెల కన్నా 14, 15 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని డీజీపీకి చెప్పాం. ఒకే రకమైన గుర్తులు ఇవ్వరాదని సీఈసీ చెప్పింద’ని రజత్ కుమార్ తెలిపారు.