సమీక్షలో మాట్లాడుతున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్. చిత్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను క్షేత్ర స్థాయికి పిలిపించి స్పాట్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారుల (ఈఆర్వో)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ ఆదేశించారు. ఫిర్యాదులందిన మరుసటి రోజు స్వయంగా ఈఆర్వోలు, ఎన్నికల బృందాలు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని సూచించారు. ఈ పరిశీలనలో తప్పులను గుర్తిస్తే సరిదిద్దాలని, తప్పులు లేకుంటే పాత సమాచారంతో ఫిర్యాదు చేశారని రాజకీయ పార్టీలను కన్విన్స్ చేయాలని ఈఆర్వోలకు సూచించినట్లు రావత్ వెల్లడించారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన నిర్దిష్ట ఫిర్యాదులను సంబంధిత ఈఆర్వోలకు పంపించామని, ఫిర్యాదుల పరిశీలన పురోగతిలో ఉందన్నారు. ఓటర్ల జాబితా శుద్ధీకరణకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకోసం తెలంగాణకు వచ్చిన ఓపీ రావత్.. మూడ్రోజుల పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) రజత్ కుమార్, ఇతర అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్ల పట్ల కొంత ఆందోళనతో రాష్ట్ర పర్యటనకు వచ్చామని, సమీక్ష అనంతరం సీఈవో, కలెక్టర్లు, ఎస్పీలు తీసుకున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు.
ప్రజా పండుగలా ఎన్నికలు
రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ప్రజా పండుగలా నిర్వహించాలని రాష్ట్ర, జిల్లా ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తుందని ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఎలాంటి భయాందోళనలు, ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని సూచించామన్నారు. ఎన్నికల నిర్వహణలో నిర్భయంగా, తటస్థంగా, స్వతంత్రంగా ఉండాలని, రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదుశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ‘పెద్ద మొత్తంలో డబ్బులు, మద్యం పంపిణీ జరుగుతోందని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులొచ్చాయి. వీటి నియంత్రణ చర్యల కోసం ఆదాయ పన్ను, ఎక్సైజ్, రవాణా, బ్యాంకర్స్ కమిటీ, విమానాశ్రయాలు అధికారులతో చర్చించాం. ఎన్నికల కోడ్ అమలుకు ఫ్లైయింగ్ స్క్వాడ్‌ల సంఖ్యను పెంచుతున్నాం. రైలు, వాయు, బ్యాంకింగ్ ద్వారా జరిగే డబ్బుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు.
మేనిఫెస్టోలపై పరిమిత అధికారాలే!
రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలపై ఎన్నికల సంఘానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని, హామీలను ఎలా అమలు చేస్తారు? వనరులేంటి? అనే సమాచారాన్ని మాత్రమే పార్టీల నుంచి కోరతామని రావత్ వెల్లడించారు. ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలకు 24 గంటల్లోగా అనుమతులు జారీ చేయాలని ఈఆర్వోలను ఆదేశించామన్నారు. కాగా, ఎన్నికల కోడ్ అమలులో పక్షపాత వైఖరితో వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు కోరాయన్నారు. డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు, కానుకల టోకెన్ల పంపిణీని నియంత్రించాలని కోరినట్లు రావత్ వెల్లడించారు. పొరుగు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రాష్ట్రంలో డబ్బులు, మద్యం పంపిణీకి సహకరిస్తున్నారని ఓ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేసిందని, వివరాలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. బురఖా ధరించి వచ్చే ముస్లిం ఓటర్లను గుర్తించేందుకు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు/మహిళా పోలింగ్ అధికారులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. వికలాంగ ఓటర్ల నమోదు, వారు ఓటు హక్కు వినియోగించుకునేలా సదుపాయాలకల్పన కోసం తొలిసారిగా ఎలక్షన్ యాక్ససబిలిటీ అబ్జర్వర్లను పంపుతున్నామన్నారు. అంధ ఓటర్లకు బ్రెయిలీలో బ్యాలెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు.
సిబ్బందికి క్యాష్‌లెస్ వైద్యం
ఎన్నికల విధుల్లో అస్వస్థతకు గురయ్యే సిబ్బందికి.. సమీపంలోని అత్యుత్తుమ ఆస్పత్రిలో క్యాష్‌లెస్ సదుపాయం కల్పించాలని సూచించగా.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంగీకరించారన్నారు. మారుమూల ప్రాంతాల్లో అస్వస్థతకు లోనైతే వారిని తరలించడానికి ఏయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. శాంతి భద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహించామని, భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రావత్ పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలను వినియోగిస్తామని ఆయన వెల్లడించారు. మహిళా పోలింగ్ బూత్‌ల్లో ఎక్కడా గులాబీ రంగు కనిపించదన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావస, బృందంలోని ఇతర అధికారులు ఉమేష్ సిన్హా, సందీప్ సక్సేనా, సందీప్ జైన్, చంద్రభూషణ్ కుమార్, దిలీప్ శర్మ, ధీరేంద్ర ఓజా, సుందర్ భయిల్ శర్మ, ఎస్‌కె రుడోలా పాల్గొన్నారు.
నేర చరిత్ర ప్రకటన తప్పనిసరి
అభ్యర్థులు తమ నేర చరిత్రను తప్పనిసరిగా ప్రకటించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్ల నమూనాలో మార్పు లు చేశామన్నారు. అభ్యర్థులు.. తమ నేర చరిత్రను 3 పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ప్రకటనల రూపంలో ప్రసారం చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల అఫిడవిట్లను 24 గంటల్లోగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. గత ఎన్నికల్లో నమోదైన కేసుల్లో కేవలం 25% మాత్రమే కోర్టుల్లో రుజువయ్యాయని.. ఈసారి కేసుల నమోదు సమయంలోనే అన్ని రకాల ఆధారాలను సేకరించాలని, బాధ్యుల పేర్ల ను రికార్డు చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించామన్నారు. నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదుల స్వీకరణకు ‘సీ–విజిల్’యాప్ వినియోగంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోని 38 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల పరిధిలో ఉన్నాయని, గందరగోళం ఏర్పడకుండా ఈవీఎంలకు కలర్ కోడింగ్ చేస్తున్నట్లు సీఈఓ చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment