న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 సమానత్వపు హక్కునకు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది నిరంకుశత్వంగా ఉందని గురువారం స్పష్టం చేసింది. వివాహితుడైన పురుషుడు, మరో వివాహితురాలిని వేర్వేరుగా పరిగణిస్తోందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్ 497 ‘నిరంకుశం’ అని స్పష్టం చేసింది. భర్త అనుమతితో వివాహిత మహిళ – వివాహితుడైన మరో పురుషుడితో సంబంధం పెట్టుకున్న సందర్భాల్లో.. మహిళను ఓ గృహోపకరణంగా చూస్తున్నారని మండిపడింది. ఓ వివాహితురాలు మరో వివాహితుడితో.. తన భర్త అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పు కాదని సెక్షన్ 497 చెబుతోంది. ‘భార్యాభర్తలు కాని ఓ పురుషుడు, మరో మహిళ.. లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం చేసినట్లు కాదు. కేవలం వివాహేతర సంబంధమే’ అని ఈ సెక్షన్ పేర్కొంది. అయితే ఈ సెక్షన్ సరికాదని ధర్మాసనం తెలిపింది.
వివాహ బంధం పవిత్రమైంది
‘ఇక్కడ వివాహ బంధం పవిత్రతను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చట్టంలోని నిబంధనలు ఆర్టికల్ 14 (అందరికీ సమానత్వం) అనే రాజ్యాంగం కల్పించిన హక్కును హరించివేస్తోంది’ అని కోర్టు చెప్పింది. సమానత్వపు హక్కును ఈ సెక్షన్ కల్పిస్తుందా లేదా? అనేది విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ‘భర్త అనుమతి ఉంటే.. ఆ వివాహేతర సంబంధంలో తప్పులేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మహిళను ఓ ఆటవస్తువుగా పరిగణించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఓ వివాహితుడు, మరో వివాహితురాలితో (భర్త అనుమతితో) లైంగిక సంబంధం పెట్టుకుంటే అది తప్పుకాదు.
మరోవైపు, ఓ వివాహితుడైన వ్యక్తి వివాహం కాని మహిళతో కలవడం తప్పుకాదు. ఇక్కడ వివాహేతర సంబంధం వర్తించదు. ఇలాంటి కేసులో భార్య ఆ వ్యక్తిపై కేసు పెట్టలేదు. ఇదెంత నిరంకుశం’ అని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 497లో లింగ సమానత్వం లోపించిందని కోర్టు తెలిపింది. 1954లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం కూడా సెక్షన్ 497 సమానత్వపు హక్కుకు భంగం వాటిల్లదని, ఈ సెక్షన్‌కు రాజ్యాంగ బద్ధత ఉందంటూ తీర్పునిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. ఇలాంటి కేసులపై గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించాల్సిన అవసరముందని ధర్మాసనం పేర్కొంది. భార్యాభర్తలు విడాకులు కోరేందుకు వివాహేతర సంబంధాన్ని ఓ కారణంగా పరిగణించబోమని కూడా కోర్టు వెల్లడించింది.
ఎవరి వాదన వారిదే!
సెక్షన్ 497కు ఉన్న రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో పిటిషనర్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కాళేశ్వరం రాజ్ తన వాదనలు వినిపిస్తూ.. సెక్షన్ 497లోని నిబంధనలు వివాహేతర సంబంధం పెట్టుకున్న స్త్రీ, పురుషులకు వేర్వేరు శిక్షలు సూచిస్తోందని పేర్కొన్నారు. పురుషుడిని నేరస్తుడిగా గుర్తిస్తూ.. మహిళల విషయంలో మాత్రం సానుకూలంగా ఉందన్నారు. కేసులో ఓ వర్గం తరపున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదించారు. ‘మహిళలు భర్తల చేతిలో ఇంట్లోని ఓ వస్తువుగా మారిపోయారు. ఇక్కడ భర్తతోపాటు సదరు విటుడిని కూడా తీవ్రంగా శిక్షించాల్సిందే’ అని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేసును ఆగస్టు 7కు వాయిదా వేసింది.
మహిళకు లైంగిక స్వేచ్ఛ
వివాహేతర సంబంధానికి నో అని చెప్పేందుకు ఓ మహిళకు ఎంత హక్కుందో.. తన లైంగిక స్వతంత్రతను కాపాడుకునేందుకు కూడా అంతే హక్కుంటుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘ఓ వ్యక్తి వివాహేతర సంబంధంలో ఉన్నాడని తెలిస్తే.. అతని భార్య ఈ సంబంధం తెంచుకునేందుకు ఇదో కారణం అవుతుంది. ఇలాంటి సంబంధంలో ఉన్న మహిళ తనకు వివాహం అయిందన్న కారణంతో తన లైంగిక స్వతంత్రతను కోల్పోకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇంతలో సీజేఐ జోక్యం చేసుకుని.. మానసికంగా మహిళకు వేధింపులుంటేనే విడాకులకు వెళ్లొచ్చని లేనిపక్షంలో వివాహేతర సంబంధాన్ని కారణంగా చూపి విడాకులు కోరలేరని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment