మాస్ లీడర్ టూ మేయర్
సింగ్‌ఈజ్ కింగ్
- సౌత్ ఇండియాలో ఏకైక సిక్కు మేయర్
కరీంనగర్ : మాస్ లీడర్ నుంచి నగర అత్యున్నత పదవి మేయర్‌గా ఎన్నికై సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకున్నారు సర్దార్ రవీందర్‌సింగ్. టీఆర్‌ఎస్ ఒడిదొడుకుల ప్రస్థానంలో నగరంలో ఆ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు ఆయన. తెలంగాణవాదం లేదు... గిలంగాణవాదం లేదు అని 2006లో మంత్రి ఎమ్మెస్సార్ చేసిన సవాల్‌ను స్వీకరించి ఉప ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు నగరంలో అండదండగా నిలిచింది సర్దార్‌జీనే.
2006లో బీజేపీ పట్టణాధ్యక్ష పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న రవీందర్‌సింగ్... తన ఎనిమిదేళ్ల ప్రస్థానంలో పార్టీ బలోపేతంతోపాటు తెలంగాణ ఉద్యమాన్ని భుజానవేసుకుని అన్నివర్గాల ప్రజలను మమేకం చేశారు. మాస్‌లీడర్‌గా గుర్తింపుపొందిన సింగ్ పేరును ఉటంకిస్తూ కేసీఆర్ అనేక బహిరంగసభల్లో మాట్లాడడం ఎప్పటికైనా ఆయనకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందని అందరూ ఊహించారు.
కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సర్దార్‌జీ ఇప్పుడు మేయర్‌గా అరుదైన గౌరవమే దక్కించుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే సిక్కు సామాజికవర్గానికి మేయర్ పదవి వరించడం ఇదే మొదటిసారి. రవీందర్‌సింగ్ ఇప్పటికే రెండుసార్లు కౌన్సిలర్, ఓసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ఇప్పుడు మరోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించి ఏకంగా మేయర్ పదవి దక్కించుకున్నారు.
రాజకీయ ప్రస్థానం
1964 ఆగస్టు 6న దన్నాభాయ్-లక్ష్మణ్‌సింగ్‌లకు జన్మించిన రవీందర్‌సింగ్ ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు కరీంనగర్‌లోనే సాగింది. ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో 1984లో కాలేజీ ప్రెసిడెంట్‌గా ఎన్నికై రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. 1987లో నాందేడ్‌లో న్యాయవిద్య పూర్తి చేసుకున్నారు. న్యాయవాదిగా ఉంటూనే 1995లో మొదటిసారిగా కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2006 వరకు బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగారు.
2000, 2005లో రెండుసార్లు బీజేపీ నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 2006లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2008లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అత్యధిక మెజార్టీతో ఎన్నికై కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ సమావేశ మందిరం, క్యాంటీన్ నిర్మాణం చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. 2010లో టీఆర్‌ఎస్ నగర అధ్యక్షునిగా నియామకమయ్యారు. 50 సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా ఉండడమే కాక ఆర్టీసీ టీఎంయూ కార్మిక సంఘం గౌరవాధ్యక్షునిగా, ట్రేడ్ యూనియన్ల గౌరవ సలహాదారుడిగా ఉన్నారు.