Haryana Election 2019
-
రివ్యూ టైం
-
అక్కడ ఖాతా తెరవని బీజేపీ.. అందుకే బరిలో ఆమె
చంఢీగర్ : హరియాణలోని దాద్రి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తన చెల్లెలు బబితా ఫోగాట్ (29) విజయం తథ్యమని ఆమె సోదరి గీతా ఫోగాట్ ధీమా వ్యక్తం చేశారు. రెజ్లింగ్‌లో మాదిరిగానే రాజకీయాల్లోను బబితా సత్తా చాటుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, జాట్ల ప్రాబల్యం ఉన్న దాద్రి నియోజకవర్గకంలో బీజేపీ ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈస్థానం నుంచి రాజ్‌దీప్ ఫోగాట్ (ఐఎన్ఎల్డీ) విజయం సాధించారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ బబితాను బరిలో నిలిపింది. మోదీ ర్యాలీ కలిసొస్తుందా.. బబితతో పాటు దాద్రి స్థానానికి జేజేపీ నుంచి సత్పాల్ సంగ్వాన్, కాంగ్రెస్ నుంచి మేజర్ నిర్పేందర్ సంగ్వాన్, స్వతంత్ర అభ్యర్థిగా సోమ్‌వీర్ సంగ్వాన్ పోటీలో ఉన్నారు. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన బబితా ఎంతమేరకు ప్రత్యర్థులను ఢీకొడుతుందో చూడాలి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ‘నా చెల్లెల్ని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. బబితా దేశానికి చేసిన సేవల పట్ల అందరికీ గౌరవం ఉంది. ఆమె రాజకీయాల్లో కూడా రాణిస్తుంది. అయితే, గెలుపోటములు ఎక్కడైనా సహజం. మేము క్రీడాకారులం. చమత్కారమైన లేక జాలి, సానుభూతితో కూడిన రాజకీయాలు చేతకావు’ అని గీతా చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇద్దరు రెజ్లర్ సోదరీమణుల ఇతివృత్తంగా తెరకెక్కి దంగల్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మోదీ ప్రాభవంతోనే వారిద్దరి గెలుపు!
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీలకు సోమవారం పోలింగ్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. మొదటి సారి బీజేపీ ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్ లాల్ ఖట్టర్‌లు, మరోసారి ముఖ్యమంత్రులుగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ప్రాంతీయంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు నమూనా నాయకులు. వారేమీ ఎన్నికల ద్వారా ప్రముఖులుగా గుర్తింపు పొందిన నాయకులూ కాదు, సీఎం పదవిలో పోటీలో ఉన్న వ్యక్తులు కూడా కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కులానికో, వర్గానికో చెందిన వారు కూడా కాదు. అనూహ్యంగా ముఖ్యమంత్రులైన ఇరువురు ఆరెస్సెస్‌కు చెందిన వారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర చరిత్రలో పూర్తికాలం పాటు అధికారం కొనసాగిన రెండవ ముఖ్యమంత్రి ఫడ్నవీసే. మరాఠాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గం నుంచి వచ్చిన నిలదొక్కు కోవడమే కాకుండా చాలా తెలివిగా ప్రత్యర్థులను తప్పిస్తూ వచ్చారు. చాలా తెలివిగా మాజీ మిత్రపక్షమైన శివసేనతో పొత్తు కుదుర్చుకోవడంలో విజయం సాధించారు. పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలివిగా పరిష్కరించుకోగలిగారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆకర్షించగలిగారు. పార్టీలో అన్ని వర్గాలను మెప్పించగలిగిన పాపులర్ నాయకుడు కాకపోయినా కేంద్రంలోని మోదీ ప్రభావం మేరకు మనగుడ సాగిస్తూ వచ్చారు. మనోహర్ లాల్ ఖట్టర్ జాట్లు ఎక్కువగా ఉన్న హర్యానాలో పంజాబీ నాయకుడు మనోహర లాల్ ఖట్టర్ అనూహ్యంగ ముఖ్యమంత్రి అయ్యారు. పదవిలో రాణించేందుకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పంథానే అనుసరించారు. జాట్ల నాయకత్వంలోని ప్రతిపక్షాన్నే ఎదుర్కొంటూనే పాలనపై కొంత దష్టిని కేంద్రీకరించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనద్వారా కొంత మంచి పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఖట్టర్ కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రాభవంపైనే ఎక్కువగా ఆధారపడి గెలవాల్సిందే. గెలుస్తారనే విశ్వాసం ఇప్పటికే ప్రజల్లో నాటుకుపోయింది. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాల కుమ్ములాటలు పార్టీకి కలిసి వచ్చే మరో అవకాశం. పైగా డబ్బుగల పార్టీ అవడం వల్ల ఈ ఎన్నికల్లో ఇరువురు ముఖ్యమంత్రులు భారీగానే డబ్బులు కుమ్మరిస్తున్నారు. -
ముగిసిన ప్రచారం.. 21 పోలింగ్
సాక్షి, హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌లో గత కొన్ని రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. ప్రచార రథాలు నిలిచిపోయాయి. శనివారం సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 21న జరుగుతుంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడుతాయి. హుజూర్‌నగర్‌తో పాతో దేశవ్యాప్తంగా 51 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక పోలింగ్ నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రతను పెంచినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అభ్యర్థులపై ఎన్నికల సంఘం గట్టి నిఘా ఉంచింది. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెంచారు. లైసెన్స్డ్ వెపన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. మహారాష్ట్రాలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హరియాణాలో 90 స్థానాలకు అక్టోబర్ 21 న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 24 న ఫలితాలు వెల్లడిస్తారు. -
రాహుల్ గాంధీ హెలీకాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయింది. హరియాణలోని మహెందర్‌ఘర్ ఎన్నికల సభలో పాల్గొన్న రాహుల్ ఢిల్లీకి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈఘటన చోటుచేసుకుంది. ‘దట్టమైన దుమ్ము తుపాను కారణంగా హెలీకాప్టర్ రివారీలోని కేఎల్పీ కాలేజీ మైదానంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేవు. అందరూ క్షేమం’అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఘటన అనంతరం రాహుల్ రోడ్డు మార్గాన ఢిల్లీ చేరుకన్నారు. (చదవండి : రాహుల్ గాంధీ లండన్ వెళ్లి పోతారా?!) కాసేపు క్రికెట్.. ప్రతికూల వాతావరణం కారణంగా చోపర్‌ను కాసేపు నిలిపివేశారు. కాలేజీ మైదానం కావడంతో అక్కడ రాహుల్ పిల్లలతో కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇక ఈ నెల 21న హరియాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మాహేంద్రగర్ బీజేపీ తరపున రామ్‌విలాస్‌శర్మ పోటీలో ఉన్నారు కాగా కాంగ్రెస్ తరపున రావు దాన్ సింగ్ బరిలో నిలిచారు. దుమ్ము తుపాను కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 60 విమానాలు 35 నిముషాల ఆలస్యంగా నడిచాయి. #WATCH Congress leader Rahul Gandhi plays cricket with local boys in Rewari after his chopper made an emergency landing at KLP College earlier today, due to bad weather while returning to Delhi from Mahendragarh after addressing an election rally. #Haryana pic.twitter.com/Y4rv0Gf8Gg — ANI (@ANI) October 18, 2019 -
ఆర్టికల్ 370: దేశ, విదేశాల్లో పుకార్లు పుట్టిస్తున్నారు!
చండీగఢ్: అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని హామీ ఇచ్చే దమ్ము కాంగ్రెస్‌కి ఉందా అని ప్రధాని నరేంద్రమోదీ నిలదీశారు. హరియాణాలోని చార్కి దాద్రిలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. యావత్ దేశం ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిస్తే.. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం దేశ, విదేశాల్లో పుకార్లు వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనన్న ప్రధాని మోదీ....దేశానికి వెన్నుపోటు పొడిస్తే మాత్రం సహించేది లేదని స్పష్టంచేశారు. కర్తార్‌పూర్ కారిడార్ పూర్తికానుండటం ఆనందంగా ఉందని, ఏడు దశబ్దాల కిందట జరిగిన రాజకీయ, వ్యూహాత్మక తప్పిదాలను కొంతమేర మా ప్రభుత్వం సరిచేయడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. -
ఊహకందని నిర్ణయాలు.. మీరిచ్చిన బలం వల్లే!
చండీగఢ్ : హరియాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోరుగా దూసుకుపోతున్నారు. సోమవారమిక్కడ నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. హరియాణా రాష్ట్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. హరియాణా రాష్ట్రం దేశానికి ఎంతోమంది క్రీడాకారులను అందించిందన్నారు. హరియాణాకు ఎప్పుడొచ్చినా.. తనకు ఇంటికొచ్చినట్టే ఉంటుందని పేర్కొన్నారు. దేశం ప్రస్తుతం ఊహకందని నిర్ణయాలను తీసుకుంటోందని, భారత ఓటర్లు ఇచ్చిన శక్తితోనే ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలను కేంద్రం తీసుకుందని మోదీ అన్నారు. ఆర్టికల్ 35ఏ వల్లే జమ్మూకశ్మీర్‌లోని విద్యావంతులైన వాల్మీకి యువతకు ఉద్యోగాలు రాలేదని అన్నారు. బాలాకోట్ వైమానిక దాడులు, వన్ పెన్షన్, వన్ ర్యాంక్, త్రిపుల్ తలాక్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం వంటి అంశాలను ఆయన హరియాణా ఓటర్లకు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను హరియాణా సర్కారు సమగ్రంగా అమలు చేస్తోందని, మరోసారి ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని మోదీ కోరారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇక ఐదు రోజులే మిగిలి ఉండటంతో సోమవారం నుంచి వరుసగా నాలుగు ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. సోమవారం ఫరీదాబాద్ జిల్లా వల్లఢ్‌గఢ్‌లో జరిగిన తొలి ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 90 మంది సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 21న పోలింగ్ జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
మేము స్వాగతించాం; క్షమాపణలు చెప్పండి!
చండీగఢ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్... తమ పార్టీ అధ్యక్షురాలిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సీఎం స్థాయిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మనోహర్‌లాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనీపట్‌లో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరైన సీఎం మనోహర్‌లాల్ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ... ‘లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తన స్థానాన్ని గాంధీ కుటుంబేతర వ్యక్తి భర్తీ చేస్తారని చెప్పారు. ఆయన నిర్ణయాన్ని మేము కూడా స్వాగతించాం. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ఇది ఉపయోగపడుతుందని భావించాం. రాహుల్ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు దేశవ్యాప్తంగా తమ నాయకుడి కోసం గాలించారు. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా సోనియా గాంధీనే మళ్లీ పార్టీ చీఫ్‌ను చేశారు’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మనోహర్‌లాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ మహిళా వ్యతిరేకి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొంది. ‘బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దిగజారుడుగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆయన మాటలను మేము ఖండిస్తున్నాం. మనోహర్‌లాల్ ఖట్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని ట్విటర్ వేదికగా డిమాండ్ చేసింది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీఏ చైర్‌పర్సర్ సోనియా గాంధీ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక అత్యధిక స్థానాలున్న యూపీలో తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆమేథీ నుంచి మరోసారి బరిలోకి దిగిన రాహుల్ బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ తరఫున ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
కలకలం: నవీన్ దలాల్‌కు ఎమ్మెల్యే టికెట్
బహదూర్‌ఘర్: గత ఏడాది జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై దాడిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న నవీన్ దలాల్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన టిక్కెట్టుపై బహదూర్‌ఘర్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. తనను తాను గోసంరక్షకుడినని చెప్పుకునే నవీన్ దలాల్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఆవుపేరుతో రాజకీయాలు నెరపుతున్నారనీ వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్టు 13న ఢిల్లీలో మరొకరితో కలిసి ఉమర్ ఖలీద్‌పై తుపాకీతో కాల్పులు జరిపేందుకు నవీన్ యత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. బెయిల్‌పై బయటికి వచ్చిన నవీన్ ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. తానిప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ఢిల్లీ కేసుతో పాటు మరో రెండు కేసులు తనపై ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొనడం గమనార్హం. 29 ఏళ్ల నవీన్ దలాల్ ఆరు నెలల క్రితం శివసేన పార్టీలో చేరారు. మిగతా పార్టీల కంటే శివసేన విధానాలు స్పష్టంగా ఉండటం వల్లే ఈ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. గత పదేళ్లుగా గోసంరక్షణ సహా పలు అంశాలపై తాను పోరాటం చేసినట్టు వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, వారంతా తనకు అండగా ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బహదూర్‌ఘర్‌లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నరేశ్ కౌశిక్, కాంగ్రెస్ అభ్యర్థి రాజిందర్ సింగ్ జూన్, ఐఎన్ఎల్డీ అభ్యర్థి నఫె సింగ్ రాథీ, మరో 20 మంది ఈసారి పోటీ చేస్తున్నారు. శివసేన నుంచి బరిలోకి దిగుతున్న నవీన్ దలాల్ ఏమేరకు పోటీ ఇస్తారో వేచిచూడాలి. -
కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ
హిసార్: హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, సీనియర్ నేత ప్రొఫెసర్ సంపత్ సింగ్ సోమవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంపత్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన గతంలో ఐఎన్ఎల్డీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2009లో హరియాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశానని, అయినా కష్టానికి తగిన గుర్తింపు దక్కలేదని సంపత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 21న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మార్వా నుంచి టిక్కెట్ ఆశించారు. కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపడంతో పార్టీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు తగదని లేదా కాంగ్రెస్ పార్టీకి తాను తగనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు తన అవసరం లేనందు వల్లే రాజీనామా చేశానని చెప్పారు. నాలుగు రోజుల క్రితమే పీసీసీ మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ వైదొలిగిన విషయం తెలిసిందే. సంపత్ సింగ్ బీజేపీలో చేరనున్నారా అని ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన మంచి వ్యక్తి. మంత్రిగా ఉన్నప్పుడు బాగా పనిచేశారు. ఆయన మా పార్టీలో చేరాలనుకుంటే మీకు తెలిసే జరుగుతుంద’ని సమాధానమిచ్చారు. -
సోనియా ఇంటి ముందు ఆందోళన
న్యూఢిల్లీ: హరియాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరిపోయాయి. రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్ల పంపిణీ అంశం కాంగ్రెస్ పార్టీని ఓ కుదుపు కుదుపుతోంది. టికెట్ల పంపిణీ వ్యవహారంలో తీవ్ర అంసతృప్తితో ఉన్న హరియాణా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వార్ బుధవారం ఏకంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎదుట ఆందోళన నిర్వహించారు. అంతేకాకుండా పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం ఎదుట కూడా ఆయన నిరసన ప్రదర్శన చేపట్టారు. సోనియా ఇంటి ముందు ఆయన మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. సోహ్నా అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ నేతలు రూ. 5 కోట్లకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. టికెట్ల పంపిణీలో అన్యాయం జరుగుతుందని, ఈవిధంగా టికెట్లను అమ్ముకుంటే పార్టీ ఎలా గెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. టికెట్ల పంపిణీ విషయంలో పార్టీకి ద్రోహం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో వెళ్లిపోయినవారు 14మంది ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారని, బీజేపీ ఎంపీల్లో ఏడుగురికి కాంగ్రెస్ నేపథ్యముందని తెలిపారు. గత మూడు నెలల్లో తనను బీజేపీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు ఆరుసార్లు ఆఫర్ ఇచ్చారని, అయినా, తాను కాంగ్రెస్‌ను వీడబోనని, పార్టీ కోసం గత ఐదేళ్లుగా పనిచేస్తున్న వారిని టికెట్ల పంపిణీలో విస్మరిస్తున్నారని అశోక్ తన్వార్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎన్నికల వేళ ఉల్లిబాంబ్
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరోసారి ఉల్లిబాంబు పేలింది. కేంద్రం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాజధాని ఢిల్లీ, ముంబైలలో కేజీ 80 రూపాయలు దాటేసింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుల వరకు ఉల్లి లేనిదే ముద్ద దిగని కుటుంబాలే ఎక్కువ. ఎన్నికల సమయంలో ఉల్లి ధర పెరిగిదంటే ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనల్ని గతంలో చూశాం. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ అధికారంలో ఉండడంతో తమ అధికార పీఠం ఎక్కడ కూలిపోతోందన్న ఆందోళనతో కేంద్రం తక్షణమే చర్యలకు ఉపక్రమించింది. ఉల్లి ధరకు కళ్లెం వేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి ? ►ఉల్లి ఎగుమతుల్ని తక్షణమే నిలిపివేసింది. ►కేంద్ర గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 56 వేల టన్నుల ఉల్లిపాయల్లో తక్షణమే 16 వేల టన్నుల ఉల్లిపాయల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ►కేంద్ర సంస్థలైన నాఫెడ్, జాతీయ సహకార వినియోగదారుల ఫెడరేషన్, మదర్ డైయిరీ సఫాల్ ఔట్లెట్స్ ద్వారా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కేజీ 22 నుంచి 23 రూపాయలకు అమ్ముతోంది. ►కేంద్రం వద్ద ఉల్లిపాయలు సరిపడా ఉన్నాయని, ఏ రాష్ట్రాలకైనా కావాలంటే తక్షణమే పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్‌చేశారు. ఉల్లి కావాలన్న రాష్ట్రాలకు కేజీ రూ.16 రూపాయల చొప్పున కేంద్రం సప్లయ్‌చేస్తోంది. వీటిని ఆయారాష్ట్రాలు రూ. 24కి అమ్ముతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో గత ఏడాది పండిన పంటనే సప్లయ్ చేస్తున్నారు. నవంబర్ నాటికి కొత్తవి మార్కెట్లోకి వస్తే ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా. అయితే అక్టోబర్‌లో ఎన్నికలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఉల్లి ధరని దింపడానికి ప్రయత్నాలు చేస్తోంది. ధర ఎందుకు పెరుగుతోంది? ఉల్లి పంట ఎక్కువగా పండే రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో ధర ఆకాశాన్నంటింది. పండగ సీజన్ వస్తూ ఉండడంతో కొందరు దళారులు కావాలనే స్టాక్‌ని దాచేసి కృత్రిమ కొరతను సృష్టించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో ఢిల్లీ, ముంబై మార్కెట్లలో ఉల్లి ధర కేజీ రూ.70–80 పలికింది. నాలుగేళ్లలో ఉల్లిధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ సీజన్లో ఉండే ధర కంటే ఇది 90శాతం ఎక్కువ. -
బీజేపీలో చేరిన యోగేశ్వర్, సందీప్
న్యూఢిల్లీ : ఒలంపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ గురువారం బీజేపీలో చేరారు. హర్యానా బీజేపీ చీఫ్ సుభాశ్ బరాలా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ దత్ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ తననెంతో ప్రభావితం చేశారని.. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించానని పేర్కొన్నారు. ‘ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో బీజేపీలో చేరాను. ప్రధాని మోదీ పాలన నన్నెంతగానో ప్రభావితం చేసింది. క్రీడాకారులు కూడా ప్రజా సేవలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పింది. ఈ కుటుంబం(బీజేపీ)లో సభ్యుడిని కావడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. కాగా హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న వేళ యోగేశ్వర్ దత్, సందీప్ సింగ్ బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున వీరిద్దరు బరిలోకి దిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2012 ఒలంపిక్ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం అందించిన యోగేశ్వర్ దత్‌ను సోనెపట్ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యోగేశ్వర్ ఇప్పటికే తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక సందీప్ సింగ్‌తో పాటు శిరోమణి అకాలీ దళ్ ఎమ్మెల్యే బాల్కౌర్ సింగ్ కూడా గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సందీప్ సింగ్ మాట్లాడుతూ...ప్రధాని మోదీ, హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌లను ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. జాతికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో కాషాయ కండువా కప్పుకొన్నానని తెలిపారు.