సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున డూప్లికేట్, బోగస్ ఓటర్లున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు, అందజేసిన డేటా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. 18 లక్షల మంది అటు తెలంగాణ.. ఇటు ఏపీలోనూ ఓటర్లుగా ఉన్నట్లు డేటాతో సహా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఇచ్చారని, ఆ డేటా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆయా చిరునామాల్లో లేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని సిసోడియా స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా సవరణ, డూప్లికేట్ ఓట్లతో పాటు వివిధ ఆంశాలపై ఆయన సచివాలయంలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. 25 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారనే డేటా ఆధారంగా తనిఖీలు నిర్వహించి డూప్లికేట్ ఓట్లను తొలగిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. రాష్ట్రంలో 3.70 కోట్ల మంది ఓటర్లున్నారని, కానీ.. ప్రస్తుతం 3.50 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, అంటే 2014 నుంచి ఇప్పటివరకు 20 లక్షల మంది ఓటర్లు తగ్గినట్లు తెలుస్తోందన్నారు. మృతిచెందిన వారి, వలస వెళ్లిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు డూప్లికేట్ ఓట్లను కూడా అప్పుడు తొలగించారన్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల కమిషన్ 3.50 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు చర్యలను చేపట్టామని ఆయన తెలిపారు.
కొత్తగా 32లక్షల మంది దరఖాస్తు
సాధారణంగా రాష్ట్ర జనాభాలో 70 శాతానికి మించి ఓటర్లు ఉండరాదని, అలా ఉంటే బోగస్ ఓట్లు ఉన్నట్లేనని సిసోడియా తెలిపారు. అయితే, ప్రస్తుతం జనాభాలో 67.3 శాతం మంది ఓటర్లున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకా సమయం ఉన్నందున ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించడం ద్వారా బోగస్, డూప్లికేట్, రాష్ట్రంలో లేని వారి పేర్లను జాబితా నుంచి తొలగించి వచ్చే ఎన్నికల నాటికి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందిస్తామని ఆయన స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా సవరణకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగా 32 లక్షల మంది ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 80 శాతం వరకు యువతీ, యువకులేననన్నారు. ప్రస్తుతం దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగుతోందని, సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులను ఓటరుగా నమోదు చేస్తామన్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 4న ప్రకటిస్తామన్నారు.
బెంగళూరుకు 1.50లక్షల ఈవీఎంలు
రానున్న సార్వత్రిక ఎన్నికలకు 1.13 లక్షల వీవీ ప్యాట్స్(ఓటరు వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) అవసరమని, అవి ఇప్పటికే రాష్ట్రానికి రావడం ప్రారంభమైందని సిసోడియా తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.50 లక్షల ఈవీఎంలున్నాయని, అవన్నీ అల్యూమినియంతో తయారై ఉన్నందున వాటిని స్టీలుతో మరింత పటిష్టపర్చనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1.50 లక్షల ఈవీఎంలను బెంగళూరు పంపిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమం ముగిసినప్పటికీ అది నిరంతర ప్రక్రియ అని, ఎవరైనా ఓటరుగా నమోదుకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాలను జియోలాజికల్ ఇన్ఫర్‌మేషన్ వ్యవస్థలోకి తీసుకువస్తున్నామని.. దీనివల్ల ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment