కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. పలు కీలకాంశాలపై ముఖ్యమైన సవరణలను తెరపైకి తెచ్చింది. స్వలింగ సంపర్కం (సెక్షన్ 377, వివాహేతర సంబంధాలు (సెక్షన్ 497)లను మళ్లీ నేరాలుగా పరిగణించే అంశాన్ని పరిశీలించేలా ముసాయిదా నివేదికను రూపొందించింది. ఈ రెండు సెక్షన్‌లను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి విదితమే.
బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు తెచ్చేంiదుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో.. ఐపీసీలో సెక్షన్ 497ను రీ క్రిమినలైజ్ చేయాలని.. ఈ మేరకు ఇప్పుడున్న ఐపీసీకి సవరణ చేయాలని సదరు ప్యానెల్ ప్రతిపాదించింది. అంతేకాదు.. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నిబంధనను ప్రవేశపెట్టడం కూడా ఉంది.
వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మగవారు మహిళలను తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉంది, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది.
అయితే.... వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. వివాహేతర సంబంధాన్ని సామాజిక తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది.
సెక్షన్ 497 ఏం చెప్పింది
భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా.. లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు.
2023లో సవరణ..
అయితే.. 2023లో సెక‌్షన్ 497 రద్దు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. సాయుధ దళాల సిబ్బందిలో వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించవచ్చునని తీర్పునిచ్చింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మునుపటి తీర్పునకు సవరణ చేసింది.
ఐపీసీ 377 సెక్షన్ కూడా..
భారత న్యాయసంహిత ముసాయిదా నివేదికలో.. ఐపీసీ 377 సెక్షన్ నేరంగా పరిగణించే అంశాన్ని పునరుద్ధరించడంపై కూడా స్టాండింగ్ కమిటీ ప్రతిపాదన చేసింది. 2018లో సుప్రీం కోర్టు 377 సెక్షన్ చెల్లుబాటు కాదంటూ సంచలన తీర్పు ఇచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2018)లో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
* ఇద్దరు మేజర్ల మధ్య స్వలింగ సంపర్కం నేరంగా పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377 చెల్లుబాటు కాదు.
* ఇద్దరు మేజర్ల మధ్య ఇష్టపూర్వక స్వలింగ సంపర్కం తప్పు కాదు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21 ప్రకారం లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ (ఎల్‌జీబీటీక్యూ)లకు తమకు ఇష్టమైన లైంగిక ధోరణులను అనుసరించే స్వేచ్ఛ ఉంది.
377 సెక్షన్ రద్దు తర్వాత.. ఆ తరహా నేరాల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో.. పురుషులు, మహిళలు, ట్రాన్స్‌పర్సన్‌లతో కూడిన అంగీకారరహిత లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణించాలని పార్లమెంట్ ప్యానెల్ తాజాగా సిఫార్సు చేసింది. అలాగే పశుత్వ చర్యలను (అసహజ శృంగారం) కూడా నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment