వివక్షాపూరిత సెక్షన్‌ విరగడ | Supreme Court Verdict On Section 497 | Sakshi
Sakshi News home page

వివక్షాపూరిత సెక్షన్‌ విరగడ

Published Fri, Sep 28 2018 12:24 AM | Last Updated on Fri, Sep 28 2018 12:24 AM

Supreme Court Verdict On Section 497 - Sakshi

మారుతున్న సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా కాలదోషం పట్టిన చట్టాలను యధావిధిగా కొనసాగించటం అనర్ధదాయకం. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరం. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ తరహా చట్టాలను వదుల్చుకుందామని మంత్రిత్వ శాఖలన్నిటికీ తాఖీదులిచ్చారు. ఆ కసరత్తు పర్యవసానంగా అనంతరకాలంలో చాలా చట్టాలు రద్దయ్యాయి. గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం చెల్లదంటూ చెప్పిన భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) లోని సెక్షన్‌ 497 కూడా నిజానికి ఆ కోవలోకే వస్తుంది. కానీ దాన్ని రద్దు చేస్తే వైవాహిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్న కారణంతో కేంద్రం దాని జోలికి పోలేదు. భార్యతో లైంగిక సంబంధం ఏర్పరుచుకున్న వ్యక్తిపై నేరం మోపడానికి, అతనికి శిక్ష పడేలా చేయటానికి భర్తకు ఈ సెక్షన్‌ వీలు కల్పిస్తోంది.  ఈ నేరంలో వేరే వ్యక్తితోపాటు తన భార్య కూడా భాగస్వామే అయినా భర్త ఆమెపై కేసు పెట్టలేడు. ఈ నేరం రుజువైతే నిందితుడికి అయిదేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.

విచిత్రమేమంటే భర్త అనుమతితో అతడి భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఈ సెక్షన్‌ నేరంగా పరిగణించదు. ఇలాంటి నేరాల్లో మహిళలను శిక్షించాలని చెప్పటం లేదు గనుక ఈ సెక్షన్‌ వారికి అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది.  లోతుగా పరిశీలిస్తే ఇందులో దాగి ఉన్న వివక్ష తేటతెల్లమవుతుంది. భార్యను అసలు సజీవమైన వ్యక్తిగా ఈ సెక్షన్‌ పరిగణించటంలేదని అర్ధమవుతుంది. ఐపీసీలో ఈ సెక్షన్‌ను కొన సాగించటంపై మీ అభిప్రాయమేమిటని సుప్రీంకోర్టు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం విచిత్రమైన జవాబిచ్చింది. ‘వైవాహిక వ్యవస్థకూ, దాని పవిత్రతకూ భారతీయ విలువలు అత్యున్నత ప్రాముఖ్యతనిస్తాయి. ఈ సెక్షన్‌ను కొట్టేస్తే ఆ విలువలకు హాని కలుగుతుంది’ అని కేంద్రం వివరించింది. అయితే మహిళల ప్రాథమిక హక్కులకు ఇది విఘాతం కలిగిస్తున్నదని గుర్తించలేకపోయింది. మహిళా సంఘాలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని చాన్నాళ్లుగా కోరు తున్నాయి. ఈ చట్టం భార్యాభర్తలిద్దరినీ సమాన భాగస్వాములుగా కాక భర్తను యజమానిగా, భార్యను బానిసగా చూస్తున్నదని ఆ సంఘాలు అంటున్నాయి. ఇలాంటి కీలకమైన అంశంలో ధర్మాసనంలోని అయిదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పునివ్వడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

సెక్షన్‌ 497 దృష్టిలో వివాహిత భర్త ఆస్తి లేదా వస్తువు. ఆస్తిని అపహరించిన వ్యక్తిపై కేసు పెట్టిన విధంగానే తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిపై కూడా ఈ సెక్షన్‌ కింద భర్త కేసు పెట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన ఒక వైవాహిక వివాదాన్ని విచారిస్తున్నప్పుడు 2011లో సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ కొనసాగింపును ప్రశ్నించింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిపై తాను ఈ సెక్షన్‌ కింద కేసు ఎందుకు పెట్టరాదని ఒక మహిళ ప్రశ్నించింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. అయితే ఈ సెక్షన్‌ కేవలం మగవాడికి మాత్రమే ఆ హక్కునిస్తున్నదని ధర్మాసనం అభిప్రాయపడి కేసు కొట్టేసింది.  2016లో సుప్రీంకోర్టు ముందుకొచ్చిన కేసు కూడా ఈ తరహాదే. వేరే వ్యక్తితో తన భార్య సంబంధం పెట్టుకున్నప్పుడు కేవలం అతనిపై మాత్రమే కేసు పెట్టాలన్న నిబంధన ఎలా సరైందని ఆ పిటిషనర్‌ ప్రశ్నించాడు. సమాజం ఇలాంటి వైవాహికేతర బంధాన్ని నైతిక తప్పిదంగా పరిగణిస్తుంది. అది విడాకులకు ఒక ప్రాతిపదిక కూడా అవుతుంది. ఆ సంబంధాలు ఆత్మహత్యకు దారితీస్తే అందుకు ప్రేరేపించిన కేసు(సెక్షన్‌ 306) పెట్టొచ్చు. అయితే సెక్షన్‌ 497 అలాంటి సంబంధంలోకెళ్లినవారిలో కేవలం పురుషుడే తప్పు చేసినట్టు పరిగణిస్తుంది. 

బ్రిటిష్‌ ఏలుబడిలో థామస్‌ మెకాలే నేతృత్వంలో 1834లో మొదటి లా కమిషన్‌ ఏర్ప డినప్పుడు ఇలాంటి సంబంధాలను కేవలం సివిల్‌ తగాదాగా భావించింది. కానీ జాన్‌ రోమిలీ నేతృత్వంలోని రెండో లా కమిషన్‌ సిఫార్సు మేరకు సెక్షన్‌ 497 కింద దీన్ని క్రిమినల్‌ నేరంగా 1860లో మార్చారు. అయితే జమ్మూ–కశ్మీర్‌లో 1932లోనే ఈ సెక్షన్‌ కిందికి భార్యను కూడా తీసుకొచ్చారు. మన దేశంలో హిందూ కుటుంబ చట్టం మినహా క్రైస్తవ, ముస్లిం, పార్సీ తదితర మతాలకు చెందిన కుటుంబ చట్టాలు విడాకులు తీసుకోవడానికి ఇతర కారణాలతోపాటు వివాహేతర సంబంధాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. పైగా దంపతులిద్దరికీ సమానంగా ఈ హక్కు కల్పిస్తున్నాయి. హిందూ కుటుంబ చట్టం మాత్రం వివాహేతర సంబంధాలను విడాకులకు ప్రాతిపదికగా భావిస్తున్నా... దాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణించి, దాని కింద కేసు పెట్టే అధికారం ఒక్క భర్తకు మాత్రమే ఇస్తోంది.  

నేర న్యాయ వ్యవస్థలో తీసుకురావల్సిన సంస్కరణలపై నియమించిన జస్టిస్‌ వీఎస్‌ మాలిమత్‌ కమిటీ వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించటాన్ని వ్యతిరేకించకుండా దాన్ని దంపతులిద్దరూ సమానంగా ఉపయోగించుకునేలా మార్చాలని సూచించింది. 1972లో ఐపీసీకి సవరణలు తీసుకొస్తూ రూపొందించిన బిల్లులో సెక్షన్‌ 497ను మహిళలపై కూడా కేసు పెట్టేవిధంగా మార్చారు. అయితే అది పార్లమెంటు ముందుకు రాకుండానే మూలనబడింది. అనంతరకాలంలో పలుమార్లు ఈ సెక్షన్‌ ఉనికిని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలైనా వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది. ఇన్నేళ్లకు ఆ సెక్షన్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వివాహేతర సంబంధాలకు లైసెన్స్‌నివ్వడంగా కొందరు అభివర్ణిస్తున్నారు. కానీ అది సరికాదు. భార్యాభర్తలిద్దరినీ సమానులుగా చూడకపోవడాన్ని, ఆమెను బానిసగా, ప్రాణం లేని వస్తువుగా పరిగణించడాన్ని తీర్పు ఎత్తిచూపింది. ఇంత వివక్షాపూరితమైన సెక్షన్‌ భారతీయ శిక్షాస్మృతిలో 158 ఏళ్లపాటు కొనసాగడం ఒక వైచిత్రి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement