సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి గడువు బుధవారంతో ముగియనుంది. రాష్ట్రంలోని 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలతో, మిగిలిన 106 చోట్లలో సాయంత్రం 5 గంటలతో ప్రచార కార్యకలాపాలు ముగియనున్నాయి. గత నెల 12న రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోయిన మైకులు మూగబోనున్నాయి. ర్యాలీలు, బహిరంగ సభలకు ఫుల్‌స్టాప్ పడనుంది.
పోలింగ్ ముగింపు సమయానికి సరిగ్గా 48 గంటల ముందు అంతటా ప్రశాంతత నెలకొని ఉండాలని స్పష్టమైన నిబంధనలుండటమే ఇందుకు కారణం. బుధవారం సాయంత్రం తర్వాత అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించడం నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ మంగళవారం స్పష్టం చేశారు. సిర్పూర్, చెన్నూర్(ఎస్.సి), బెల్లంపల్లి(ఎస్.సి), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్.టి), మంథని, భూపాలపల్లి, ములుగు (ఎస్.టి), పినపాక(ఎస్.టి), ఎల్లందు (ఎస్.టి), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్.టి), భద్రాచలం (ఎస్.టి)ల్లో బుధవారం సాయంత్రం 4 గంటల నుండి నిషేధం అమల్లోకి వస్తుందన్నారు. మిగతా నియోజక వర్గాల్లో సాయంత్రం 5 గంటల నుండి నిషేధం అమలవుతుందన్నారు.
ఈ సమయంలో బహిరంగ సభల నిర్వహణ, దానిని ఉద్దేశించి మాట్లాడటం, పాల్గొనడం లేదా ఎన్నికల ఊరేగింపులు తీయడం, సినిమాలు, టివీలు లేదా ఇతర పరికరాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారం చేయడం, అలాగే ఎలక్ట్రానిక్ ప్రచారసాధనాలలో ఒపీనియన్ సర్వేల నిర్వహణ, ఇతరత్రా ఎన్నికల సంబంధిత ప్రచార కార్యక్రమాలను ప్రసారంచేయడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు.పోలింగ్ జరిగే ఏ ప్రాంతంలో కూడా వినోదానికి సంబంధించిన కచ్చేరీలు, స్టేజ్ కార్యక్రమాలవంటి వాటికి కూడా అనుమతించేది లేదన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముందని ఆయన వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 కింద ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
ష్.. అంతా గప్‌చుప్ !
Published Wed, Dec 5 2018 3:37 AM | Last Updated on Wed, Dec 5 2018 2:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment