సాక్షి, హైదరాబాద్: ‘అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికీ నిధులు ఇస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేస్తోంది. దీంతో కొన్ని వర్గాలు ఆ నిధులకు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తిగా విరుద్ధం. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’అని రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి విన్నవించారు. దీనిపై తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇందులో 9 రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, అఫిడవిట్ దాఖలు, శాంతియుత వాతావరణంలో ప్రచారం, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.
‘ముస్లిం ముక్త్ భారత్’అని బీజేపీ అంటోందని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని, కోడ్ అమలులో ఉన్నా ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయని సీపీఐ నేత బాల మల్లేశ్ సీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చును రూ.8 లక్షలకు కుదించాలని సీపీఎం నేత నరసింహారావు కోరారు.
ప్రకటనల ఖర్చు తడిసిమోపెడు
క్రిమినల్ కేసుల విషయంపై అభ్యర్థులు ప్రకటనలు ఇవ్వాలని, అందులోనూ ప్రధాన మీడియా ల్లో ఇవ్వాలని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మూడు భాగాల ఖర్చు ప్రకటనలకే సరిపోతుంది. దీనిపై పునః సమీక్షించాలి. ప్రతి నియోజకవర్గ అభ్యర్థికి ఫామ్–ఏ పార్టీ అధ్యక్షుడి సంతకంతో వెళ్లాలని చెప్పారు. స్పష్టత కావాలన్నాం. – రావుల చంద్రశేఖర్ రెడ్డి
కుల సంఘాలకు డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు
రాష్ట్రంలో పలు చోట్ల కుల సంఘాలు, మతాల భవనాలు, ఆరాధన మందిరాల పేరిట భారీగా నిధులిచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చాక ఇలా నిధులివ్వడం సరికాదు. నిజామాబాద్ జిల్లాలో ఏకంగా రూ.10.35 కోట్లు విడుదల చేశారు. దీనికి ఆయా అధికారులను బాధ్యులుగా చేసి చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఈసీఐకి ఫిర్యాదు చేస్తాం. ఓటర్ స్లిప్‌లు అందరికీ అందించాలి. ఈనెల 30వ తేదీ లోపే ఇవ్వాలి. – నల్లు ఇంద్రసేనారెడ్డి, బీజేపీ నేత
స్లిప్‌ల పంపిణీ సరిగ్గా లేదు
ఎన్నికల్లో ఓటర్లకు పోలింగ్ స్లిప్‌ల పంపిణీ ఆశాజనకంగా లేదు. ఓటర్లు ఇబ్బంది పడకుండా పక్కాగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సందేహాలు నివృత్తి చేసుకున్నాం. క్రిమినల్ కేసుల గురించి కూడా తెలుసుకున్నాం. ప్రచార రథాలకు ఉండే మైకులను గ్రామానికోసారి అనుమతి తీసుకోకుండా ఒకేసారి ఇవ్వాలని కోరాం. రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుతంగాజరుగుతాయి. – వినోద్ కుమార్, టీఆర్‌ఎస్ ఎంపీ
కుల, మతప్రచారం వద్దంటూనే భేటీలా?
కుల, మత ప్రచారాలు వద్దంటూనే బ్రాహ్మణ సమాజం మీటింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారో స్పష్టం చేయాలి. దీని వివరాలన్నీ సీఈఓకు సమర్పించాం. ఓటరు జాబితాపై అధికారికంగా బీఎల్వోలు ఉంటారని, 4వ తేదీన నమోదు చేసుకోవాలని చెప్పినా నా నియోజకవర్గంలో 40 శాతం మంది బీఎల్వోలు లేనేలేరు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ లాంటి వాళ్లకు నోటీసులు ఇస్తున్నారు కానీ.. అధికార పారీ వారికి ఇవ్వడం లేదు. – మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నేత