సాక్షి, న్యూఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని 497వ సెక్షను రాజ్యాంగ విరుద్ధమని, మహిళల గౌరవానికి భంగకరమని గురువారం నాటి తీర్పులో సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ దేశాలు ఈ విషయంలో ఎలాంటి దృక్కోణాన్ని కలిగి ఉన్నాయన్నది ఆసక్తిదాయం. ముందుగా మన దేశంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాన్ని పరిశీలిస్తే,వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తోంది.ఇలాంటి కేసుల్లో పురుషుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.ప్రభుత్వ ఉద్యోగులకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.మహిళకు మాత్రం ఎలాంటి శిక్ష ఉండదు.మహిళలను పురుషుల ఆస్తిగా భావించే వారి పట్ల వివక్ష చూపే ఈ 497 సెక్షన్‌ను రద్దు చేయాలని మహిళల జాతీయ కమిషన్ సిఫారసు చేసింది.
బాధితురాలిదే బాధ్యత
పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు 1979లో హుదూద్ ఆర్డినెన్సు జారీ చేసింది.అయితే,ఈ కేసులో పట్టుబడ్డ మహిళ తాను అత్యాచారానికి గురయ్యాయని స్వయంగా నిరూపించుకోవలసి ఉంటుంది.దానికి నలుగురు ప్రముఖుల సాక్ష్యం కూడా తప్పనిసరి.అలా చేయలేకపోతే ఆ మహిళను శిక్షిస్తారు. సౌదీ అరేబియా, బ్రూనే వంటి ఇతర ఇస్లాం దేశాల్లో కూడా ఇలాంటి చట్టమే అమల్లో ఉంది.ఆ దేశాల్లో వివాహేతర సంబంధం నేరానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపడం.
మొన్నమొన్నటి వరకు
20వ శతాబ్దం మధ్య వరకు ప్రపంచంలో చాలా దేశాలు వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగానే పరిగణించాయి.కొన్ని దేశాలు ఈ నేరానికి మరణ శిక్షను విధించాయి.అయితే తర్వాత కాలంలో వివిధ దేశాలు వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్టాలను రద్దు చేశాయి.ఐరోపా దేశాల్లో ఇది నేరం కాదు.చాలా కమ్యూనిస్టు దేశాలు కూడా వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం లేదు.ఐరోపా దేశాల్లో వివాహేతర సంబంధానికి పాల్పడిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించేవారు.యురోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది.
వ్యక్తిగత వ్యవహారం
పరస్పర సమ్మతితో జరిపే శృంగారం వారి వ్యక్తిగత వ్యవహారమని, దాన్ని నేరంగా పరిగణించరాని ఆస్ట్రేలియా చట్టం చెబుతోంది.వివాహేతర సంబంధం విడాకులకు ప్రాతిపదికగా పేర్కొనే నిబంధనను కూడా రద్దు చేసింది.
అమెరికాలో ఇంకా...
అమెరికాలో 20వ శతాబ్దం మధ్య వరకు చాలా రాష్ట్రాలు వివాహేతర సంబంధాన్ని నేరంగానే పరిగణిస్తూ వచ్చాయి. కాలక్రమంలో కొన్ని రాష్ట్రాలు ఆ చట్టాలను రద్దు చేశాయి. వెస్ట్ వర్జీనియా 2010లో అడల్ట్రీ సంబంధిత చట్టాలను రద్దు చేసింది. కొలరాడో 2013లో, మశాచుసెట్స్2018లో ఈ చట్టాలను తొలగించాయి.2018 నాటికి దాదాపు 20 రాష్ట్రాల్లో వివాహేతర సంబంధం శిక్షార్హమైన నేరంగానే ఉంది.అయితే,దీనికి సంబంధించి విచారణలు, శిక్ష పడటాలు అరుదుగా జరుగుతున్నాయి.
సెక్షన్ 497 ఏం చెబుతోంది
భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది.‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం నెరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరంగా పరిగణించబడుతుంది. ఆ నేరానికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష కాని, జరిమానా కాని లేదా రెండూ కాని విధించవచ్చు.ఇటువంటి కేసుల్లో భార్యను భాగస్వామన్న పేరుతో శిక్షించడానికి వీలులేదు’అని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తనుకాని, భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు.మన దేశంలో 1956 నాటి హిందూ వివాహ చట్టంలోని 13(1) సెక్షను కింద వివాహేతర సంబంధాన్ని విడాకులకు ప్రాతిపదికగా పరిగణించవచ్చు.
Published Thu, Sep 27 2018 12:05 PM | Last Updated on Thu, Sep 27 2018 10:07 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment