Sardar Ravinder Singh
-
కేసీఆర్‌తో రవీందర్ సింగ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గురువారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. సీఎం నుంచి అందిన ఆహ్వానం మేరకే రవీందర్‌సింగ్ ప్రగతిభవన్‌కు చేరుకున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. భేటీ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలు సిక్కు సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రవీందర్ సింగ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందిం చిన సీఎం రాబోయే రోజుల్లో పరిష్కారానికి హామీ ఇచ్చారు. రవీందర్‌సింగ్ వెంట సాదవేణి శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, వినయ్‌తో పాటు సిక్కు సామాజికవర్గం నాయకులు ఎక్బాల్ సింగ్, అర్బన్ సింగ్, ఇందర్‌సింగ్, దర్శన్‌సింగ్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిని ఆశించినా దక్కక! టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సర్దార్ రవీందర్ సింగ్ ఉద్యమ సమయంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో కరీంనగర్ మేయర్ పదవిని చేపట్టి దక్షిణ భారతదేశంలో ఈ పదవిని చేపట్టిన ఏకైక సిక్కు నాయకుడిగా రవీందర్‌సింగ్ నిలిచారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా 20 ఏండ్ల అనుభవం కలిగిన రవీందర్ సింగ్‌కు కరీంనగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. అయితే మంత్రి గంగుల కమలాకర్, రవీందర్ సింగ్ నడుమ నెలకొన్న విభేదాలు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరింత ముదిరినట్లు ప్రచారం జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించక పోవడం, ఈటల రాజేందర్‌తో కుమ్మక్కయినట్లు ప్రచారం జరగడంపై రవీందర్ సింగ్ మనస్తాపం చెందినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ గత నెల 18న ఇందిరాపార్క్ ధర్నా వేదిక సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యపడక పోవడంతో రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ సింగ్ 230కి పైగా ఓట్లు సాధించి టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు, రెండు దశాబ్దాలతో తనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని తనను కలవాలని రవీందర్ సింగ్‌కు సీఎం కబురు పంపినట్లు సమాచారం. కేసీఆర్‌తో విభేదించిన నేతలెవరూ తర్వాతి కాలంలో ఆయనను కలిసిన దాఖలాలు లేవు. దీంతో రవీందర్ సింగ్ ఎపిసోడ్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. -
రూపాయికే నల్లా కనెక్షన్
కరీంనగర్ బల్దియాలో కేసీఆర్ జన్మదిన కానుకగా ప్రకటించిన మేయర్ కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు నిర్ణరుుంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి ఈ పథకం అమలు చేస్తున్నట్లు మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.పేదల ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలుంటే బై నంబర్లు వేసి నల్లా ఇస్తామన్నారు. -
మాస్ లీడర్ టూ మేయర్
సింగ్ఈజ్ కింగ్ - సౌత్ ఇండియాలో ఏకైక సిక్కు మేయర్ కరీంనగర్ : మాస్ లీడర్ నుంచి నగర అత్యున్నత పదవి మేయర్‌గా ఎన్నికై సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకున్నారు సర్దార్ రవీందర్‌సింగ్. టీఆర్ఎస్ ఒడిదొడుకుల ప్రస్థానంలో నగరంలో ఆ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు ఆయన. తెలంగాణవాదం లేదు... గిలంగాణవాదం లేదు అని 2006లో మంత్రి ఎమ్మెస్సార్ చేసిన సవాల్‌ను స్వీకరించి ఉప ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నగరంలో అండదండగా నిలిచింది సర్దార్జీనే. 2006లో బీజేపీ పట్టణాధ్యక్ష పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న రవీందర్‌సింగ్... తన ఎనిమిదేళ్ల ప్రస్థానంలో పార్టీ బలోపేతంతోపాటు తెలంగాణ ఉద్యమాన్ని భుజానవేసుకుని అన్నివర్గాల ప్రజలను మమేకం చేశారు. మాస్‌లీడర్‌గా గుర్తింపుపొందిన సింగ్ పేరును ఉటంకిస్తూ కేసీఆర్ అనేక బహిరంగసభల్లో మాట్లాడడం ఎప్పటికైనా ఆయనకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందని అందరూ ఊహించారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సర్దార్జీ ఇప్పుడు మేయర్‌గా అరుదైన గౌరవమే దక్కించుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే సిక్కు సామాజికవర్గానికి మేయర్ పదవి వరించడం ఇదే మొదటిసారి. రవీందర్‌సింగ్ ఇప్పటికే రెండుసార్లు కౌన్సిలర్, ఓసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ఇప్పుడు మరోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించి ఏకంగా మేయర్ పదవి దక్కించుకున్నారు. రాజకీయ ప్రస్థానం 1964 ఆగస్టు 6న దన్నాభాయ్-లక్ష్మణ్సింగ్లకు జన్మించిన రవీందర్‌సింగ్ ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు కరీంనగర్‌లోనే సాగింది. ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో 1984లో కాలేజీ ప్రెసిడెంట్‌గా ఎన్నికై రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. 1987లో నాందేడ్‌లో న్యాయవిద్య పూర్తి చేసుకున్నారు. న్యాయవాదిగా ఉంటూనే 1995లో మొదటిసారిగా కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2006 వరకు బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగారు. 2000, 2005లో రెండుసార్లు బీజేపీ నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 2006లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2008లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అత్యధిక మెజార్టీతో ఎన్నికై కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ సమావేశ మందిరం, క్యాంటీన్ నిర్మాణం చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. 2010లో టీఆర్ఎస్ నగర అధ్యక్షునిగా నియామకమయ్యారు. 50 సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా ఉండడమే కాక ఆర్టీసీ టీఎంయూ కార్మిక సంఘం గౌరవాధ్యక్షునిగా, ట్రేడ్ యూనియన్ల గౌరవ సలహాదారుడిగా ఉన్నారు.