
న్యూఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన వేళ కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమానత్వం అనేది విదేశాల కాన్సెప్ట్.. కానీ మన దేశంలో మహిళను మగవారి కంటే ఎక్కువగా చూస్తాం అని తెలిపారు. వివాహేతర సంబంధాల గురించి కోర్టు తీర్పు వెలువడిన సందర్భంగా ఉమా భారతి మీడియాతో మాడుతూ ‘జనాలు ప్రతి చిన్న విషయానికి కోర్టుకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. మన దేశంలో మహిళలను చాలా గౌరవిస్తాం. మన సమాజంలో ఆడవారికి ఉన్నత స్థానం ఉంది. మన దేశంలో మగవారి కంటే ఆడవారే ఎక్కువ. స్త్రీలను గౌరవించని చోట రాక్షసులు నివాసం ఉంటారని నానుడి. అలాంటి దేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలంటూ కోర్టుకెళ్లడం సరైంది కాదు’ అంటూ తెలిపారు.
వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 497ను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. ఈ నిబంధనను 158 ఏళ్ల క్రితం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఏకపక్ష, పురాతన నిబంధన అని ధర్మాసనం పేర్కొంది. ఈ సెక్షన్ మహిళలకు ఉన్న సమానత్వ హక్కు, సమాన అవకాశాల హక్కును హరించేదిగా ఉందని తెలిపిన నేపధ్యంలో ఉమా భారతి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment