RLSP
-
బిహార్‌లో మహాకూటమికి షాక్
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలక ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విపక్ష ఆర్జేడీ కూటమి నుంచి వైదొలగుతున్నామని రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) స్పష్టం చేసింది. ఆర్జేడీ కూటమిలో తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని తాము ఆమోదించబోమని ఆర్ఎల్ఎస్పీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వహ ఇప్పటికే తేల్చిచెప్పారు. కాగా బీఎస్పీతో కలిసి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కుష్వహ ప్రకటించారు. మరోవైపు బిహార్ మాజీ సీఎం నితిన్ రామ్ మాంఝీ ఇప్పటికే ఎన్డీయే గూటికి చేరారు.మహాకూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ బయటకు రావడంతో బీఎస్పీ, ఎంఐఎంలతో ఆ పార్టీ జట్టుకట్టి మూడో ఫ్రంట్‌గా ప్రజల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఇక పట్నాలో బీఎస్పీ నేతలను కుష్వహ కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. చిన్న పార్టీలతో చర్చలు కీలక దశలో ఉన్నాయని ఆర్ఎల్ఎస్పీ వర్గాలు పేర్కొన్నారు. మరోవైపు ఎన్డీయే నుంచి తమకు ఆహ్వానం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ-జేడీ(యూ) కూటమితో రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తెగతెంపులు చేసుకుంటుందనే వార్తల నేపథ్యంలో మహా కూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది. చదవండి : సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు! -
రాజకీయాల్లో అన్నీ సాధ్యమే..
సాక్షి, పట్నా: బిహార్ రాజకీయాల్లో గతేడాది లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వేరైన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ తిరిగి బీజేపీ వైపు చూస్తోందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీనికి సంబంధించి సమాలోచనలు చేయనున్నట్లు ఆర్ఎల్ఎస్పీ జాతీయ కార్యదర్శి మాధవ్ ఆనంద్ తెలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయి నేతలతో ఓ భేటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతమున్న మహాకూటమిలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ఆరోపించారు. తిరిగి ఎన్డీయేతో కలవనున్నారా అన్న ప్రశ్నకు, రాజకీయాల్లో అన్నీ సాధ్యమే అని బదులిచ్చారు. ఇప్పటికే ఎన్డీయే నాయకులతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. (ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్’) -
‘అదే జరిగితే.. రక్తం ఏరులై పారుతుంది’
పట్నా : కౌంటింగ్ రోజున అధికార పార్టీ అవకతవకలకు పాల్పడితే.. జనాలు ఊరుకోరు.. రక్తపాతం సృష్టిస్తారని హెచ్చరిస్తున్నారు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) నాయకుడు ఉపేంద్ర కుష్వహా. బిహార్, యూపీల్లో ఈవీఎంల తరలింపు విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తున్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ఎవరూ సరిగా సమాధానం చెప్పడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూసి జనాలు భయపడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. మహాకూటమి కానీ, ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరు. మా ఓటు.. మాకు గౌరవం, జీవనాధారం. మా బతుకుల జోలికి వస్తే.. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టి ఎలా పోరాడతామో.. అలానే మా ఓట్ల కోసం కూడా కొట్లడతాం. ఓట్ల లెక్కిపు రోజున ఏవైనా అవకతవకలు జరిగితే మాత్రం హింసాకాండ చెలరేగడం.. రక్తం ఏరులై పారడం ఖాయం’ అన్నారు. అంతేకాక ‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాం. అప్పుడు జనాల్లో మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత.. మా(మహాకూటమి) పాట్ల సానుకూల స్పందన కనిపించింది. చాలా చోట్ల మహాకూటమి విజయం సాధిస్తుందని అర్థమైంది. అందుకే ఓట్ల లెక్కింపు నాడు ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల’ని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎన్డీఏ ఖండిస్తుంది. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆర్ఎల్ఎస్పీకి చెందిని ఉపేంద్ర కుష్వహా ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టాడు. కానీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో.. ఆ పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతో గత ఏడాది డిసెంబరులో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాడు. -
బిహార్‌లో మహాకూటమి సీట్ల ఖరారు
పట్నా: బిహార్‌లో మహాకూటమిలోని పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల పంపిణీ పూర్తయింది. ఈ రాష్ట్రంలో మొత్తం 40 సీట్లుండగా ఆర్జేడీకి 20 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనుంది. ఉపేంద్ర కూష్వాహకు చెందిన ఆర్ఎల్ఎస్పీ ఐదు స్థానాల్లో, జతిన్ రాం మాంఝీ పార్టీ హెచ్ఏఎం మూడు చోట్ల, ముకేశ్ సాహ్నీకి చెందిన వీఐపీ మూడు సీట్లలో పోటీ చేయనుంది. అయితే ఆర్జేడీ తమకు దక్కిన 20 సీట్ల నుంచి అరా నియోజకవర్గాన్ని సీపీఐ(ఎంఎల్)కు వదిలిపెట్టింది. సీట్ల కేటాయింపు వివరాలను బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వెల్లడించారు. దర్భంగా నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న కీర్తి ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. దర్భంగా టికెట్‌ను కీర్తికే ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.∙ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆర్జేడీ అబ్దుల్ బరీ సిద్దిఖీని బరిలోకి దింపుతోంది. ప్రధానంగా ఈ కారణంగానే సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాటలీపుత్ర నుంచి మిసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి పోటీ చేయనున్నారు. దర్భంగా నుంచి అబ్దుల్ బరీ సిద్దిఖీని ఆర్జీడీ పోటీకి దింపుతుండటం అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు ఆర్జేడీ సీనియర్ నేత అష్రఫ్ ఫాత్మికి కూడా ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఫాత్మి ఆ స్థానం నుంచి గతంలో చాలా సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. బెగుసరాయ్ నియోజకవర్గంలో 2014లో పోటీచేసి ఓడిపోయిన తన్వీర్ హస్సన్‌నే ఆర్జేడీ మళ్లీ బరిలోకి దింపింది. పట్నాలో మీడియాతో మాట్లాడుతున్న తేజస్వీ -
యూపీఏలోకి ఆర్ఎల్ఎస్పీ
న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్ర మంత్రి పదవిని వదులుకుని ఎన్డీయే నుంచి బయటకొచ్చిన ఉపేంద్ర కుష్వాహ గురువారం యూపీఏతో చేతులు కలిపారు. బిహార్‌లో తమ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ప్రతిపక్షాల మహాకూటమిలో చేరిందని ఆయన ప్రకటించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో, సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, ఏఐసీసీ బిహార్ ఇన్ చార్జ్ శక్తిసింహ్ గోహిల్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఇతర ప్రతిపక్ష నేతలు శరద్ యాదవ్, జతిన్ రాం మాంఝీ తదితరుల సమక్షంలో కుష్వాహ ఈ ప్రకటన చేశారు. కుష్వాహను మహాకూటమిలోకి ఆహ్వానించిన పై నేతలు.. తామంతా కలిసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతామని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందునే తాను ఎన్డీయే నుంచి బయటకొచ్చాననీ, అలాగే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ పార్టీని అవమానిస్తున్నా మోదీ మౌనం వహించడం తనను బాధించిందని కుష్వాహ చెప్పారు. ప్రమాదంలో బీజేపీ–ఎల్జేపీ బంధం! బిహార్‌లో ఇప్పటికే ఆర్ఎల్ఎస్పీ ఎన్డీయే నుంచి బయటకొచ్చేయగా తాజాగా లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. -
బీజేపీకి మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా.. బీజేపీకి మరో షాక్ ఇచ్చారు. బిహార్‌లోని మహాకూటమితో చేతులు కలిపారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, హిందూస్తాన్ అవామ్ మోర్చా భాగస్వాములుగా ఉన్న మహాకూటమిలో చేరుతున్నట్టు గురువారం ఏఐసీసీ కార్యాలయంలో కుష్వాహా ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్, కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మేము ఇప్పుడు యూపీఏలో భాగస్వాములం. ఎన్డీఏ కూటమిలో నన్ను తీవ్రంగా అనుమానించార’ని ఈ సందర్భంగా కుష్వాహా తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ తమతో చేతులు కలపడాన్ని తేజశ్వి యాదవ్ స్వాగతించారు. ‘బిహార్ ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నాం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేమంతా ఈగోలు వదిలిపెట్టాల్సిన అవసరముంది. జాతీయ స్థాయిలోనూ మహాకూటమి ఏర్పాటుకు పని మొదలుపెట్టాల’ని తేజశ్వి పేర్కొన్నారు. కుష్వాహా చేరికతో బిహార్‌లో మహాకూటమి బలం పెరిగింది. బీజేపీ, జనతాదళ్(యూ), లోక్ జనశక్తి భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ కూటమిని లోక్‌సభ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొవాలని మహాకూటమి భావిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో కుష్వాహా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్డీఏ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని బీజేపీ ప్రకటించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, జేడీ(యూ) సమాన సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, బీజేపీ, జేడీ(యూ) మధ్య సీట్ల పంపకాల విషయంలో లోక్ జనశక్తి(ఎల్జేపీ) కూడా అసంతృప్తితో ఉందని.. రాంవిలాస్ పాశ్వాన్ కూడా త్వరలోనే బయటకు వస్తారని కుష్వాహా ప్రకటించి కలకలం రేపారు. -
కుష్వాహాకు తిరుగుబాటు సెగ
పట్నా: రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాకు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి కుష్వాహా బయటకు వెళ్లిపోయినా, తాము కూటమిలోనే ఉంటామని బిహార్ ఆర్ఎల్ఎస్పీ ఎమ్మెల్యేలు సుధాంశు శేఖర్, లలన్ పాశ్వాన్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్ శ్యామ్ చెప్పారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే కుష్వాహా ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. ఆర్ఎల్ఎస్పీలో మెజారిటీ ఆఫీస్‌బేరర్ల మద్దతు తమకే ఉందన్నారు. ఆల్ఎల్ఎస్పీ ఎన్నికల గుర్తు విషయమై త్వరలోనే ఈసీని కలుస్తామని తెలిపారు. ఆర్ఎల్ఎస్పీకి బిహార్‌లో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. -
ఎన్డీఏకు కుష్వాహా గుడ్‌బై
న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా అధికార ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. కేంద్ర మానవ అభివృద్ధి వనరుల సహాయ మంత్రిగా ఉన్న కుష్వాహా సోమవారం తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించారు. మంత్రి వర్గాన్ని ప్రధాని మోదీ రబ్బర్ స్టాంపుగా మార్చేశారనీ, వెనుకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని తన రాజీనామా లేఖలో ఆరోపించారు. తమ పార్టీ బిహార్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన ప్రతిపక్ష కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఊహించిన పరిణామమే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు కుష్వాహా ఎన్డీఏ నుంచి వైదొలుగుతారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. సోమవారం కుష్వాహా తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో నిర్లక్ష్యానికి, మోసానికి గురైనట్లు భావిస్తున్నా. పేదల సంక్షేమం కోసం పనిచేయడం మాని, రాజకీయ విరోధులను అణచి వేయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బిహార్‌లో ఒక్క సీటు కూడా ఎన్డీఏకు దక్కదు’ అని అందులో పేర్కొన్నారు. ఆర్ఎల్ఎస్పీకి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఎమ్మెల్యేలిద్దరూ పార్టీని వీడారు. కుష్వాహా ప్రభావం ఎంత? కుష్వాహా చేసిన రాజీనామా ఉత్తరప్రదేశ్, బిహార్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న కోయిరీ(కుష్వాహా) కులానికి చెందిన నేత కుష్వాహా. బీసీ వర్గమైన కోయిరీలు ఈ రెండు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఉన్నారు. బిహార్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని కూటమిలో ఆర్ఎల్ఎస్పీ చేరి, తర్వాత బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమిలో చేరితే హిందీ ప్రాంతాల్లోని కోయిరీలపై ఎంత వరకు ప్రభావం ఉంటుందో చెప్పడం కష్టం. అదే బాటలో మరో పార్టీ! ఎన్డీఏలోని మరో పక్షం అసోం గణపరిషత్ (ఏజీపీ) నడిచే అవకాశముంది. పౌరసత్వ సవ రణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే ఎన్డీఏ నుంచి వైదొలుగుతామంటూ హెచ్చరించింది. -
కేంద్ర మంత్రి కుష్వాహా రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. కుష్వాహా తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) ఆమోదం కొరకు పంపినట్టు తెలిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీఏ సీట్ల సర్ధుబాటు ప్రతిపాదనలతో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్ వైఖరితో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఎన్డీఏ సర్కార్ నుంచి బయటకు రావాలని ఇటీవల జరిగిన ఆర్ఎల్ఎస్పీ మేధోమధన భేటీలో ఆ పార్టీ నిర్ణయించింది. కాగా సోమవారం జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి తాను హాజరు కాబోనని కుష్వాహా ప్రకటించారు. ఈనెల 12న పార్టీ నేతల కీలక భేటీలో ఎన్డీఏ నుంచి వైదొలగే అంశంపై ఆర్ఎల్ఎస్పీ ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కాగా,ఎన్డీఏ వ్యవహారాలపై సంప్రదించేందుకు తాను బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల సమయం కోరినా తనకు అపాయింట్మెంట్ నిరాకరించారని గతంలో కుష్వాహా అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు బిహార్‌లో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏర్పాటైన మహాకూటమిలో ఆ పార్టీ చేరవచ్చని తెలుస్తోంది. -
పార్టీల్ని చీల్చడంలో నితీశ్ ఘనుడు: కుష్వాహా
పట్నా: బిహార్‌లో ఎన్డీయే మిత్ర పక్షాలు జేడీ(యూ), ఆర్ఎల్ఎస్పీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జేడీయూలో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్ఎల్ఎస్పీ అధినేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా సీఎం నితీశ్‌కుమార్‌పై మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి ఫిర్యాదుచేస్తానని కుష్వాహా తెలిపారు. పార్టీలను చీల్చడంలో నితీశ్ ఆరితేరారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిహార్‌లో సీట్ల పంపకంపై త్వరగా స్పష్టత ఇవ్వాలని షాపై ఒత్తిడితెస్తానని చెప్పారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌ను కలుసుకున్న తరువాత ఆర్ఎల్ఎస్పీ ఎమ్మెల్యే సుధాంశు శేఖర్ పార్టీ మారబోతున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో కుష్వాహా పైవిధంగా స్పందించారు. మరో ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ కూడా జేడీయూలో చేరే అవకాశాలున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. -
‘మళ్లీ ఆయన సీఎంగా ఉండాలనుకోవడం లేదు’
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌పై రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘2020 ఎన్నికల్లో బిహార్ ప్రజలు మరోసారి జేడీయూకి అధికారం ఇవ్వకపోవచ్చు. అందుకే తాను మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదని నితీష్ అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నితీషే కొన్ని నెలల క్రితం తనతో చెప్పాడు’ అని ఉపేంద్ర వెల్లడించారు. (మళ్లీ ఆయనే సీఎం: సర్వే) 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు మరో దఫా ఓటు వేసి గెలిపించక పోవచ్చునని నితీష్ తన మనసులో మాట బయటపెట్టినట్టు కేంద్రమంత్రి వివరించారు. నితీష్‌కుమార్, జేడీయూపై నేను చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి కావని అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉపేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్ భవిష్యత్‌పై ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు కామెంట్లు చేయడంతో రాజకీయంగా ప్రాదాన్యత సంతరించుకుంది. (జేడీయూతో దోస్తి.. దిగొచ్చిన బీజేపీ) కాగా, ఎన్డీయే కూటమిలో తిరిగి చేరిన జేడీయూకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇచ్చేందుకు భాగస్వామ్య పక్షాలు కొన్ని సీట్లు త్యాగం చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశాడు. క్రితం సారి ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి మూడు ఎంపీ స్థానాలు కేటాయించిన బీజేపీ ఈ సారి ఆ సంఖ్యను రెండుకు కుదించింది. ఈ నేపథ్యంలోనే అసహనంతో ఉపేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా..పటేల్ జయంతి సభకు కొన్ని గంటల ముందు ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్‌తో ఉపేంద్ర భేటీ అయ్యారు. అయితే, స్నేహపూర్వక భేటీలో భాగంగానే తేజస్వీని కలిసినట్టు ఉపేంద్ర వెల్లడించారు. -
‘నేను గిల్లీదండ బాగా ఆడతాను’
పాట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌లో పొత్తుల చర్చలు ఊపందుకుంటున్నాయి. బీజేపీ, జేడీ(యూ), ఆర్ఎల్ఎస్పీ పార్టీల మధ్య సీట్ల పంపిణీ వ్యవహారం తీవ్ర రూపం దాల్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి కేంద్ర మంత్రి, ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుషాహ ‘మా పార్టీలో జరిగే విషయాల గురించి మా కంటే ముందు మీకే తెలుస్తున్నాయి. సీట్ల పంపిణీ ఉంటుందా లేదా అనే విషయం గురించి పార్టీల్లో కన్నా మీడియాలోనే ఎక్కువ చర్చ జరుగుతుంది’ అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో బిహార్‌లో బీజేపీ 20 - 20 ఫార్మాట్‌ని పాటించబోతుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ సీట్లలో 20 సీట్లు బీజేపీకి, మిగిలిన 20 సీట్లలో 12 నితిష్ కుమార్ జేడీ(యూ)కి మరో 6 రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీకి కేటాయించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీని గురించి ఉపేంద్రను ప్రశ్నించగా ఆయన నేను కాస్తా పాత తరం వాడిని.. అందుకే నాకు ఈ 20 - 20 ఫార్మాట్ గురించి పూర్తిగా తేలీదు.. అర్థం కూడా కాదు. కానీ నేను గిల్లీ దండ మాత్రం చాలా బాగా ఆడతానంటూ వెరైటీగా స్పందించారు. అంతే కాకుండా సీట్ల పంపిణీ గురించి సదరు పార్టీల్లోకన్నా మీ చానెల్స్‌లోనే ఎక్కువ చర్చ జరుగుతుందన్నారు. వ్యక్తిగతంగా అయితే తనకు సీట్ల పంపకం నచ్చదన్నారు. కానీ పార్టీ నుంచి నిర్ణయం వెలువడే వరకూ తాను ఈ విషయం గురించి ఏం మాట్లడనన్నారు. -
ఆర్ఎల్ఎస్పీలో చీలికలు
పట్నా: కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)లో చీలికలు మొదలయ్యాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఒక ఎంపీ, ఎమ్మెల్యేను పార్టీ అధినాయకత్వం తొలిగించింది. అయితే ఆగస్టు 17న నేతలంతా కలసి సమావేశమై పార్టీ నాయకత్వాన్ని మార్చారు కనుక తమను తొలిగించే అధికారం ఆర్ఎల్ఎస్పీ నేత, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహాకు లేదని బహిష్కరణకు గురైన నేతలు ఆరోపించారు. దీంతో పార్టీలో విభేదాలు గుప్పుమన్నాయి. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ లోక్‌సభ ఎంపీ అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్‌లను పార్టీ క్రమశిక్షణా కమిటీ నాయకుడు ఎంపీ రామ్‌కుమార్ శర్మ పార్టీ నుంచి తొలిగించినట్లు ఆర్ఎల్ఎస్పీ ప్రధాన కార్యదర్శి శివ్‌రాజ్‌సింగ్ తెలిపారు. వీరితో పాటు మాజీ జాతీయ జనరల్ సెక్రటరీ బినోద్ కుష్వాహనూ తొలిగించామన్నారు. ఆగస్టు 17న వీరు సమావేశమై ప్రస్తుత అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ స్థానంలో ఎంపీ అరుణ్‌కుమార్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని ఆరోపించారు. -
ప్రమాణం చేయకముందే ఎమ్మెల్యే హఠాన్మరణం
పట్నా: బిహార్ శాసనసభకు తొలిసారి ఎన్నికైన ఆర్ఎల్ఎస్పీ ఎమ్మెల్యే బసంత్ కుమార్ సోమవారం గుండెపోటుతో మరణించారు. ఇటీవల ఛాతినొప్ప రావడంతో పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బసంత్ కుమార్.. ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. బసంత్ కుమార్ మృతిపట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామి ఆర్ఎల్ఎస్పీ తరపున హర్లఖీ నియోజకవర్గం నుంచి బసంత్ కుమార్ గెలుపొందారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన మరణించడంతో విషాదం చోటు చేసుకుంది. బిహార్ కొత్త శాసనసభ తొలిసారిగా ఈ రోజు సమావేశమైంది. బసంత్ కుమార్ హఠాన్మరణం చెందడంతో ఈ రోజు జరగాల్సిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదాపడింది. ఆయన మృతికి సంతాపం సూచకంగా ఓ నిమిషం మౌనం పాటించిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఎమ్మెల్యేలు మంగళవారం ప్రమాణం చేస్తారని ప్రొటెం స్పీకర్ సదానంద్ సింగ్ ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీ తరపున ఇద్దరు మాత్రమే నెగ్గారు. బసంత్ కుమార్ మరణంతో శాసనసభలో ఆర్ఎల్ఎస్పీ బలం ఒకటికి పడిపోయింది. బిహార్‌లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జేడీయూ నేత నితీశ్ కుమార్ మంత్రివర్గంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు చేరాయి.