AP: రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్‌ | CEC Rajeev Kumar Press Meet At Vijayawada On AP Elections Voters List | Sakshi
Sakshi News home page

AP: రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్‌

Published Wed, Jan 10 2024 6:10 PM | Last Updated on Wed, Jan 10 2024 6:38 PM

CEC Rajeev Kumar Press Meet At Vijayawada AP Elections Voters List - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ఇది శుభపరిణామమని తెలిపింది. బుధవారం సాయంత్రం సీఈసీ రాజీవ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా వివరాలతో పాటు పలు కీలకాంశాలను వివరించారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.  

రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు ​కాగా పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు రాజీవ్‌ కుమార్‌. వచ్చే ఎన్నికల్లో సీనియర్‌ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందన్నారు. 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.

సీఈసీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం. నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి.  
చదవండి: రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్‌!  

ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది.  అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం. అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి . సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు.  కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.  70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది.

ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయి. ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు తీసుకోవాలి. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలి.(పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాదు, ఎక్కడ నివసిస్తే.. అక్కడ అని అర్థం). రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా.. ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం’ అని సీఈసీ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement