
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, ప్రభుత్వ ప్రాంగణాలను పార్టీ లు దుర్వినియోగపరచరాదన్నారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పోస్టర్లను 24 గంటల్లోగా తొలగించాలన్నారు. అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వే వంతెనలు, రహదారులు, బస్సులకు తగిలించిన ప్రచార సామగ్రిని 48 గంటల్లోగా తొలగించాలని, యజమానుల అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్తులపై ప్రచార సామగ్రి ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులొస్తే 72 గంటల్లోగా తొలగించాలని సూచించారు.
అధికారిక వాహనాలపై నిషేధం..: ప్రభుత్వాధికారులు మినహా రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికల వ్యవహారాల్లో పాల్గొనే వ్యక్తులు అధికారిక వాహనాలు వినియోగించడంపై నిషేధం అమల్లోకి వచ్చిందని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ నాయకుల ఫొటోలు ఉండరాదన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రతి జిల్లా, సీఈఓ కార్యాలయంలో 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1950 కాల్ సెంటర్‌తోపాటు వెబ్‌సైట్ ఆధారంగా ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. ఫిర్యాదులపై ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు కలెక్టర్లు నివేదిక సమర్పిస్తారని, ఫిర్యాదులన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి, నిర్మాణ పనులు, ఇంకా ప్రారంభం కాని పనుల జాబితాలను 72 గంటల్లోగా కలెక్టర్లు సమర్పిస్తారని, ఎక్కడైనా కొత్త పనులు ప్రారంభించినట్లు ఫిర్యాదులొస్తే ఈ జాబితాల ఆధారంగా కోడ్ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిధులతో జారీ చేసే ప్రకటనలపై గత నెల 28 నుంచే సమీక్షిస్తున్నామన్నారు.
రంగంలోకి నిఘా బృందాలు...
అభ్యర్థుల ఎన్నికల వ్యయంతోపాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై నిఘా కోసం ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, వీడియో బృందాలు, మొబైల్ బృందాలను తక్షణమే ఏర్పాటు చేస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. డబ్బు, మద్యం పంపిణీ జరకుండా వెంటనే విస్తృత స్థాయిలో తనిఖీలను ప్రారంభిస్తున్నామన్నారు. కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని బ్యాంకు లావాదేవీలను సమీక్షిస్తున్నామన్నారు. ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫిర్యాదులొస్తేనే చర్యలు తీసుకోవడానికి అవకాశముంటుందన్నారు. అవసరమైతే ఫిర్యాదులపై సైబర్ పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ సంస్థలు సహకరించేందుకు ముందుకు వచ్చాయని రజత్ కుమార్ చెప్పారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటనకు రానుందన్నారు.
ఎన్నికల సిబ్బంది, పోలీసు బలగాలు రెడీ...
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎన్నికల సిబ్బంది, పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయని రజత్ కుమార్ తెలిపారు. సీఈఓ, జిల్లా అధికారుల కార్యాలయాలకు అవసరమైన ఎన్నికల సిబ్బందితోపాటు ఈఆర్వోలు, అదనపు ఈఆర్వోలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓల నియామకం పూర్తి అయిందన్నారు. 32,574 పోలింగ్ కేంద్రాలకు బీఎల్‌ఓలను నియమించామన్నారు. సీఈఓ కార్యాలయానికి 60 మంది సిబ్బందిని కోరగా అందులో మరో 12 మంది నియామకం జరగాల్సి ఉందన్నారు. పోలీసులు సైతం పూర్తి సన్నద్ధతో ఉన్నారని, ఈ అంశంపై డీజీపీతో చర్చించామన్నారు. ఎన్నికల అవసరాల కోసం దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అదనపు బలగాలు, అధికారుల సేవలను సైతం వినియోగించుకుంటామన్నారు.
ఈసీకి ఆధికారముంది !
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో లోపాలపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయని హైకోర్టుకు ఫిర్యాదు వచ్చిందని, ఇందుకు తీసుకున్న చర్యలపట్ల హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేశాకే తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని, హైకోర్టు ఇచ్చే ఆదేశాలను పాటిస్తామన్నారు. ఓటర్ల జాబితా సిద్ధం కాకముందే ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడం సరైనదేనా అని ప్రశ్నించగా చట్టబద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ అధికారముందన్నారు. కొత్త ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, నవంబర్ 19తో నామినేషన్ల గడువు ముగియనుండగా దానికి 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశముంటుందని రజత్ కుమార్ చెప్పారు.
ఒకట్రెండు రోజుల్లో బదిలీలపై మార్గదర్శకాలు...
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ, పోలీసు అధికారుల బదిలీలపై ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలొస్తాయని రజత్ కుమార్ చెప్పారు. ఒకేచోట మూడేళ్లకు మించి పని చేస్తున్న వారిని, సొంత ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, పోలీసు అధికారులను ఎన్నికల విధుల్లో వినియోగించుకోకుండా గత ఎన్నికల సందర్భంగా బదిలీ చేశారని, ఈ ఎన్నికల్లో అమలు చేయాల్సిన బదిలీలపై ఆదేశాలొచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు రజత్ నిరాకరించారు.