ఎన్నికల వేళ ఉల్లిబాంబ్‌ | The Price Of Onions Has Gone Up During The Maharashtra And Haryana Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ ఉల్లిబాంబ్‌

Published Sun, Sep 29 2019 4:26 AM | Last Updated on Sun, Sep 29 2019 8:12 AM

The Price Of Onions Has Gone Up During The Maharashtra And Haryana Elections - Sakshi

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరోసారి ఉల్లిబాంబు పేలింది. కేంద్రం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాజధాని ఢిల్లీ, ముంబైలలో కేజీ 80 రూపాయలు దాటేసింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుల వరకు ఉల్లి లేనిదే ముద్ద దిగని కుటుంబాలే ఎక్కువ. ఎన్నికల సమయంలో ఉల్లి ధర పెరిగిదంటే ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనల్ని గతంలో చూశాం. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ అధికారంలో ఉండడంతో తమ అధికార పీఠం ఎక్కడ కూలిపోతోందన్న ఆందోళనతో కేంద్రం తక్షణమే చర్యలకు ఉపక్రమించింది. ఉల్లి ధరకు కళ్లెం వేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.  

కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి ?  
►ఉల్లి ఎగుమతుల్ని తక్షణమే నిలిపివేసింది.
►కేంద్ర గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 56 వేల టన్నుల ఉల్లిపాయల్లో తక్షణమే 16 వేల టన్నుల ఉల్లిపాయల్ని మార్కెట్లోకి విడుదల చేసింది.
►కేంద్ర సంస్థలైన నాఫెడ్, జాతీయ సహకార వినియోగదారుల ఫెడరేషన్, మదర్‌ డైయిరీ సఫాల్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కేజీ 22 నుంచి 23 రూపాయలకు అమ్ముతోంది.
►కేంద్రం వద్ద ఉల్లిపాయలు సరిపడా ఉన్నాయని, ఏ రాష్ట్రాలకైనా కావాలంటే తక్షణమే పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ట్వీట్‌చేశారు. ఉల్లి కావాలన్న రాష్ట్రాలకు కేజీ రూ.16 రూపాయల చొప్పున కేంద్రం సప్లయ్‌చేస్తోంది. వీటిని ఆయారాష్ట్రాలు రూ. 24కి అమ్ముతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో గత ఏడాది పండిన పంటనే సప్లయ్‌ చేస్తున్నారు. నవంబర్‌ నాటికి కొత్తవి మార్కెట్లోకి వస్తే ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా. అయితే అక్టోబర్‌లో ఎన్నికలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఉల్లి ధరని దింపడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ధర ఎందుకు పెరుగుతోంది?  
ఉల్లి పంట ఎక్కువగా పండే రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో ధర ఆకాశాన్నంటింది. పండగ సీజన్‌ వస్తూ ఉండడంతో కొందరు దళారులు కావాలనే స్టాక్‌ని దాచేసి కృత్రిమ కొరతను సృష్టించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో ఢిల్లీ, ముంబై మార్కెట్లలో ఉల్లి ధర కేజీ రూ.70–80 పలికింది. నాలుగేళ్లలో ఉల్లిధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ సీజన్‌లో ఉండే ధర కంటే ఇది 90శాతం ఎక్కువ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement