Section 497
-
377, 497 సెక్షన్లు మళ్లీనా?
కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. పలు కీలకాంశాలపై ముఖ్యమైన సవరణలను తెరపైకి తెచ్చింది. స్వలింగ సంపర్కం (సెక్షన్ 377, వివాహేతర సంబంధాలు (సెక్షన్ 497)లను మళ్లీ నేరాలుగా పరిగణించే అంశాన్ని పరిశీలించేలా ముసాయిదా నివేదికను రూపొందించింది. ఈ రెండు సెక్షన్లను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి విదితమే. బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు తెచ్చేంiదుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో.. ఐపీసీలో సెక్షన్ 497ను రీ క్రిమినలైజ్ చేయాలని.. ఈ మేరకు ఇప్పుడున్న ఐపీసీకి సవరణ చేయాలని సదరు ప్యానెల్ ప్రతిపాదించింది. అంతేకాదు.. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నిబంధనను ప్రవేశపెట్టడం కూడా ఉంది. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మగవారు మహిళలను తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉంది, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. అయితే.... వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. వివాహేతర సంబంధాన్ని సామాజిక తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. సెక్షన్ 497 ఏం చెప్పింది భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా.. లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు. 2023లో సవరణ.. అయితే.. 2023లో సెక్షన్ 497 రద్దు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. సాయుధ దళాల సిబ్బందిలో వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించవచ్చునని తీర్పునిచ్చింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మునుపటి తీర్పునకు సవరణ చేసింది. ఐపీసీ 377 సెక్షన్ కూడా.. భారత న్యాయసంహిత ముసాయిదా నివేదికలో.. ఐపీసీ 377 సెక్షన్ నేరంగా పరిగణించే అంశాన్ని పునరుద్ధరించడంపై కూడా స్టాండింగ్ కమిటీ ప్రతిపాదన చేసింది. 2018లో సుప్రీం కోర్టు 377 సెక్షన్ చెల్లుబాటు కాదంటూ సంచలన తీర్పు ఇచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2018)లో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. * ఇద్దరు మేజర్ల మధ్య స్వలింగ సంపర్కం నేరంగా పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377 చెల్లుబాటు కాదు. * ఇద్దరు మేజర్ల మధ్య ఇష్టపూర్వక స్వలింగ సంపర్కం తప్పు కాదు. * రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21 ప్రకారం లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ)లకు తమకు ఇష్టమైన లైంగిక ధోరణులను అనుసరించే స్వేచ్ఛ ఉంది. 377 సెక్షన్ రద్దు తర్వాత.. ఆ తరహా నేరాల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో.. పురుషులు, మహిళలు, ట్రాన్స్‌పర్సన్‌లతో కూడిన అంగీకారరహిత లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణించాలని పార్లమెంట్ ప్యానెల్ తాజాగా సిఫార్సు చేసింది. అలాగే పశుత్వ చర్యలను (అసహజ శృంగారం) కూడా నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
సెక్షన్ 497 నేపథ్యంలో...
సూపర్‌స్టార్ కృష్ణతో ‘శ్రీశ్రీ’, కొత్తవారితో ‘నాటకం’ వంటి సినిమాలు నిర్మించిన సాయిదీప్ చాట్ల తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘సెక్షన్ 497 ఇండియన్ పీనల్ కోడ్’. సందీప్ జక్కం ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అంగనారాయ్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా గుంటూరులో ప్రారంభమైంది. సాయిదీప్ చాట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రమిది. మన దేశంలో వివాహ వ్యవస్థ రానురాను బీటు వారిపోతోంది. పాశ్చాత్య ధోరణులు విపరీతంగా పెరిగిపోయి కుటుంబ వ్యవస్థను శాసిస్తున్నాయి. దాంతో యువతీ యువకులు సహజీవనం పేరుతో జీవనాన్ని సాగిస్తూ ఇష్టం లేనప్పుడు ఈజీగా విడిపోతున్నారు. మన సంప్రదాయాలు మరుగుపడిపోకుండా ‘సెక్షన్ 497’ అనే ఇండియన్ పీనల్ కోడ్ ఒకటి ఏర్పాటైంది. ఆ సెక్షన్ నేపథ్యంలోనే మా సినిమా ఉంటుంది. ఒక ఎస్పీ అల్లుడు డీఎస్పీని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు జరిగే పరిస్థితుల్ని కథగా రూపొందించాం. జూలై మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, ఆగస్టులో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్కె. బాజి. -
అణచివేత మానవ సంబంధాలకు ప్రాతిపదికా?
ఒకరితో వివాహ ఒప్పందంలో ఉండి వేరొకరితో సంబంధాలు కలిగి ఉండటం ఎవరు చేసినా తప్పే. కానీ ఈ పని స్త్రీ చేస్తేనే ఘోరమనడం ద్వంద్వ ప్రమాణం. వివాహేతరబంధంలో ఉన్న భార్యపైనో, ఆ వేరే పురుషుడిపైనో నేరం మోపే అధికారం ఉన్నంత మాత్రాన దాంపత్యం చక్కబడుతుందా? వివాహేతర బంధం నేరంగా ఉన్నంత కాలం వివాహేతర సంబంధాలు లేవా? ఉన్నాయి. ఉండటమేగాదు ఇటీవలికాలంలో బాగా పెరిగాయి. వీటిని నివారించాలంటే పెళ్లి వ్యవహారం సరళతరం కావాలి. ప్రేమ, సమానత్వం ప్రాతిపదికన పెళ్లిళ్లు జరగడం అవసరం. ‘నాకు అన్ని రకాల హక్కులూ కావాలి గాని నా భార్యకు ఏ హక్కూ వద్దు’ అనే ‘మగ దృష్టి’ కోణం నుంచి సమాజం బయటపడాలి. మానవ సంబంధాల్లో అన్నిరకాల హింసలూ పోవాలి. సెక్షన్ 497 చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నప్పటి నుంచి టీవీ చాన ళ్లలో, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలతో రెండు అభిప్రాయాలు కలు గుతాయి. ఒకటి వివాహే తర సంబంధాలకు సుప్రీం కోర్టు లైసెన్సు ఇచ్చిందని. ఈ సెక్షన్ వల్లే వివాహేతర సంబంధాలు పెట్టుకోవ డానికి స్త్రీలు భయపడటం వల్లే వివాహ వ్యవస్థ నిలిచి ఉందనీ, ఇక ఛిద్రమైపోతుందనేది రెండోది. ఈ సెక్షన్ రద్దయితే కుటుంబ వ్యవస్థను కాపాడటం కష్ట మనే ధోరణితో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. భర్త అనుమతి లేకుండా భార్య వేరే పురుషునితో లైంగిక సంబంధం పెట్టుకున్నాక, అది రుజువైతే అతనికి ఐదేళ్ల జైలు, జరిమానా విధించవ చ్చని 158 ఏళ్ల నాటి ఈ సెక్షన్ చెబుతోంది. అయితే, తన భార్యపై కేసు పెట్టే అధికారం అతనికి లేదు. అలాగే, ఈ స్త్రీతో సంబంధం ఉన్న పురుషుడి భార్యకు అతనిపై కేసు వేసే హక్కు కూడా లేదు. నేడు ఇంగ్లండ్ సహా అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగ ణించే చట్టాలు రద్దు చేశారు. ఇది వినగానే, పాశ్చాత్య దేశాల్లో విచ్చలవిడి సంబంధాలుంటాయని, మన దేశం అలా లేదని కొందరంటున్నారు. ‘‘వివాహేతర సంబంధం విడాకులకు ప్రాతిపదిక కావచ్చు కాని, దాన్ని నేరంగా పరిగణించలేం’’ అని తీర్పు ప్రారం భంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. టీబీ మెకాలే ఈ చట్టం రాసినప్పుడు పురుషులు విచ్చలవిడిగా తిర గడం, అనేక పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం. స్త్రీలకు కూడా కోర్కెలుంటాయని తెలుసు కాబట్టే భర్తల నిరాదరణకు గురైన స్త్రీలు తమ కోర్కెలు తీర్చు కుంటే వారిని శిక్షించడం అన్యాయమని భావించి వారిపై వ్యభిచార నేరం మోపొద్దని చెప్పాడు. కుటుం బాన్ని కాపాడటానికి ఇది అవసరమని ఇంగ్లిష్ ప్రమాణాలతో ఆలోచించి ఆయన అనుకున్నారు. కానీ, వ్యభిచార గృహాల్లోనే మకాం పెట్టిన భర్త తన భార్య వేరేవాడికేసి చూసినా చంపేయడమో లేదా వదిలేయడమో చేస్తాడన్న వాస్తవం భారత మహిళలకు తెలుసు. అసలు ఈ చట్టం అంతా మగ వాడు తన ఆస్తిగా భావించే స్త్రీ శరీరాన్ని మరొకరికి ఇవ్వడానికి సంబంధించినది. అందుకే స్త్రీ స్వతంత్ర వ్యక్తి అనీ, పురుషుడి ఆస్తి కాదనీ, ఆమెకూ ఇష్టాయి ష్టాలుంటాయని సుప్రీంకోర్టు భావించింది. వివాహే తరబంధం వల్ల పెళ్లి విచ్ఛిన్నమవుతుందా? లేక వివాహబంధం విఫలం కావడంవల్ల వివాహేతర సంబంధాలు ఏర్పడుతున్నాయా? అనే అంశం ఆలో చించాలని కోరింది. సంతృప్తికర దాంపత్య జీవితం గడిపే భార్యాభర్తలు అసలు వివాహేతర సంబం ధాలు ఎందుకు ఏర్పరచుకుంటారు? తన భార్య శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకునే భర్తలే ఎక్కు వగా ఉన్న దేశమిది. తమకు కూడా లైంగిక వాంఛ లున్నాయనీ, ఆ సుఖం తమకూ కావాలని అడిగే స్త్రీలను సిగ్గుమాలినవారిగా, బరితెగించిన వారిగా ఇప్పటికీ భావించే దేశంలో సుప్రీంకోర్టు తీర్పుపై గగ్గోలు పుట్టడంలో వింతేమీ లేదు. స్త్రీలకు లైంగిక సమానత్వం ఉండాలనడం వివా హేతర సంబంధాల్ని, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిం చడం కాదు. లైంగిక సుఖం, సంతృప్తి స్త్రీల హక్కు అని చెప్పడమే. ‘మగాడు తిరగక చెడతాడు’ అని చెప్పే సమాజంలో మగాడి తిరుగుబోతుతనానికి ఆమోదం ఉంది. అత్యాచార బాధితురాలైన స్త్రీని చెడి పోయిందంటారు. ఆమె శీలం పోతుందంటారు. కానీ అత్యాచారం చేసిన పురుషుడి శీలం పోదు. అతన్ని దుష్టుడు అని మాత్రమే అంటారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు పెళ్లి ద్వారా జతకట్టడం అనే పద్ధతిని కోరుకున్నది స్త్రీయేనని సామాజిక శాస్త్రవేత్తలు చెబు తారు. కానీ, ఈ రకమైన దాంపత్యం స్త్రీని కనీస హక్కులు లేని బానిసగా మార్చడమే అభ్యంతర కరం. స్త్రీ, పురుష సంబంధాలు అసమాన స్థాయిలో ఉన్నంత కాలం అసంతృప్తి ఉంటుంది. దానిని వెన్నంటే వివాహేతర సంబంధాలు ఉంటాయి. ఒకరితో వివాహ ఒప్పందంలో ఉండి వేరొక రితో సంబంధాలు కలిగి ఉండటం ఎవరు చేసినా తప్పే. కానీ ఈ పని స్త్రీ చేస్తేనే ఘోరమనడం ద్వంద్వ ప్రమాణం. వివాహేతరబంధంలో ఉన్న భార్యపైనో, ఆ వేరే పురుషుడిపైనో నేరం మోపే అధికారం ఉన్నంత మాత్రాన దాంపత్యం చక్కబడుతుందా? వివాహేతర బంధం నేరంగా ఉన్నంత కాలం వివా హేతర సంబంధాలు లేవా? ఉన్నాయి. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. వీటిని నివారించాలంటే పెళ్లి వ్యవహారం సరళతరం కావాలి. ప్రేమ, సమా నత్వం ప్రాతిపదికన పెళ్లిళ్లు జరగడం అవసరం. వివాహేతర సంబంధం నేరంగా ఉంటే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే సమాన హక్కుంటే దాంపత్యం చక్కబడుతుందా? ‘నాకు అన్ని రకాల హక్కులూ కావాలి గానీ నా భార్యకు ఏ హక్కూ వద్దు’ అనే ‘మగ దృష్టి’ కోణం నుంచి బయట పడాలి. అందరికీ సమాన హక్కులుండాలి. మానవ సంబంధాల్లో అన్ని రకాల హింసలూ పోవాలి. పి. దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త ఈమెయిల్ : pa_devi@rediffmail.com -
వివాహేతర సంబంధం నేరం కాదనడంతో..
చెన్నైలోని భారతీనగర్‌కు చెందిన పుష్పలత రెండేళ్ల క్రితం జాన్‌పాల్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లిని ఇద్దరి కుటుంబాలూ వ్యతిరేకించాయి. దీంతో వీరిద్దరు వేరేచోట కాపురం పెట్టారు. వీరికి ఓ సంతానం కూడా కలిగింది. చెన్నైలోని ఓ పార్కులో ప్రస్తుతం ఫ్రాంక్లిన్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. భార్య పుష్పలతకు క్షయవ్యాధి సోకడంతో ఆమె ప్రస్తుతం చికిత్సపొందుతోంది. వ్యాధిసోకిన నాటి నుంచీ భార్యతో అన్యోన్యంగా ఉండటం మానేసిన ఫ్రాంక్లిన్.. ఆమెకు కనీస అవసరాలకు సైతం డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఈ విషయాన్ని అతని స్నేహితులకు చెప్పడానికి పుష్పలత వెళ్లినపుడు ఫ్రాంక్లిన్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్నేహితులు చెప్పారు. పార్కులో సెక్యూరిటీ గార్డు డ్యూటీ సమయం పూర్తయినా చాలా లేటుగా ఇంటికొస్తున్న భర్తను నిలదీసింది. ఆ మహిళతో వివాహేతర బంధాన్ని తెంచుకోవాలని తెగేసిచెప్పింది. అందుకు ఫ్రాంక్లిన్ తిరస్కరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. వివాహేతర బంధాలు నేరం కాదంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పుచెప్పిందని, పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమే లేదంటూ ఫ్రాంక్లిన్ సమర్థించుకున్నాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన పుష్పలత శనివారం ఒంటరిగా ఉన్నపుడు ఉరి వేసుకుని ఆత్మహత్యచేసుకుంది. విషయం తెల్సిన పోలీసులు ఫ్రాంక్లిన్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తుచేస్తున్నారు. భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ కింద వివాహేతర (ఇరువురి సమ్మతితో) సంబంధాలు నేరం కాదని తాజాగా సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన తొలికేసుగా పుష్ప మరణాన్ని పరిగణిస్తున్నారు. అయితే ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం.. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎలాంటి వివాహేతర సంబంధమైనా శిక్షార్హమైన నేరమే అవుతుంది. -
ఇద్దరూ ఇష్టపడితే ఒప్పే!
ఇన్నాల్టికి దేశ అత్యున్నత న్యాయస్థానం మూలాల్ని తవ్వితీసింది. వివాహేతర బంధం నేరం కానే కాదని తీర్పు ఇచ్చింది. చట్టంలో 497 శక్తిని నిర్వీర్యం చేసింది. నిజమే, పురు షుడు పక్కకి వెళితే నేరం కాదు, స్త్రీ వెళితే తప్పా అని సూటిగా ప్రశ్నించింది. భారతీయ శిక్షాస్మృతి చాలా ప్రాచీనమైంది. కొన్ని కొన్ని సదాచారాలు అశాస్త్రీయ మార్గంలో వచ్చి చేరిపోయాయి. ఆయనెవరో ‘‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’’ అని చెప్పాడని చాలా రోజులు మనువు చెప్పింది వేదం అన్నారు. ఆధునిక మహిళ ఎన్నడో మను సిద్ధాం తాలను పాతర వేసింది. నైతిక విలువలను ఒక స్త్రీపట్లే ఎక్కువగా అమలు చేయడానికి మన సమాజం అలవాటు పడింది. ఏ మాత్రం తేడా వచ్చినా, ఇంకేముంది మహిళ తెగించేసింది అనే విమర్శ మొదలవుతుంది. కట్టుకున్న భార్యని పూర్తి హక్కులుగల చరాస్తిగా భావించడం ఆది నుంచి మగ వాడికి సంక్రమించిన హక్కు. అదేవన్నా అంటే ఆలిని సత్యం కోసం విక్రయించిన హరిశ్చంద్రుని గొప్పగా ఉదహరిస్తారు. ఆయన శ్రీరామచంద్రుని పూర్వీ కుడు. ఈయన కూడా తన ధర్మ నిరతిని, భార్యని త్యజించి నిరూపించుకున్నాడు. 158 సంవత్సరాల క్రితం పుట్టిన 497ని నిన్నటి తీర్పులు జ్ఞాన సంపన్నులైన న్యాయమూర్తులు వివ రంగా సమీక్షించారు. చక్కని విజ్ఞతతో విశ్లేషించారు. ఇక్కడ మానసిక శారీరక సాంఘిక అంశాలు ముడి పడి ఉన్నాయి. వివాహేతర సంబంధాన్ని న్యాయ శాస్త్రం ‘అడల్ట్రీ’గా వ్యవహరిస్తుంది. అంటే ‘కల్తీ’ అని అర్థం. తప్పు, నేరం, అధర్మం, అనైతికం ఇవన్నీ ఒకటి కాదు. ఇక నుంచి వివాహేతర సంబంధం ఇష్టపడిన సందర్భాలలో అక్రమ సంబంధం కూడా కాదు. మన ప్రాచీనులు ఎక్కడ ఇతర సంబంధాలు తప్పుకాదో, ఎక్కడ సమర్థించవచ్చునో కూడా సూచించారు. శృంగార పురుషుల కోసం ‘నాచ్ సొసైటీ’ని హాయిగా తయారు చేసుకున్నారు. సమర్థించుకున్నారు. స్టేటస్ సింబల్ చేసుకుని ఊరేగారు. కానీ, స్త్రీకి కూడా ఇలాంటి అవకాశాలు ఉంటే బాగుండని వాళ్లకి అనిపించలేదు. ‘భార్యపై భర్త సర్వాధికారి కాదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను 497 ఐపీసీ స్పష్టంగా ఉల్లంఘిస్తోంది. దీన్ని కొన సాగించటంలో అర్థం లేదు’ అన్నారు తమ తీర్పులో జస్టిస్ ఇందూ మల్హోత్రా. ‘ఈ తీర్పు దారి తప్పి చరించడానికి లైసెన్సు ఇచ్చినట్టు అవుతుందే మో’నని కొందరు చదువుకున్న మహిళలే భయపడు తున్నారు. కొందరు భార్యాభర్తలు ఎవరి దారిన వారు తిరుగుతుంటే, కుటుంబం మాటేమిటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘497 సెక్షన్‌కి బీజాలు 1860లోనే పడ్డాయి. అప్పటికి మహిళలకు ఎలాంటి హక్కులూ, అధికా రాలూ లేవు. ఓటు హక్కు కూడా లేదు. భార్యను భర్త సొంత ఆస్తిలా భావించేవాడు. అనుభవించినా, హింసించినా సంపూర్ణ హక్కు, అధికారాలుండేవి. ఆమెతో మరొకరు శారీరక సంబంధం పెట్టుకోవ డాన్ని క్రూరంగా, ఘోరంగా తన సొమ్ము పరహస్తం అయినట్టు భావించేవాడు’ అంటూ ధర్మాసనం ఒక చోట పేర్కొంది. అసలు మన రుషులు శారీరక కలయిక కంటే మానసిక పొందు మరీ పెద్ద పాప మని నిర్వచించారు. ఇవన్నీ అమలులో సాధ్యంకాని విషయాలు.త్రేతాయుగంలో జరిగిన అహల్య కథ ఉంది. అహల్య ఇంద్రుణ్ణి మనసారా వలచిన మాట నిజం. ఇంద్రుడు గౌతముని రూపంలో రావడం కథలో పిట్టకథ. నిజ రూపంలోనే వచ్చాడు. శక్తి సంపన్నుడు కాబట్టి, భర్త కాబట్టి స్తబ్దుగా పడి ఉండమని శాపంపెట్టి అహల్యని హత్య చేశాడు. ఈ లెక్కన అహల్యను శపించాల్సిన అవసరంగానీ, అగత్యం గానీ లేదు. మన పురాణ కథల్లో ఈ అవగుణాల అవశేషాలు కనిపిస్తాయి.పురాణ పురుషులు వారి చిత్తానికి తోచిన కోరి కలన్నీ తనివితీరా తీర్చుకున్నారు. శ్రీరామచంద్రుడు పురుషులలో పుంగవుడు. ఏకపత్నీ వ్రతుడు. అర్ధాంగి పాతివ్రత్యాన్ని కూడా అగ్నిప్రవేశం ద్వారా నిరూ పించి ధన్యుడైనాడు. తర్వాతి కృష్ణావతారంలో బహు పత్నీవ్రతుడై సేదతీరాడు స్వామి. అప్పుడు అనే కానేక రాసలీలల ద్వారా వివాహేతర సంబంధాలకు బీజాలు పడ్డాయ్. నా దేశం భగవద్గీత! అగ్నిపునీత, సీత! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సెక్షన్ 497పై తీర్పు : ఉమా భారతి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన వేళ కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమానత్వం అనేది విదేశాల కాన్సెప్ట్.. కానీ మన దేశంలో మహిళను మగవారి కంటే ఎక్కువగా చూస్తాం అని తెలిపారు. వివాహేతర సంబంధాల గురించి కోర్టు తీర్పు వెలువడిన సందర్భంగా ఉమా భారతి మీడియాతో మాడుతూ ‘జనాలు ప్రతి చిన్న విషయానికి కోర్టుకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. మన దేశంలో మహిళలను చాలా గౌరవిస్తాం. మన సమాజంలో ఆడవారికి ఉన్నత స్థానం ఉంది. మన దేశంలో మగవారి కంటే ఆడవారే ఎక్కువ. స్త్రీలను గౌరవించని చోట రాక్షసులు నివాసం ఉంటారని నానుడి. అలాంటి దేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలంటూ కోర్టుకెళ్లడం సరైంది కాదు’ అంటూ తెలిపారు. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 497ను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. ఈ నిబంధనను 158 ఏళ్ల క్రితం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఏకపక్ష, పురాతన నిబంధన అని ధర్మాసనం పేర్కొంది. ఈ సెక్షన్ మహిళలకు ఉన్న సమానత్వ హక్కు, సమాన అవకాశాల హక్కును హరించేదిగా ఉందని తెలిపిన నేపధ్యంలో ఉమా భారతి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వివాహేతర సంబంధం నేరం కాదు -
ఇష్టపూర్వక శృంగారం నేరం కాదు
-
వివాహేతర సంబంధం నేరం కాదు
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు గురువారం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును సామాజిక కార్యకర్తలు, పలువురు న్యాయవాదులు స్వాగతించారు. ఈ పురాతన చట్టాన్ని ఎప్పుడో రద్దు చేయాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు, వివాహేతేర సంబంధాలను నేరం కాదని ప్రకటించడం.. అక్రమ సంబంధాలకు అనుమతి ఇచ్చినట్లేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఐపీసీ సెక్షన్ 497ను ప్రవాస భారతీయుడు జోసెఫ్ షైన్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ సెక్షన్ ప్రకారం శిక్ష విషయంలో స్త్రీపురుషుల మధ్య వివక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. విడాకులకు కారణంగా చూపొచ్చు.. ‘ఇది ఏకపక్ష, నిరంకుశమైన పురాతన చట్టం. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాల కల్పనను అతిక్రమించేలా ఉంది’ అని భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లో వివాహేతర సంబంధాల్ని నేరంగా పేర్కొంటున్న సెక్షన్ 497ను కొట్టివేస్తూ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళలను వేరుగా పరిగణించడం రాజ్యాంగ ఉల్లంఘేనని, స్వతంత్రత అనేది గౌరవప్రదమైన మానవ మనుగడలో భాగమని, అయితే సెక్షన్ 497 మహిళలకున్న ఎంపిక స్వేచ్ఛను హరిస్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినప్పటికీ.. దానిని సామాజికంగా తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ‘వివాహేతర సంబంధాల్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ 497, వివాహానికి వ్యతిరేకంగా నేరాభియోగాలకు సంబంధించి సీఆర్పీసీలోని 198 సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమని మేం ప్రకటిస్తున్నాం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు. మహిళలను తక్కువగా చూసే ఏ నిబంధన కూడా రాజ్యాంగబద్ధం కాదని, మహిళకు భర్త యజమాని కాడని చెప్పే సమయం ఆసన్నమైందని జస్టిస్ ఖన్విల్కర్ పేర్కొన్నారు. సెక్షన్ 497 అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని స్పష్టంగా తెలుస్తోందని, దీనిని కొనసాగించడం సమర్ధనీయం కాదని ధర్మాసనంలోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా మల్హోత్రా తీర్పునిచ్చారు. ‘మహిళల గౌరవానికి భంగం కలిగించడంతో పాటు దానిని హరిస్తుందని, మహిళల్ని పురుషుల ఆస్తిగా పరిగణిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది’ అని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదని, వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు. సమానత్వం అనేది రాజ్యాంగంలోని ప్రధాన అంశమని.. అయితే ఐపీసీలోని సెక్షన్ 497 మహిళల్ని పరిగణించే విధానం నిరంకుశత్వమని అన్నారు. వైవాహిక వ్యవస్థ పవిత్రతకు దెబ్బ.. ఈ కేసులో వాదనలు వినిపించిన ప్రభుత్వం.. ఈ చట్టంలో సవరణలు చేస్తే వైవాహిక వ్యవస్థ పవిత్రత దెబ్బతింటుందని, అది సమాజంపై చెడుభావం చూపిస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా తీర్పును స్వాగతిస్తూ.. 497 సెక్షన్‌ను ఎప్పుడో తొలగించాల్సిందని నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ చీఫ్ రేఖా శర్మ అన్నారు. ‘ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం.. బ్రిటన్ దీనిని ఎప్పుడో రద్దు చేసినా.. మనం మాత్రం కొనసాగించాం’ అని పేర్కొన్నారు. మహిళలను పురుషుల ఆస్తిగా భావించే వారి విషయంలో వివక్ష చూపుతున్న ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని జాతీయ మహిళా కమిషన్ గతంలో సిఫారసు చేసింది. పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరోగమన చర్య అవుతుంది: జస్టిస్ మిశ్రా ‘వరకట్న వేధింపులు, గృహ హింసతో పోలిస్తే వివాహేతర సంబంధం పూర్తిగా భిన్నమైనది. వివాహేతర సంబంధాన్ని నేరంగా భావిస్తే...అప్పటికే వైవాహిక జీవితం పట్ల సంతృప్తిగా లేని వారికి మరింత శిక్ష విధించినట్లవుతుంది. వివాహేతర సంబంధాన్ని నేర కోణంలోనే చూడటం తిరోగమన చర్య అవుతుంది. రాజ్యాంగం, చట్టాల్లో వచ్చిన ఎన్నో మార్పులను కోర్టు చూసింది. వెనక్కి వెళ్తున్న టైమ్ మెషిన్లో కూర్చుని మరో యుగానికి వెళ్లాలనుకోవడం సరికాదు’ తండ్రితో విభేదించారు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తండ్రి, మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ గతంలో ఇచ్చిన తీర్పుతో మరోసారి విభేదించారు. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 497ను గతంలో వైవీ చంద్రచూడ్ సమర్థించగా, తాజాగా డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు. గతేడాది ఆగస్టులో గోప్యతా హక్కు ప్రాథమిక హక్కే అని తీర్పునిస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తండ్రి అభిప్రాయాలను తోసిపుచ్చారు. తాజాగా, వివాహేతర శృంగారం నేరం కాదని తేల్చిన బెంచ్‌లో సభ్యుడైన జస్టిస్ డీవై.. 1985 నాటి సౌతి విష్ణు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తన తండ్రి ఇచ్చిన తీర్పుతో విభేదించారు. ‘సౌమిత్రి విష్ణు కేసులో.. సెక్షన్ 497పై ప్రభావం చూపే రాజ్యంగ పరిధిలోని విషయాలను విస్మరించారు. సమానత్వపు హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అన్నింటికి మించి లింగ సమానత్వ హక్కు సమాజానికి ఆధారం’ అని డీవై తీర్పులో చెప్పారు. జస్టిస్ డీవై చంద్రచూడ్, వైవీ చంద్రచూడ్ వివాహేతర సంబంధాలు ఈ దేశాల్లో నేరం.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఇరాన్, మాల్దీవులు, నేపాల్, పాక్, ఫిలిప్పైన్స్, యూఏఈ, అల్జీరియా, కాంగో, ఈజిప్టు, మొరాకో, నైజీరియా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ దేశాల్లో నేరం కాదు.. చైనా, జపాన్, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, బార్బడోస్, బెర్ముడా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, ద. కొరియా, గ్వాటెమాలా సెక్షన్ 497 ఏం చెబుతోంది.. భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష కాని, జరిమానా కాని లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు. ‘తప్పుడు’ భర్తలకే ఉపశమనం! న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలు నేరం కాదన్నసుప్రీం తీర్పు కొందరు తప్పుడు భర్తలకు ఉపశమనం కలిగించగా, కొందరు అమాయకపు భర్తలకు కంటకంగా మారింది. వివాహేతర సంబంధ ఆరోపణలతో భార్య కేసు పెట్టడంతో పుణేకు చెందిన ఐటీ ఉద్యోగి తన పిల్లలకు దూరమయ్యాడు. ఉద్యోగ అవకాశాలు కోల్పోయాడు. న్యాయ ప్రక్రియలో రూ.4 లక్షలు ఖర్చుపెట్టాడు. తన భార్య చేసిన ఆరోపణలు అబద్ధమని, ఇన్నాళ్లూ తాను అనుభవించిన మానసిక క్షోభ నిజమని, కోర్టు తీర్పు ఉపశమనం కలిగించిందని ఆయన అన్నారు. ఇక ఢిల్లీకి చెందిన ఓ వైద్యుడిది కూడా సుమారు ఇలాంటి కథే. తన భార్య వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉందని గుర్తించాక, ఆమెనే అతనిపై వ్యభిచార కేసు పెట్టడం గమనార్హం. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ఈ ఇద్దరు హర్షం వ్యక్తం చేశారు. తాజా తీర్పుకు ఇది ఒక పార్శ్వమే. వివాహేతర సంబంధాలపై సుప్రీం తీర్పు తమ జీవితాలను మరింత దుర్భరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న అమాయకపు భర్తలు కూడా ఉన్నారు. అందులో బెంగళూరుకు చెందిన 45 ఏళ్ల చైతన్య గౌడ ఒకరు. తన భార్య అక్రమ సంబంధంపై ఆయన 8 ఏళ్లుగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఆమె విటుడి భార్యతో కేసు పెట్టించాలని యోచిస్తున్నారు. కోర్టు తాజా తీర్పుతో.. ఆ కేసు నిలబడేందుకు అవకాశాల్లేవు. తన లాంటి వారి జీవితాలను ఈ తీర్పు మరింత కుదిపేస్తుందని గౌడ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన ఐటీ నిపుణుడు దేవ్‌జ్యోతి దాస్(42) కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. తన భార్యకు ఇతరులతో లైంగిక సంబంధాలున్నాయని, అందుకు సంబంధించి రెండేళ్లుగా సేకరిస్తున్న ఆధారాలు బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఆయన వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పును మహిళా సాధికారత కోణంలోనే చూస్తున్నారని, కుటుంబ సాధికారత అనే మరో అంశం కూడా ఉందని సేవ్ ది ఫ్యామిలీ అనే ఎన్జీవో అధ్యక్షుడు రాజేశ్ వాకారియా అన్నారు. -
వివక్షాపూరిత సెక్షన్ విరగడ
మారుతున్న సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా కాలదోషం పట్టిన చట్టాలను యధావిధిగా కొనసాగించటం అనర్ధదాయకం. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరం. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ తరహా చట్టాలను వదుల్చుకుందామని మంత్రిత్వ శాఖలన్నిటికీ తాఖీదులిచ్చారు. ఆ కసరత్తు పర్యవసానంగా అనంతరకాలంలో చాలా చట్టాలు రద్దయ్యాయి. గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం చెల్లదంటూ చెప్పిన భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 497 కూడా నిజానికి ఆ కోవలోకే వస్తుంది. కానీ దాన్ని రద్దు చేస్తే వైవాహిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్న కారణంతో కేంద్రం దాని జోలికి పోలేదు. భార్యతో లైంగిక సంబంధం ఏర్పరుచుకున్న వ్యక్తిపై నేరం మోపడానికి, అతనికి శిక్ష పడేలా చేయటానికి భర్తకు ఈ సెక్షన్ వీలు కల్పిస్తోంది. ఈ నేరంలో వేరే వ్యక్తితోపాటు తన భార్య కూడా భాగస్వామే అయినా భర్త ఆమెపై కేసు పెట్టలేడు. ఈ నేరం రుజువైతే నిందితుడికి అయిదేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. విచిత్రమేమంటే భర్త అనుమతితో అతడి భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఈ సెక్షన్ నేరంగా పరిగణించదు. ఇలాంటి నేరాల్లో మహిళలను శిక్షించాలని చెప్పటం లేదు గనుక ఈ సెక్షన్ వారికి అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది. లోతుగా పరిశీలిస్తే ఇందులో దాగి ఉన్న వివక్ష తేటతెల్లమవుతుంది. భార్యను అసలు సజీవమైన వ్యక్తిగా ఈ సెక్షన్ పరిగణించటంలేదని అర్ధమవుతుంది. ఐపీసీలో ఈ సెక్షన్‌ను కొన సాగించటంపై మీ అభిప్రాయమేమిటని సుప్రీంకోర్టు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం విచిత్రమైన జవాబిచ్చింది. ‘వైవాహిక వ్యవస్థకూ, దాని పవిత్రతకూ భారతీయ విలువలు అత్యున్నత ప్రాముఖ్యతనిస్తాయి. ఈ సెక్షన్‌ను కొట్టేస్తే ఆ విలువలకు హాని కలుగుతుంది’ అని కేంద్రం వివరించింది. అయితే మహిళల ప్రాథమిక హక్కులకు ఇది విఘాతం కలిగిస్తున్నదని గుర్తించలేకపోయింది. మహిళా సంఘాలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని చాన్నాళ్లుగా కోరు తున్నాయి. ఈ చట్టం భార్యాభర్తలిద్దరినీ సమాన భాగస్వాములుగా కాక భర్తను యజమానిగా, భార్యను బానిసగా చూస్తున్నదని ఆ సంఘాలు అంటున్నాయి. ఇలాంటి కీలకమైన అంశంలో ధర్మాసనంలోని అయిదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పునివ్వడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సెక్షన్ 497 దృష్టిలో వివాహిత భర్త ఆస్తి లేదా వస్తువు. ఆస్తిని అపహరించిన వ్యక్తిపై కేసు పెట్టిన విధంగానే తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిపై కూడా ఈ సెక్షన్ కింద భర్త కేసు పెట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక వైవాహిక వివాదాన్ని విచారిస్తున్నప్పుడు 2011లో సుప్రీంకోర్టు ఈ సెక్షన్ కొనసాగింపును ప్రశ్నించింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిపై తాను ఈ సెక్షన్ కింద కేసు ఎందుకు పెట్టరాదని ఒక మహిళ ప్రశ్నించింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. అయితే ఈ సెక్షన్ కేవలం మగవాడికి మాత్రమే ఆ హక్కునిస్తున్నదని ధర్మాసనం అభిప్రాయపడి కేసు కొట్టేసింది. 2016లో సుప్రీంకోర్టు ముందుకొచ్చిన కేసు కూడా ఈ తరహాదే. వేరే వ్యక్తితో తన భార్య సంబంధం పెట్టుకున్నప్పుడు కేవలం అతనిపై మాత్రమే కేసు పెట్టాలన్న నిబంధన ఎలా సరైందని ఆ పిటిషనర్ ప్రశ్నించాడు. సమాజం ఇలాంటి వైవాహికేతర బంధాన్ని నైతిక తప్పిదంగా పరిగణిస్తుంది. అది విడాకులకు ఒక ప్రాతిపదిక కూడా అవుతుంది. ఆ సంబంధాలు ఆత్మహత్యకు దారితీస్తే అందుకు ప్రేరేపించిన కేసు(సెక్షన్ 306) పెట్టొచ్చు. అయితే సెక్షన్ 497 అలాంటి సంబంధంలోకెళ్లినవారిలో కేవలం పురుషుడే తప్పు చేసినట్టు పరిగణిస్తుంది. బ్రిటిష్ ఏలుబడిలో థామస్ మెకాలే నేతృత్వంలో 1834లో మొదటి లా కమిషన్ ఏర్ప డినప్పుడు ఇలాంటి సంబంధాలను కేవలం సివిల్ తగాదాగా భావించింది. కానీ జాన్ రోమిలీ నేతృత్వంలోని రెండో లా కమిషన్ సిఫార్సు మేరకు సెక్షన్ 497 కింద దీన్ని క్రిమినల్ నేరంగా 1860లో మార్చారు. అయితే జమ్మూ–కశ్మీర్లో 1932లోనే ఈ సెక్షన్ కిందికి భార్యను కూడా తీసుకొచ్చారు. మన దేశంలో హిందూ కుటుంబ చట్టం మినహా క్రైస్తవ, ముస్లిం, పార్సీ తదితర మతాలకు చెందిన కుటుంబ చట్టాలు విడాకులు తీసుకోవడానికి ఇతర కారణాలతోపాటు వివాహేతర సంబంధాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. పైగా దంపతులిద్దరికీ సమానంగా ఈ హక్కు కల్పిస్తున్నాయి. హిందూ కుటుంబ చట్టం మాత్రం వివాహేతర సంబంధాలను విడాకులకు ప్రాతిపదికగా భావిస్తున్నా... దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించి, దాని కింద కేసు పెట్టే అధికారం ఒక్క భర్తకు మాత్రమే ఇస్తోంది. నేర న్యాయ వ్యవస్థలో తీసుకురావల్సిన సంస్కరణలపై నియమించిన జస్టిస్ వీఎస్ మాలిమత్ కమిటీ వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించటాన్ని వ్యతిరేకించకుండా దాన్ని దంపతులిద్దరూ సమానంగా ఉపయోగించుకునేలా మార్చాలని సూచించింది. 1972లో ఐపీసీకి సవరణలు తీసుకొస్తూ రూపొందించిన బిల్లులో సెక్షన్ 497ను మహిళలపై కూడా కేసు పెట్టేవిధంగా మార్చారు. అయితే అది పార్లమెంటు ముందుకు రాకుండానే మూలనబడింది. అనంతరకాలంలో పలుమార్లు ఈ సెక్షన్ ఉనికిని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలైనా వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది. ఇన్నేళ్లకు ఆ సెక్షన్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వివాహేతర సంబంధాలకు లైసెన్స్నివ్వడంగా కొందరు అభివర్ణిస్తున్నారు. కానీ అది సరికాదు. భార్యాభర్తలిద్దరినీ సమానులుగా చూడకపోవడాన్ని, ఆమెను బానిసగా, ప్రాణం లేని వస్తువుగా పరిగణించడాన్ని తీర్పు ఎత్తిచూపింది. ఇంత వివక్షాపూరితమైన సెక్షన్ భారతీయ శిక్షాస్మృతిలో 158 ఏళ్లపాటు కొనసాగడం ఒక వైచిత్రి. -
వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని 497వ సెక్షను రాజ్యాంగ విరుద్ధమని, మహిళల గౌరవానికి భంగకరమని గురువారం నాటి తీర్పులో సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ దేశాలు ఈ విషయంలో ఎలాంటి దృక్కోణాన్ని కలిగి ఉన్నాయన్నది ఆసక్తిదాయం. ముందుగా మన దేశంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాన్ని పరిశీలిస్తే,వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తోంది.ఇలాంటి కేసుల్లో పురుషుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.ప్రభుత్వ ఉద్యోగులకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.మహిళకు మాత్రం ఎలాంటి శిక్ష ఉండదు.మహిళలను పురుషుల ఆస్తిగా భావించే వారి పట్ల వివక్ష చూపే ఈ 497 సెక్షన్‌ను రద్దు చేయాలని మహిళల జాతీయ కమిషన్ సిఫారసు చేసింది. బాధితురాలిదే బాధ్యత పొరుగున ఉన్న పాకిస్తాన్లో వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు 1979లో హుదూద్ ఆర్డినెన్సు జారీ చేసింది.అయితే,ఈ కేసులో పట్టుబడ్డ మహిళ తాను అత్యాచారానికి గురయ్యాయని స్వయంగా నిరూపించుకోవలసి ఉంటుంది.దానికి నలుగురు ప్రముఖుల సాక్ష్యం కూడా తప్పనిసరి.అలా చేయలేకపోతే ఆ మహిళను శిక్షిస్తారు. సౌదీ అరేబియా, బ్రూనే వంటి ఇతర ఇస్లాం దేశాల్లో కూడా ఇలాంటి చట్టమే అమల్లో ఉంది.ఆ దేశాల్లో వివాహేతర సంబంధం నేరానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపడం. మొన్నమొన్నటి వరకు 20వ శతాబ్దం మధ్య వరకు ప్రపంచంలో చాలా దేశాలు వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగానే పరిగణించాయి.కొన్ని దేశాలు ఈ నేరానికి మరణ శిక్షను విధించాయి.అయితే తర్వాత కాలంలో వివిధ దేశాలు వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్టాలను రద్దు చేశాయి.ఐరోపా దేశాల్లో ఇది నేరం కాదు.చాలా కమ్యూనిస్టు దేశాలు కూడా వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం లేదు.ఐరోపా దేశాల్లో వివాహేతర సంబంధానికి పాల్పడిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించేవారు.యురోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యక్తిగత వ్యవహారం పరస్పర సమ్మతితో జరిపే శృంగారం వారి వ్యక్తిగత వ్యవహారమని, దాన్ని నేరంగా పరిగణించరాని ఆస్ట్రేలియా చట్టం చెబుతోంది.వివాహేతర సంబంధం విడాకులకు ప్రాతిపదికగా పేర్కొనే నిబంధనను కూడా రద్దు చేసింది. అమెరికాలో ఇంకా... అమెరికాలో 20వ శతాబ్దం మధ్య వరకు చాలా రాష్ట్రాలు వివాహేతర సంబంధాన్ని నేరంగానే పరిగణిస్తూ వచ్చాయి. కాలక్రమంలో కొన్ని రాష్ట్రాలు ఆ చట్టాలను రద్దు చేశాయి. వెస్ట్ వర్జీనియా 2010లో అడల్ట్రీ సంబంధిత చట్టాలను రద్దు చేసింది. కొలరాడో 2013లో, మశాచుసెట్స్2018లో ఈ చట్టాలను తొలగించాయి.2018 నాటికి దాదాపు 20 రాష్ట్రాల్లో వివాహేతర సంబంధం శిక్షార్హమైన నేరంగానే ఉంది.అయితే,దీనికి సంబంధించి విచారణలు, శిక్ష పడటాలు అరుదుగా జరుగుతున్నాయి. సెక్షన్ 497 ఏం చెబుతోంది భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది.‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం నెరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరంగా పరిగణించబడుతుంది. ఆ నేరానికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష కాని, జరిమానా కాని లేదా రెండూ కాని విధించవచ్చు.ఇటువంటి కేసుల్లో భార్యను భాగస్వామన్న పేరుతో శిక్షించడానికి వీలులేదు’అని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తనుకాని, భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు.మన దేశంలో 1956 నాటి హిందూ వివాహ చట్టంలోని 13(1) సెక్షను కింద వివాహేతర సంబంధాన్ని విడాకులకు ప్రాతిపదికగా పరిగణించవచ్చు. -
సెక్షన్ 497 నిరంకుశం..!
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 సమానత్వపు హక్కునకు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది నిరంకుశత్వంగా ఉందని గురువారం స్పష్టం చేసింది. వివాహితుడైన పురుషుడు, మరో వివాహితురాలిని వేర్వేరుగా పరిగణిస్తోందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్ 497 ‘నిరంకుశం’ అని స్పష్టం చేసింది. భర్త అనుమతితో వివాహిత మహిళ – వివాహితుడైన మరో పురుషుడితో సంబంధం పెట్టుకున్న సందర్భాల్లో.. మహిళను ఓ గృహోపకరణంగా చూస్తున్నారని మండిపడింది. ఓ వివాహితురాలు మరో వివాహితుడితో.. తన భర్త అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పు కాదని సెక్షన్ 497 చెబుతోంది. ‘భార్యాభర్తలు కాని ఓ పురుషుడు, మరో మహిళ.. లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం చేసినట్లు కాదు. కేవలం వివాహేతర సంబంధమే’ అని ఈ సెక్షన్ పేర్కొంది. అయితే ఈ సెక్షన్ సరికాదని ధర్మాసనం తెలిపింది. వివాహ బంధం పవిత్రమైంది ‘ఇక్కడ వివాహ బంధం పవిత్రతను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చట్టంలోని నిబంధనలు ఆర్టికల్ 14 (అందరికీ సమానత్వం) అనే రాజ్యాంగం కల్పించిన హక్కును హరించివేస్తోంది’ అని కోర్టు చెప్పింది. సమానత్వపు హక్కును ఈ సెక్షన్ కల్పిస్తుందా లేదా? అనేది విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ‘భర్త అనుమతి ఉంటే.. ఆ వివాహేతర సంబంధంలో తప్పులేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మహిళను ఓ ఆటవస్తువుగా పరిగణించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఓ వివాహితుడు, మరో వివాహితురాలితో (భర్త అనుమతితో) లైంగిక సంబంధం పెట్టుకుంటే అది తప్పుకాదు. మరోవైపు, ఓ వివాహితుడైన వ్యక్తి వివాహం కాని మహిళతో కలవడం తప్పుకాదు. ఇక్కడ వివాహేతర సంబంధం వర్తించదు. ఇలాంటి కేసులో భార్య ఆ వ్యక్తిపై కేసు పెట్టలేదు. ఇదెంత నిరంకుశం’ అని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 497లో లింగ సమానత్వం లోపించిందని కోర్టు తెలిపింది. 1954లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం కూడా సెక్షన్ 497 సమానత్వపు హక్కుకు భంగం వాటిల్లదని, ఈ సెక్షన్‌కు రాజ్యాంగ బద్ధత ఉందంటూ తీర్పునిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. ఇలాంటి కేసులపై గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించాల్సిన అవసరముందని ధర్మాసనం పేర్కొంది. భార్యాభర్తలు విడాకులు కోరేందుకు వివాహేతర సంబంధాన్ని ఓ కారణంగా పరిగణించబోమని కూడా కోర్టు వెల్లడించింది. ఎవరి వాదన వారిదే! సెక్షన్ 497కు ఉన్న రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో పిటిషనర్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కాళేశ్వరం రాజ్ తన వాదనలు వినిపిస్తూ.. సెక్షన్ 497లోని నిబంధనలు వివాహేతర సంబంధం పెట్టుకున్న స్త్రీ, పురుషులకు వేర్వేరు శిక్షలు సూచిస్తోందని పేర్కొన్నారు. పురుషుడిని నేరస్తుడిగా గుర్తిస్తూ.. మహిళల విషయంలో మాత్రం సానుకూలంగా ఉందన్నారు. కేసులో ఓ వర్గం తరపున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదించారు. ‘మహిళలు భర్తల చేతిలో ఇంట్లోని ఓ వస్తువుగా మారిపోయారు. ఇక్కడ భర్తతోపాటు సదరు విటుడిని కూడా తీవ్రంగా శిక్షించాల్సిందే’ అని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేసును ఆగస్టు 7కు వాయిదా వేసింది. మహిళకు లైంగిక స్వేచ్ఛ వివాహేతర సంబంధానికి నో అని చెప్పేందుకు ఓ మహిళకు ఎంత హక్కుందో.. తన లైంగిక స్వతంత్రతను కాపాడుకునేందుకు కూడా అంతే హక్కుంటుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘ఓ వ్యక్తి వివాహేతర సంబంధంలో ఉన్నాడని తెలిస్తే.. అతని భార్య ఈ సంబంధం తెంచుకునేందుకు ఇదో కారణం అవుతుంది. ఇలాంటి సంబంధంలో ఉన్న మహిళ తనకు వివాహం అయిందన్న కారణంతో తన లైంగిక స్వతంత్రతను కోల్పోకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇంతలో సీజేఐ జోక్యం చేసుకుని.. మానసికంగా మహిళకు వేధింపులుంటేనే విడాకులకు వెళ్లొచ్చని లేనిపక్షంలో వివాహేతర సంబంధాన్ని కారణంగా చూపి విడాకులు కోరలేరని పేర్కొన్నారు.