సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు జగిత్యాల జిల్లా ధర్మవురిలో సర్వే చేస్తూ ఆరుగురు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లు పట్టుబడిన ఉదంతంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏపీ, తెలంగాణ డీజీపీలకు నోటీసులు జారీ చేశారు. ఏపీ డీజీపీ నుంచి సమాధానం వచ్చాక దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ పదేళ్లపాటు ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని కావడంతో ఇక్కడ ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది పని చేయడంలో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ల వినియోగంపై విపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మహిళా శక్తికి ప్రతీక అయిన గులాబీ రంగులో మహిళలకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలనేది ఎన్నికల సంఘం ఆలోచన అని, ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో టీఆర్‌ఎస్ జెండా రంగు సైతం గులాబీ అన్న విషయం వారి దృష్టికి రాలేదన్నారు. సాధారణంగా బ్యాలెట్ పేపర్లు గులాబీ రంగులోనే ఉంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న గుర్తింపు పొందని 22 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులు కేటాయించిందన్నారు.
నవంబర్ 9 వరకు ఓటర్ల నమోదు!
ఓటర్ల తుది జాబితా ప్రచురించిన అనంతర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదుకు దాదాపు 3 లక్షల దరఖాస్తులొచ్చాయని రజత్ కుమార్ వెల్లడించారు. ఓటర్ల నమోదుకు నవంబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అదే నెల 19 వరకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదు తెలుసుకోవడానికి ప్రజలంతా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 970 మంది మహిళా ఓటర్లు ఉండేవారని, ఇటీవల ప్రచురించిన తుది జాబితా అనంతరం ఈ నిష్పత్తి 1000:981కు పెరిగిందన్నారు. 18, 19 ఏళ్ల వయసుగల యువతతోపాటు మహిళా ఓటర్ల నమోదు పుంజుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానల్లో ఓటర్ల జాబితాలను ఉర్దూలో, జుక్కల్, ముథోల్ అసెంబ్లీల జాబితాలను మరాఠీ భాషలో ప్రచురించే కార్యక్రమం పూర్తయిందని, ఆసక్తిగల వారు స్థానిక అధికారుల నుంచి ఈ జాబితాలను పొందవచ్చని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ రోజున వికలాంగులకు కల్పించనున్న సదుపాయాలను పరిశీలించేందుకు నవంబర్ 24 నుంచి 26 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు రాష్ట్రానికి రానున్నారన్నారు.
307 కంపెనీల కేంద్ర బలగాలు
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున మద్యం, డబ్బుల పంపిణీ జరుగుతోందని అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులొచ్చాయని రజత్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రూ. 31.14 కోట్ల నగదును, 65,364 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పోలీసు సిబ్బంది సరిపోతారని, పోలింగ్ నిర్వహణ కోసం 307 కంపెనీల కేంద్ర బలగాలను కోరామన్నారు. కేంద్ర బలగాల సంఖ్యపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. లైసెన్స్‌లేని 6 ఆయుధాలు, లైసెన్స్‌గల 7,411 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, 8,622 ముందుజాగ్రత్త కేసులు నమోదు చేశామని, 43,101 మంది పాత నిందితులను బైండోవర్ చేశామని, 3,765 కేసుల్లో వారెంట్లు జారీ చేశామని ఆయన చెప్పారు.
వివరణ అందాక కోడ్ ఉల్లంఘనలపై చర్యలు...
ప్రగతి భవన్, మినిస్టర్ల క్వార్టర్లలో టీఆర్‌ఎస్ కార్యకలాపాల నిర్వహణ విషయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరామని, వివరణ అందాక నిర్ణయం తీసుకుంటామని రజత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోడ్ ఉల్లంఘన పరిధిలోకే వస్తుందన్నారు. ప్రతిపక్షాల ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలపై డీజీపీ వివరణ కోరామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 59 ఫిర్యాదులు రాగా అందులో 11 ఫిర్యాదులను పరిష్కరించామని, 48 పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment