ఇందులో ఏదెక్కువో తేల్చండి! | Petrol Prices Very High In India | Sakshi
Sakshi News home page

ఇందులో ఏదెక్కువో తేల్చండి!

Published Mon, Sep 10 2018 10:17 PM | Last Updated on Sat, Oct 20 2018 5:26 PM

Petrol Prices Very High In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 56.71 రూపాయలు ఎక్కువనా, 72.83 రూపాయలు ఎక్కువనా అని ఏ ఒకటవ తరగతి పిల్లవాడిని అడిగినా 72.83 రూపాయలు ఎక్కువని ఠక్కున చెప్పేస్తాడు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరలను సమర్థించుకునేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మతో విడుదల చేసిన ఓ గ్రాఫిక్‌ చిత్రంలో 56.71 రూపాయలకన్నా 72.83 రూపాయలు 28 శాతం తక్కువని చూపించింది. ఆ మేరకు దిగువకు బాణం గుర్తును కూడా గీసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోకన్నా బీజేపీ ప్రభుత్వం హయాంలో పెట్రోలు పెరగడం కన్నా తగ్గిందని గ్రాఫ్‌లో చూపించడం కోసం తాపత్రయ పడిన బీజేపీ మొన్నటి వరకున్న అసలు డీజిల్‌ ధరను కూడా సూచించాల్సి వచ్చి బొక్క బోర్లా పడింది. ఆ గ్రాఫ్‌ను చూసిన వారెవరైనా కింద పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. అలా కాసేపు కొట్టుకున్న ట్విట్టర్లు ఆ తర్వాత తేరుకొని తమదైన శైలిలో ట్వీట్లు పేలుస్తున్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటి పరిస్థితితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు భారీగా తగ్గినా దేశీయంగా చమురు ధరలను ఎప్పటికప్పుడు మోదీ ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడం, భగ్గుమంటున్న భారత ప్రజలు కూడా బంద్‌ను విజయవంతం చేయడం తెల్సిందే. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌ విజయవంతమైందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించుకోగా, పెట్రోలు ధరల పెంపునకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అంతర్జాతీయ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరించుకుంటున్నాయని మోదీ ప్రభుత్వం సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. తిమ్మిని బమ్మిచేసైనా ప్రభుత్వాన్ని సమర్థించాలనుకున్న బీజేపీ కార్యాలయం పాఠకుల దిమ్మ తిరిగేలా చేసింది. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో రేట్లు (ఢిల్లీ మార్కెట్‌ రేట్లు)
2004, మే 16వ తేదీన అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర బారెల్‌కు 36 డాలర్లు ఉండగా, లీటరు ప్రెటోలు ధర 33.71 రూపాయలు, డీజిల్‌ లీటరు ధర 21.74 రూపాయలు ఉండింది. 2009, మే 16వ తేదీ నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర 36 డాలర్ల నుంచి 58 డాలర్లకు పెరగ్గా, పెట్రోలు ధర 33.71 రూపాయల నుంచి 40.62 రూపాయలకు, డీజిల్‌ ధర 21.74 రూపాయల నుంచి 30.86 రూపాయలకు పెరిగింది. ఇక 2014, మే 16వ తేదీ నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బారెల్‌ క్రూడాయిల్‌ ధర 107 డాలర్లకు పెరగ్గా, లీటరు పెట్రోలు ధర లీటరుకు 71.41 రూపాయలకు, డీజిల్‌ ధర 56.71 రూపాయలకి పెరిగింది. 

బీజేపీ అధికారంలోకి వచ్చాక (ఢిల్లీ మార్కెట్లో)
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పెరిగిన చమురు ధరలను పరిశీలిస్తే విస్తు పోవాల్సిందే. 2014లో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర 107 డాలర్లు ఉన్నప్పుడు లీటరు పెట్రోలు ధర 71.41 రూపాయలు ఉండగా, 2018, సెప్టెంబర్‌ 10వ తేదీ నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర 71 డాలర్లకు పడిపోగా లీటరు పెట్రోలు ధర 80.73 రూపాయలకు పెరిగింది. డీజిల్‌ లీటరు ధర 72.83 రూపాయలకు పెరిగింది. ఇక్కడే బీజేపీ పొరపాటు చేసింది. 2014లో డీజిల్‌ ధర 56.71 రూపాయలు ఉండగా, 2018, సెప్టెంబర్‌ 10కి 72.83 రూపాయలకు పడిపోయిందని గ్రాఫిక్‌ ద్వారా చూపింది. దీంతో ట్వీట్ల మీద ట్వీట్లు పేలుతున్నాయి. 

వాస్తవానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో దేశంలో చమురు ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పెరిగినప్పుడల్లా, పెరిగిన ధరలకు అనుగుణంగా కాకుండా ప్రభుత్వం సూచించిన మేరకే దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు ధరలు పెంచేవి. దీనివల్ల చమురు కంపెనీలపై పడే ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేది. ప్రభుత్వ ధరలలో పోటీ పడలేక ప్రైవేటు చమురు కంపెనీలు తీవ్రంగా నష్టపోయేవి. ఈ దశలో ప్రైవేటు చమురు కంపెనీలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలకు అనుగుణంగా ధరలను పెంచుకోవాల్సిందిగా ఆదేశిస్తూ చమురు కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగానే మోదీ ప్రభుత్వం హయాంలో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. చమురు కంపెనీలకు స్వేచ్ఛనిచ్చిన మోదీ ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ ఇచ్చి ఉండాల్సింది. అలా చేయక పోవడం వల్ల దేశంలో డీజిల్‌ ధరలు పెరిగినప్పుడల్లా అన్ని సరకుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. నరేంద్ర మోదీలో బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అడ్వానీ ఒకప్పుడు మోదీలో ఏం చూశారోగానీ, మోదీని ‘బ్రిలియెంట్‌ ఈవెంట్స్‌ మేనేజర్‌’ అని ప్రశంసించారు. మరి తాజా గ్రాఫ్‌ చూశాక ఇప్పుడేమంటారో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement