పట్నా : కౌంటింగ్ రోజున అధికార పార్టీ అవకతవకలకు పాల్పడితే.. జనాలు ఊరుకోరు.. రక్తపాతం సృష్టిస్తారని హెచ్చరిస్తున్నారు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ) నాయకుడు ఉపేంద్ర కుష్వహా. బిహార్, యూపీల్లో ఈవీఎంల తరలింపు విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తున్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ఎవరూ సరిగా సమాధానం చెప్పడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూసి జనాలు భయపడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. మహాకూటమి కానీ, ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరు. మా ఓటు.. మాకు గౌరవం, జీవనాధారం. మా బతుకుల జోలికి వస్తే.. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టి ఎలా పోరాడతామో.. అలానే మా ఓట్ల కోసం కూడా కొట్లడతాం. ఓట్ల లెక్కిపు రోజున ఏవైనా అవకతవకలు జరిగితే మాత్రం హింసాకాండ చెలరేగడం.. రక్తం ఏరులై పారడం ఖాయం’ అన్నారు.
అంతేకాక ‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాం. అప్పుడు జనాల్లో మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత.. మా(మహాకూటమి) పాట్ల సానుకూల స్పందన కనిపించింది. చాలా చోట్ల మహాకూటమి విజయం సాధిస్తుందని అర్థమైంది. అందుకే ఓట్ల లెక్కింపు నాడు ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల’ని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎన్డీఏ ఖండిస్తుంది. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆర్‌ఎల్‌ఎస్‌పీకి చెందిని ఉపేంద్ర కుష్వహా ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టాడు. కానీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో.. ఆ పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతో గత ఏడాది డిసెంబరులో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment