
చండీగఢ్ : హరియాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోరుగా దూసుకుపోతున్నారు. సోమవారమిక్కడ నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. హరియాణా రాష్ట్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. హరియాణా రాష్ట్రం దేశానికి ఎంతోమంది క్రీడాకారులను అందించిందన్నారు. హరియాణాకు ఎప్పుడొచ్చినా.. తనకు ఇంటికొచ్చినట్టే ఉంటుందని పేర్కొన్నారు. దేశం ప్రస్తుతం ఊహకందని నిర్ణయాలను తీసుకుంటోందని, భారత ఓటర్లు ఇచ్చిన శక్తితోనే ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలను కేంద్రం తీసుకుందని మోదీ అన్నారు. ఆర్టికల్ 35ఏ వల్లే జమ్మూకశ్మీర్‌లోని విద్యావంతులైన వాల్మీకి యువతకు ఉద్యోగాలు రాలేదని అన్నారు. బాలాకోట్ వైమానిక దాడులు, వన్ పెన్షన్, వన్ ర్యాంక్, త్రిపుల్ తలాక్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం వంటి అంశాలను ఆయన హరియాణా ఓటర్లకు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను హరియాణా సర్కారు సమగ్రంగా అమలు చేస్తోందని, మరోసారి ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని మోదీ కోరారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇక ఐదు రోజులే మిగిలి ఉండటంతో సోమవారం నుంచి వరుసగా నాలుగు ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. సోమవారం ఫరీదాబాద్ జిల్లా వల్లఢ్‌గఢ్‌లో జరిగిన తొలి ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 90 మంది సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 21న పోలింగ్ జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడికానున్నాయి.