పార్టీవి కాదు ‘పాలన’వే.. | TRS Leader Clarify To Opposition Parties Over Pragathi Bhavan Controversy | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 2:48 AM | Last Updated on Fri, Nov 2 2018 4:50 AM

TRS Leader Clarify To Opposition Parties Over Pragathi Bhavan Controversy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌తో పాటు మంత్రుల క్వార్టర్లను టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారన్న ఆరోపణలను టీఆర్‌ఎస్‌ తోసిపుచ్చింది. మహాకూటమి నేతలు చేసిన ఫిర్యాదుపై వివరణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ జారీ చేసిన నోటీసులకు టీఆర్‌ఎస్‌ సమాధానమిచ్చింది. ప్రగతిభవన్, మంత్రుల క్వార్టర్లలో జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్న సమావేశాలన్నీ సాధారణ పరిపాలన వ్యవహారాలకు సంబంధించినవేనని తెలిపింది.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి కట్టుబడి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిబంధనలను పాటిస్తూ వస్తున్నామని పేర్కొంది. ప్రతిపక్షాల వాహనాలను మాత్రమే పోలీసులు తనిఖీ చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై సైతం టీఆర్‌ఎస్‌ స్పందించింది. వాహనాల తనిఖీ పోలీసుల విధి నిర్వహణలో భాగ మని   తెలిపింది.  సీఎం కేసీఆర్‌కు చెందిన సొంత పత్రిక, న్యూస్‌చానల్‌లో కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబం ధించిన వార్తలు మాత్రమే చూపిస్తున్నారని వచ్చిన మరో ఫిర్యాదుపై స్పందిస్తూ.. ‘ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రచారసాధనాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. సంఘటనల ప్రసారాలు పూర్తిగా వాటి విచక్షణకు లోబడి ఉంటాయి’అని పేర్కొంది.  

‘ఏపీ డీజీపీ వివరణ హాస్యాస్పదం’ 
టీఆర్‌ఎస్‌ నేతలు గట్టు రామచంద్రారావు, డి.విఠల్, అడ్వొకేట్‌ ఉపేందర్‌ గురువారం సీఈవో కార్యాలయ అధికారులకు పార్టీ వివరణను అందజేశారు.  ఓటమికి భయపడే విపక్షాలు ఫిర్యాదు చేస్తున్నాయని గట్టు అన్నారు. తెలంగాణలో ఏపీ పోలీసుల సంచారంపై ఆ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందన్నారు.  హైదరాబాద్‌ మినహా మరె క్కడా తిరిగే అధికారం ఏపీ పోలీసులకు లేదన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement