
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఉపేంద్ర కుష్వాహా (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) అధినేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. కుష్వాహా తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) ఆమోదం కొరకు పంపినట్టు తెలిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీఏ సీట్ల సర్ధుబాటు ప్రతిపాదనలతో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్ వైఖరితో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
ఎన్డీఏ సర్కార్ నుంచి బయటకు రావాలని ఇటీవల జరిగిన ఆర్‌ఎల్‌ఎస్పీ మేధోమధన భేటీలో ఆ పార్టీ నిర్ణయించింది. కాగా సోమవారం జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి తాను హాజరు కాబోనని కుష్వాహా ప్రకటించారు. ఈనెల 12న పార్టీ నేతల కీలక భేటీలో ఎన్డీఏ నుంచి వైదొలగే అంశంపై ఆర్‌ఎల్‌ఎస్పీ ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
కాగా,ఎన్డీఏ వ్యవహారాలపై సంప్రదించేందుకు తాను బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల సమయం కోరినా తనకు అపాయింట్‌మెంట్ నిరాకరించారని గతంలో కుష్వాహా అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు బిహార్‌లో ఆర్‌ఎల్డీ, కాంగ్రెస్ ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏర్పాటైన మహాకూటమిలో ఆ పార్టీ చేరవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment