హిసార్: హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, సీనియర్ నేత ప్రొఫెసర్ సంపత్ సింగ్ సోమవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంపత్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన గతంలో ఐఎన్‌ఎల్‌డీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2009లో హరియాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశానని, అయినా కష్టానికి తగిన గుర్తింపు దక్కలేదని సంపత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 21న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మార్వా నుంచి టిక్కెట్ ఆశించారు. కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపడంతో పార్టీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు తగదని లేదా కాంగ్రెస్ పార్టీకి తాను తగనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు తన అవసరం లేనందు వల్లే రాజీనామా చేశానని చెప్పారు. నాలుగు రోజుల క్రితమే పీసీసీ మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ వైదొలిగిన విషయం తెలిసిందే. సంపత్ సింగ్ బీజేపీలో చేరనున్నారా అని ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన మంచి వ్యక్తి. మంత్రిగా ఉన్నప్పుడు బాగా పనిచేశారు. ఆయన మా పార్టీలో చేరాలనుకుంటే మీకు తెలిసే జరుగుతుంద’ని సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment