సత్తెనపల్లి: తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్.. దానిని ఆన్‌లైన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచింది. జాబితాలో మీ పేరు ఉందో.. లేదో.. వెంటనే సరిచూసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ జాబితాలో మీ ఓటు లేకపోతే.. ఫారం–6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. మీ ఓటును సంబంధిత పోలింగ్ కేంద్రం బూత్ లెవల్ అధికారి వద్ద గానీ, స్మార్ట్‌ఫోన్, వెబ్‌సైట్‌ల ద్వారా గానీ సులభంగా తెలుసుకోవచ్చు.
‘స్మార్ట్’గా తెలుసుకోండిలా..
https://ceoandhra.nic.in వెబ్‌సైట్‌లోకి వెళితే పైభాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు అనే విభాగం కనిపిస్తుంది. అక్కడ తుది జాబితా–2024పై క్లిక్ చేసి మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం నమోదు చేయాలి. ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్‌లో వస్తాయి. మీ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్‌లోడ్ చేసుకొని.. మీ ఓటు ఉందో? లేదో? చూసుకోవచ్చు. అలాగే https://voterportal.eci.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేసి.. మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్‌ను నమోదుచేస్తే జాబితాలో మీ పేరు ఉందో..? లేదో..? ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది? సీరియల్ నంబర్ ఎంత? తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ తెలియకపోతే.. ‘అడ్వాన్స్ సెర్చ్’ విభాగంలోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, శాసనసభ నియోజకవర్గం వివరాలు పొందుపరిచి జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు.
అలాగే www. nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళితే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై డీటెయిల్స్,’ ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు నమోదు చేసి లేదా ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు.
ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌తో చిటికెలో..
గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘ఓటర్ హెల్ప్ లైన్’ యాప్ ఉంటుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకొని.. లాగిన్ కావాలి. యాప్‌లో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్‌కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఓటు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. కార్టు నంబర్ ఉంటే ఎపిక్ నంబర్ ద్వారా సరిచూసుకోవచ్చు. లేకపోతే మీ పేరు, తండ్రి పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపరచడం ద్వారా తెలుసుకునే వీలుంది.
పోలింగ్ కేంద్రంలోనూ అవకాశం..
ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ అధికారి ఉంటారు. వారి వద్ద ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా ఉంటుంది. అందులో మీ ఓటు ఉందో? లేదో? సరిచూసుకోవచ్చు. ఓటు లేకపోతే వెంటనే బీఎల్‌వో ద్వారా గానీ వెబ్‌సైట్ ద్వారా గానీ ఫారం –6 పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment