సాక్షి, హైదరాబాద్: ఇటీవలి శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గురువారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. సీఎం నుంచి అందిన ఆహ్వానం మేరకే రవీందర్‌సింగ్ ప్రగతిభవన్‌కు చేరుకున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. భేటీ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలు సిక్కు సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రవీందర్ సింగ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందిం చిన సీఎం రాబోయే రోజుల్లో పరిష్కారానికి హామీ ఇచ్చారు. రవీందర్‌సింగ్ వెంట సాదవేణి శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, వినయ్‌తో పాటు సిక్కు సామాజికవర్గం నాయకులు ఎక్బాల్ సింగ్, అర్బన్ సింగ్, ఇందర్‌సింగ్, దర్శన్‌సింగ్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
ఎమ్మెల్సీ పదవిని ఆశించినా దక్కక!
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సర్దార్ రవీందర్ సింగ్ ఉద్యమ సమయంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో కరీంనగర్ మేయర్ పదవిని చేపట్టి దక్షిణ భారతదేశంలో ఈ పదవిని చేపట్టిన ఏకైక సిక్కు నాయకుడిగా రవీందర్‌సింగ్ నిలిచారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా 20 ఏండ్ల అనుభవం కలిగిన రవీందర్ సింగ్‌కు కరీంనగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు.
అయితే మంత్రి గంగుల కమలాకర్, రవీందర్ సింగ్ నడుమ నెలకొన్న విభేదాలు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరింత ముదిరినట్లు ప్రచారం జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించక పోవడం, ఈటల రాజేందర్‌తో కుమ్మక్కయినట్లు ప్రచారం జరగడంపై రవీందర్ సింగ్ మనస్తాపం చెందినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ గత నెల 18న ఇందిరాపార్క్ ధర్నా వేదిక సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యపడక పోవడంతో రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ సింగ్ 230కి పైగా ఓట్లు సాధించి టీఆర్‌ఎస్ అధికారిక అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు, రెండు దశాబ్దాలతో తనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని తనను కలవాలని రవీందర్ సింగ్‌కు సీఎం కబురు పంపినట్లు సమాచారం. కేసీఆర్‌తో విభేదించిన నేతలెవరూ తర్వాతి కాలంలో ఆయనను కలిసిన దాఖలాలు లేవు. దీంతో రవీందర్ సింగ్ ఎపిసోడ్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment