సాక్షి, అమరావతి: ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడంతో విపక్షం దొంగ నాటకానికి తెర పడింది! వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెగబడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో లక్షల సంఖ్యలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు.
ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది మంది అధికార పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించడం గమనార్హం. మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు మూడింతలు అధికంగా నకిలీ దరఖాస్తులు అందాయి.
దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన జిల్లా కలెక్టర్లు వీటిల్లో 80 నుంచి 90 శాతం వరకు బోగస్ దరఖాస్తులేనని ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కోనేరు సురేష్ పై ఐపీసీ సెక్షన్ 182, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది.
నాడు సేవామిత్ర.. నేడు మైపార్టీ డ్యాష్ బోర్డ్
గతంలో సేవామిత్ర యాప్ తరహాలోనే తాజాగా మైపార్టీ డ్యాష్ బోర్డ్ డాట్‌కామ్ వెబ్‌సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులను గంపగుత్తగా సమర్పించింది. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్న వారిని బతికున్నా చనిపోయినట్లుగా చిత్రీకరించడంతోపాటు అర్హులైన ఓటర్లను నకిలీలుగా, స్థానికంగా నివాసం ఉంటున్నా శాశ్వతంగా వలస వెళ్లినట్లు పేర్కొంటూ వీటిని దాఖలు చేసింది. మరికొందరిని రెండు ప్రదేశాల్లో రెండు ఓట్లు ఉన్నట్లు తప్పుడు సమాచారం సమర్పించి జాబితా నుంచి తొలగించే వ్యూహం రచించింది.
కుప్పలు తెప్పలుగా అందిన ఫారం 7 దరఖాస్తుల్లో 70 నుంచి 80 శాతం తప్పుడువేనని తేల్చుతూ ఎన్నికల సంఘానికి కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అక్కడ కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలపై ప్రత్యేకంగా గురి పెట్టి అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ బోగస్ దరఖాస్తులను సమర్పిస్తోంది.
నెల్లూరులో సింహభాగం నకిలీ
♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 11,291 ఓట్లు తొలగించాలంటూ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోనేరు సురే‹Ùతో కలిసి ఫారం 7 దరఖాస్తులు సమర్పించారు. వాటిలో 85 శాతానికి పైగా బోగస్ అని అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లాలోని మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ ఇదే కథ.
విజయనగరం 4 నియోజకవర్గాల్లో
♦విజయనగరం జిల్లాలో రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన 19,407 మంది ఓట్లు తొలగించాలని కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7లను ఎన్నికల సంఘానికి సమర్పించాడు.
♦ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన విజయనగరం జిల్లా కలెక్టర్ 8,318 ఫారం 7లు తప్పుడువని తేల్చుతూ నివేదిక ఇచ్చారు.
కర్నూలులో 88 శాతం బోగస్
♦కర్నూలు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజక వర్గాల్లో 67,370 ఓట్లు తొలగించాలంటూ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశాడు. వీటిలో అత్యధికంగా కోడుమూరులో 17,576, ఆదోనిలో 13,968, ఆలూరులో 11,581 బోగస్ దరఖాస్తులున్నాయి.
♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీటిపై బీఎల్వోలు, డిప్యూటీ తహసిల్దార్లు, తహసిల్దార్లతో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించగా 59,054 ఫారం 7లు బోగస్ అని తేలింది. అంటే 88 శాతం తప్పుడు ఫారం 7లు సమర్పించినట్లు స్పష్టమవుతోంది. 11,935 మంది బతికే ఉన్నా వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి వారి ఓటు హక్కును కాలరాసేందుకు టీడీపీ కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది.
అన్నమయ్య.. అక్రమ మార్గంలో
♦ అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన 40,358 మంది ఓట్లు తొలగించాలంటూ కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి అందచేశాడు.
♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ 25,097 దరఖాస్తులు నకిలీవని నిర్థారించారు. అక్కడ ఆరు నియోజకవర్గాల్లో 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లుగా చిత్రీకరించి టీడీపీ తప్పుడు దరఖాస్తులు సమర్పించినట్లు బహిర్గతమైంది.
Comments
Please login to add a commentAdd a comment