సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పచ్చ మీడియా పైత్యం హద్దులు దాటుతోంది. రాజ్యాంగ వ్యవస్థలను సైతం తన కుట్రల్లోకి లాగుతూ అడ్డగోలుగా బురద జల్లుతోంది. ఎన్నికల సంఘంలో డేటా నిర్వహణ ప్రొటోకాల్స్‌పై అవగాహన లేకుండా పిచ్చిరాతలతో బొక్కబోర్లాపడింది. పబ్లిక్ డొమైన్‌లో ఎవరైనా సులభంగా యాక్సెస్ చేయగల డేటాను.. వైఎస్సార్సీపీ కోసం ఐప్యాక్ సభ్యులు దొంగలించారంటూ మంగళవారం ‘ఈసీలో దొంగలు పడ్డారు’ పేరుతో కథనాన్ని అచ్చేసి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం (సీఈఓ) తీవ్రంగా స్పందించింది. సీఈఓ పనితీరు, ఐటీ వ్యవస్థ నిర్వహణపై అవగాహన లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం, తమ నుంచి ఎలాంటి స్పష్టత తీసుకోకుండానే ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వార్తను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇటువంటి నిరాధార ఆరోపణలు సీఈఓ కార్యాలయ సమగ్రతను, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది.
ఈ డేటాను ఎవరైనా తీసుకోవచ్చు..
భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్వో నెట్ 2.0ను అమలుచేస్తోంది. దేశంలోని మొత్తం డేటాబేస్‌ను సైబర్ సెక్యూరిటీ నిబంధనలను పాటిస్తూ ఈసీఐ తన సర్వర్ ద్వారా నిర్వహిస్తుంది. అంతేగానీ.. ఈసీఐ సర్వర్ ఒక రాష్ట్ర సీఈఓ నిర్వహణలో ఉండదు. ఇక్కడ ఈసీఐ నిర్దేశించిన అత్యాధునిక భద్రతా చర్యలు, అత్యంత పారదర్శకంగా ఉండే డేటాఫ్రేమ్ వర్క్‌లోనే సీఈఓ కార్యాలయం పనిచేస్తుంది.
వాస్తవానికి.. రాష్ట్ర సీఈఓ కార్యాలయంలోని ఈఆర్వో నెట్‌లో రెండు రకాలుగా డేటా అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్రస్తుత ఓటర్ల జాబితా డేటా, ఓటర్ల జాబితాలో మార్పులు–చేర్పులు, తొలగింపులకు వచ్చిన దరఖాస్తు ఫారాలకు సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది. ఇది పబ్లిక్ డొమైన్‌లో.. అంటే సీఈఓ వెబ్‌సైట్ ద్వారా సాధారణ ప్రజలు సైతం చూడొచ్చు. మరోవైపు.. ఓటర్ల జాబితా ప్రచురణ సమయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ లకు హార్డ్‌డిస్‌్కలలో దీనిని అందిస్తుంది.
ఈ డేటాను సీఈఓ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా ఓటర్లు తమ ఓటులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సవరించిన జాబితా సైతం సీఈఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిని ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని ప్రతీవారం ఈఆర్వో, డీఈఓలు అన్ని రాజకీయ పార్టీలతోనూ పంచుకుంటారు. వాస్తవానికి.. ఈసీఐ నియంత్రణలో ఉన్న ఈఆర్వోనెట్ సర్వర్‌కు సీఈఓ, డీఈఓ, డీఆర్వోకి పరిమితంగా యాక్సెస్ ఉంటుంది. ఓటర్ల జాబితా, మార్పులుచేర్పులు అభ్యర్థనలు.. ఈ రెండురకాల డేటా మినహా మరే ఇతర డేటాను సీఈఓ స్థాయిలో యాక్సెస్ చేయలేరు.
సీఈఓ సైతం ఈసీఐని అడగాల్సిందే..
ఏప్రిల్ 2023లో ఈసీఐ ఈఆర్వో నెట్ 2.0ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈసీఐ ఆయా రాష్ట్రాల ఓటర్ల జాబితా మొత్తాన్ని తన సర్వర్‌లో భద్రపరిచింది. ఏ రాష్ట్ర సీఈఓ కార్యాలయం అయినా పాత డేటా కావాలంటే ఈసీఐ దృష్టికి తీసుకెళ్లాల్సిందే.
అలాంటిది.. అంతభద్రంగా దాచిన డేటాను తొలగించడం అనేది అసాధ్యం. కానీ, పచ్చమీడియా మాత్రం 2021, 22 సంవత్సరాలకు సంబంధించిన డేటాను ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సాయంతో కొంతమంది దొంగలించారని బరితెగించి అసత్య ఆరోపణ చేస్తోంది. ఎవ్వరూ ఈసీఐ సర్వర్‌ను యాక్సెస్ చేయలేనప్పుడు ఆ డేటా ఎలా దొంగిలిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Comments
Please login to add a commentAdd a comment