
సాక్షి, హైదరాబాద్: ఒకే ఇంట్లో 30 మందికి మించి ఓటర్లున్నారా? ఓటరు జాబితాలో పేర్లున్న 100 ఏళ్ల ఓటర్లలో బతికున్నవారెంతమంది? ఇంటి నంబరు లేని ఓటర్లు ఎవరెవరు? ఒకే విధమైన పేరు, తండ్రి పేరు, వయస్సు, ఫొటోలున్న డూప్లికేట్ ఓటర్లు ఎంత మందున్నారు? అన్న అంశంపై ఎన్నికల సంఘం లోతుగా పరిశీలన జరుపుతోంది. బోగస్ ఓటర్ల ఏరివేతలో భాగంగా పైన పేర్కొన్న నాలుగు రకాల అనుమానాస్పద ఓటర్ల వివరాలతో నివేదికలు రూపొందించి బూత్ స్థాయి అధికారుల(బీఎల్‌ఓ)కు అందజేయనుంది. బీఎల్‌ఓలు క్షేత్ర స్థాయికి వెళ్లి ఈ నివేదికల్లో పొందుపరిచిన ఓటర్ల గురించిన వివరాలపై విచారణ జరపనున్నారు. ఓటర్ల జాబితాలో లక్షల సంఖ్యలో ఇలాంటి బోగస్ ఓటర్లున్నారని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు ఆధారాలతో సహా హైకోర్టులో కేసువేసింది. దీంతో ఎన్నికల సంఘం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చింది. శాసనసభ ఎన్నికల పోలింగ్ రోజు లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం చెలరేగింది. ఏకంగా ఓటర్ల జాబితా నుంచి 22 లక్షల మంది అర్హుల ఓట్లు గల్లంతయ్యాయని విమర్శలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులైనా ఇంకా ఓటర్ల జాబితాలో లోపాలపై చర్చ జరుగుతుండటంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా ఓటర్ల జాబితా రూపొందించాలని నిర్ణయించింది. 2019 జనవరి 1 అర్హత తేదీగా ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణలో భాగంగానే.. ఈ ఏరివేతకు పూనుకుంది. ఒకవేళ బోగస్, చనిపోయిన, చిరునామా మారిన ఓటర్లు అని తేలితే సంబంధిత ఓటర్లను వచ్చే ఏడాది ప్రకటించనున్న ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సిఫారసు చేయనున్నారు.
బీఎల్‌వోలకు లోపాల చిట్టా!
ఓటర్ల జాబితాలో ఇంటినంబరు ఉండాల్సిన చోట ‘నో’, ‘న్యూ’, ‘ఓల్డ్’వంటి పదాలతో వేల సంఖ్యలో ఓటర్ల పేర్లున్నాయి. కనీసం మూడంకెలులేని బోగస్ ఇంటి నంబర్లతో సైతం పెద్ద సంఖ్య లో ఓటర్లున్నారు. ఇంటి నంబర్‌ను పేర్కొనకుండా ఖాళీగా ఉంచడం/సున్నా రాయడం/ఒకే అంకె ఇంటి నంబరున్న ఓటర్లు వేలలోనే ఉన్నారు. దీనిపై ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకే ఇంటి నంబరుతో 30, అం తకు మించిన సంఖ్యలో ఓటర్లుంటే వారి జాబితాలను ఎన్నికల సం ఘం సిద్ధం చేస్తోంది. 18 ఏళ్ల లోపు, 100 ఏళ్లు మించిన వయస్సు గల ఓటర్లు సైతం వేల సంఖ్యలో ఉన్నట్లు గుర్తించింది. చనిపోయినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ కుటుంబ సభ్యులెవరూ దరఖాస్తు చేయడం లేదు. దీంతో ఓటర్లు చనిపోయి దశా బ్దాలు గడుస్తున్నా వారి పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కొనసాగుతు న్నాయి. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఒకే ప్రాంతం/వేర్వేరు ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటర్ల జాబితాలో పేర్లు కలిగి ఉన్నారు. ఓటర్ల జాబితా వెబ్‌సైట్‌లో శోధించిన కొద్దీ ఒకే విధమైన వోటర్ ఐడీ, పేరు, వయస్సు, లింగం, చిరునామా, ఫొటోలు కలిగిన ఓటర్లు ఉన్నట్లు బయటపడుతున్నారు. ఈఆర్వో నెట్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఈ నివేదికలను ఎన్నికల సంఘం తయారు చేస్తోంది.
ఇంటి నంబరు ఆధారంగా..
నేషనల్ ఓటరు సర్వీస్ పోర్టల్ (https://electoralsearch.in)లో ఇంటి నంబర్ ఆధారంగా శోధించే సదుపాయం ఉండేది. శాసనసభ ఎన్నికలకు ముందు ఈ సదుపాయాన్ని తీసేశారు. కేవలం ఓటరు పేరుతో మాత్రమే శోధించే అవకాశముంది. అయితే భారీ స్థాయిలో మార్పులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మళ్లీ ఇంటి నంబరు ఆధారంగా ఓటర్లను శోధించేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ రజత్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడన్నా సక్కగవుతదా?
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015లో చేపట్టిన నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటిఫికేషన్ ప్రోగ్రాం (నెర్పార్) కింద 35,00,700 బోగస్ ఓటర్లను తొలగించారు. 2016లో చేపట్టిన ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమం కింద మళ్లీ 24,20,244 ఓటర్లను తీసేశారు. జనవరి 2015 నాటికి రాష్ట్ర ఓటర్ల జాబితాలో 2.84 కోట్ల మంది ఓటర్లుండగా, ఈ రెండు కార్యక్రమాల కింద ఏకంగా 59,20,944 ఓటర్లను తొలగించారు. దీనికి అదనంగా వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద గత నాలుగేళ్లలో ప్రతి ఏటా లక్ష నుంచి రెండు లక్షల బోగస్ ఓటర్లను తొలగించారు. బోగస్, చిరునామా మారి, చనిపోయిన ఓటర్లను మాత్రమే తొలగించామని సీఈఓ రజత్‌కుమార్ తెలిపారు. పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లను తొలగించి, బోగస్ ఓటర్లను జాబితాలో ఉంచారని ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 60 లక్షలకు పైగా బోగస్ ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంటున్నా ఓటర్ల జాబితాలో ఇంకా బోగస్ ఓట్లున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కీలకంగా మారింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించనున్న ఓటర్ల జాబితాలో మళ్లీ అవే పొరపాట్లు పునరావృతమైతే ఆ తర్వాత జరగనున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మరోసారి అభాసుపాలు కాకతప్పదని విమర్శలు వస్తున్నాయి.