కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలో చీలికలు మొదలయ్యాయి.
పట్నా: కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ)లో చీలికలు మొదలయ్యాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఒక ఎంపీ, ఎమ్మెల్యేను పార్టీ అధినాయకత్వం తొలిగించింది. అయితే ఆగస్టు 17న నేతలంతా కలసి సమావేశమై పార్టీ నాయకత్వాన్ని మార్చారు కనుక తమను తొలిగించే అధికారం ఆర్‌ఎల్‌ఎస్పీ నేత, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహాకు లేదని బహిష్కరణకు గురైన నేతలు ఆరోపించారు. దీంతో పార్టీలో విభేదాలు గుప్పుమన్నాయి.
అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ లోక్‌సభ ఎంపీ అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్‌లను పార్టీ క్రమశిక్షణా కమిటీ నాయకుడు ఎంపీ రామ్‌కుమార్ శర్మ పార్టీ నుంచి తొలిగించినట్లు ఆర్‌ఎల్‌ఎస్పీ ప్రధాన కార్యదర్శి శివ్‌రాజ్‌సింగ్ తెలిపారు. వీరితో పాటు మాజీ జాతీయ జనరల్ సెక్రటరీ బినోద్ కుష్వాహనూ తొలిగించామన్నారు. ఆగస్టు 17న వీరు సమావేశమై ప్రస్తుత అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ స్థానంలో ఎంపీ అరుణ్‌కుమార్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని ఆరోపించారు.