నమో నమ: | Exit poll results suggest big win for NDA 2019 | Sakshi
Sakshi News home page

నమో నమ:

Published Mon, May 20 2019 5:15 AM | Last Updated on Mon, May 20 2019 5:18 AM

Exit poll results suggest big win for NDA 2019 - Sakshi

2014లో ప్రధాని పీఠాన్నిచ్చిన యూపీలో ఈసారి బీజేపీకి భారీ దెబ్బ తప్పదు.. మమత, అఖిలేశ్‌–మాయావతి, నవీన్‌ పట్నాయక్, స్టాలిన్‌ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీ జోరును విజయవంతంగా అడ్డుకుంటారు.. మొన్నటివరకు వెన్నంటి ఉన్న హిందీబెల్ట్‌ ఈసారి బీజేపీకి మొహం చాటేయడం ఖాయం.. మోదీ మళ్లీ ప్రధాని కావడం దాదాపుగా అసంభవం.. మోదీ, అమిత్‌ షా ముఖంలో ఆ ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.. ఇదీ ఏడు విడతల వారీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలు. కానీ ఈ అంచనాలేవీ నిజం కాకపోవచ్చని.. మోదీ మరోసారి స్పష్టమైన మెజారిటీతో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని పోస్ట్‌పోల్‌ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం 300 సీట్లతో ఎన్డీయే రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి.



న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. ఏడుదశల్లో హోరాహోరీగా జరిగిన పోరులో.. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్రమైన పోటీని తట్టుకుని మరీ మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని అభిప్రాయపడ్డాయి. ప్రధానిగా మోదీ పనితీరుకు, కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవానికి, ప్రాంతీయ పార్టీల సత్తాకు అసలు సిసలు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీకే జై కొట్టబోతున్నారని వెల్లడించాయి.

దాదాపుగా అన్ని సంస్థల సర్వే ఫలితాల్లోనూ ఎన్డీయే మేజిక్‌ ఫిగర్‌ (272)ను దాటి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని వెల్లడైంది. 2014 ఎన్నికల్లో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్‌ గతంలో కంటే కాస్త మెరుగుపడినా.. బీజేపీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలు జరిగిన 542 స్థానాలకు గానూ బీజేపీ కూటమి దాదాపుగా 300 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ 127 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఈ రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలు 115 స్థానాలను కైవసం చేసుకునే పరిస్థితి కనుబడుతోందని సర్వే ఫలితాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రభావవంతంగా మహా ఘట్‌బంధన్‌
అత్యంత కీలమైన మహారాష్ట్ర సహా హిందీ బెల్ట్‌లోని గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. మోదీ వర్సెస్‌ దీదీ రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అనూహ్యంగా దూసుకుపోనుందని.. తృణమూల్‌కు గట్టిపోటీ ఇచ్చిందని సర్వేలు తెలియజేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక స్థానాలున్న (80 ఎంపీలు) ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ మహాఘట్‌బంధన్‌ ప్రభావం స్పష్టంగా ఉందని పలు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక్కడ బీజేపీకి 40 సీట్ల వరకు రావొచ్చని అభిప్రాయపడ్డాయి. అయితే యూపీలో కోల్పోయే సీట్ల నష్టాన్ని పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో కొంతమేరనైనా పూడ్చుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో యూపీలో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది.

ప్రియాంక, రాహుల్‌ ప్రభావమేదీ?
గతేడాది చివర్లో జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడం, కాంగ్రెస్‌ బలం పుంజుకోవడం, మోదీ సర్కారు తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు, వ్యవసాయ సంక్షోభం, యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి మొదలైన కారణాలతో మోదీకి ఎదురుగాలి వీస్తోందనే చర్చ మొదలైంది. బాలాకోట్‌ దాడుల ప్రభావం బీజేపీకి నైతిక బలాన్నిస్తుందని భావించినప్పటికీ.. వ్యవసాయరంగ సమస్యలు, నిరుద్యోగుల్లో అసంతృప్తి వంటివాటిపైనే కాంగ్రెస్‌ ప్రధానంగా దృష్టిసారించింది. దీంతో బీజేపీకి ఎదురుగాలి తప్పదని.. పరిశీలకులు అంచనా వేశారు.

ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్‌కు బలాన్నిస్తుందని భావించారు. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 336 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెస్‌కు 59, ఇతరులకు 148 సీట్లు వచ్చాయి. అయితే, మోదీ హవా ఏ మాత్రం తగ్గలేదని, రాహుల్‌గాంధీ, ప్రియాంకలు అనుకున్నంతగా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. దక్షిణభారతంలో మాత్రం బీజేపీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయలేదని.. మొత్తంగా 30 స్థానాల్లోపే ఉండొచ్చని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకే మెజారిటీ వస్తుందని మెజారిటీ సంస్థలు స్పష్టం చేశాయి. ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ 18–20 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపాయి.

దేశానికి నిస్వార్థం, అంకితభావంతో సేవలు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి సానుకూలంగా భారీగా పోలింగ్‌ జరిగిందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టంగా చెబుతున్నాయి. సుపరిపాలన అందించిన మోదీకి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. మోదీపై నిరాధార ఆరోపణలు, అబద్ధాలు చెప్పిన ప్రతిపక్షాలు ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివి.

–జీవీఎల్‌ నరసింహారావు, బీజేపీ

ఆస్ట్రేలియాలో గతవారం 56 ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పుగా తేలాయి. భారత్‌లో చాలామంది ప్రజలు తామెవరికి ఓటేశామో బహిరంగంగా చెప్పరు. అసలు ఫలితాల కోసం మే 23 వరకూ
ఎదురుచూస్తాం.

– శశిథరూర్, కాంగ్రెస్‌
 
రిపబ్లిక్‌ టీవీ డబుల్‌ ఎగ్జిట్‌ పోల్‌
మళ్లీ ఎన్డీయేనే..!
17వ లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే పట్టం కట్టనున్నారని ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్‌ రిపబ్లిక్‌టీవీ సీ–ఓటర్, జన్‌ కీ బాత్‌ సంస్థలతో కలసి నిర్వహించిన డబుల్‌ ఎగ్జిట్‌ పోల్‌ జోస్యం చెప్పింది. రిపబ్లిక్‌సీ–ఓటర్‌ సర్వే ప్రకారం ఎన్డీఏ 287 సీట్లు (42.3% ఓట్లు), కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ 128 స్థానాలు (28.1% ఓట్లు), యూపీ లోని బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహాగఠ్‌ బంధన్‌ 40 సీట్లు, రెండు కూటముల్లో లేని ఇతర పార్టీలు 87 సీట్లు గెలుచుకోనున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు 336 సీట్లు రాగా ఈసారి 49 సీట్లు తగ్గుతా యని ఈ సర్వే జోస్యం చెబుతోంది. మరోవైపు రిపబ్లిక్‌– జన్‌ కీ బాత్‌ సర్వే ప్రకారం ఎన్డీఏ 305 (45.5%), యూపీఏ 124 (24.5%), మహాఘట్‌బంధన్‌కు 26 సీట్లు సాధిస్తాయని తేలింది.

యూపీలో బీజేపీ x మహాకూటమి
ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి 38, మహాకూటమికి 40, కాంగ్రెస్‌కు రెండు సీట్లు వస్తాయని రిపబ్లిక్‌–సీ ఓటర్‌ సర్వే అంచనా వేయగా రిపబ్లిక్‌–జన్‌ కీ బాత్‌ సర్వే బీజేపీకి 46–57 సీట్లు, మహాకూటమి 21–32 సీట్లు, కాంగ్రెస్‌ 2–4 సీట్లు వస్తాయని పేర్కొంది. మహరాష్ట్రలోని 48 సీట్లలో బీజేపీ–శివసేన కూటమికి 34, యూపీఏకు 14 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్‌–సీ ఓటర్‌ సర్వే పేర్కొంది. బీజేపీ–శివసేన కూటమికి 34–39, కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన యూపీఏకు 8–12 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్‌–జన్‌ కీ బాత్‌ సర్వేలో అంచనా వేశారు. అలాగే 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు 29, బీజేపీకి 11, కాంగ్రెస్‌కు రెండు సీట్లు దక్కుతాయని సీ–ఓటర్‌–రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. బీజేపీకి 18–26, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 13–21, కాంగ్రెస్‌కు మూడు సీట్లు వస్తాయని జన్‌ కీ బాత్‌ సర్వే తెలిపింది.

మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కమలం స్వీప్‌
మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లలో బీజేపీకి 24, కాంగ్రెస్‌కు 5 స్థానాలు లభిస్తాయని సీ–ఓటర్‌ సర్వే, బీజేపీ 21–24, కాంగ్రెస్‌కు 5–8 సీట్లు గెలుచుకుంటాయని జన్‌కీబాత్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేశాయి. అలాగే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఉన్న 26 ఎంపీ సీట్లలో బీజేపీకి 22, కాంగ్రెస్‌కు 4 సీట్లు దక్కుతాయని సీ–ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్, బీజేపీకి 22–23, కాంగ్రెస్‌కు 3–4 సీట్లు దక్కుతాయని జన్‌కీబాత్‌ సర్వేలు జోస్యం చెప్పాయి. 40 సీట్లున్న బిహార్‌లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏకు 33, ఆర్జేడీ, కాంగ్రెస్‌ తదితర పార్టీలున్న ప్రతిపక్ష కూటమికి 7 సీట్లు లభిస్తాయని సీ–ఓటర్‌ సర్వే జోస్యం చెప్పింది. జన్‌ కీ బాత్‌ సర్వే ప్రకారం ఎన్డీఏకు 28–31, ఆర్జేడీ కూటమికి 11–8 ఇతరులకు ఒక సీటు వస్తాయని అంచనా వేశారు.

కర్ణాటకలో కాషాయపక్షానిదే హవా
28 సీట్లున్న కర్ణాటకలో బీజేపీకి 18, కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి 9 సీట్లు లభిస్తాయని, ఓ సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకుంటారని సీ–ఓటర్‌ సర్వే, బీజేపీకి 18–20, కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి 10–7 సీట్లు దక్కుతాయని జన్‌ కీ బాత్‌ ఎగ్జిట్‌ పోల్‌ సూచిస్తున్నాయి. తమిళనాడులో పోలింగ్‌ జరిగిన 38 సీట్లలో కాంగ్రెస్, డీఎంకేతో కూడిన యూపీఏకు 27, బీజేపీ, ఏఐడీఎంకేతో కూడిన ఎన్డీఏకు 11 సీట్లు వస్తాయని సీ–ఓటర్‌ సర్వే తెలిపింది. జన్‌ కీ బాత్‌ ఎగ్జిట్‌ పోల్‌ ప్రకారం ఎన్డీఏకు 9–13, యూపీఏకు 15–29 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు.


టైమ్స్‌ నౌ టీవీ చానల్‌ వీఎంఆర్‌ సంస్థతో కలసి నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 542 ఎంపీ స్థానాలకుగాను 306 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 3,211 ప్రత్యేక ప్రాంతాల్లో తాము సుమారు 40 వేల మందితో శాంపిల్‌ సేకరించామని, భౌగోళిక, ఓటింగ్‌ సరళిలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసిన మరో 40 వేల మంది నుంచి సమాచారం సేకరించిన తరువాత తుది అంచనాకు వచ్చామని టౌమ్స్‌ నౌ వెల్లడించింది. తొలిదశ పోలింగ్‌ మొదలైన ఏప్రిల్‌ 11 నుంచి ఆదివారం జరిగిన తుది విడత వరకు సమాచార సేకరణ జరిగిందని తెలిపింది. తుది అంచనాల ప్రకారం ఎన్డీయే 306 స్థానాలు గెలుచుకోనుండగా  యూపీఏ 132స్థానాలకు పరిమితం కానుంది. అదే సమయంలో ఇతర పార్టీలు మొత్తం 104 స్థానాల్లో విజయం సాధించ వచ్చు. కూటముల వారీగా ఓటింగ్‌ శాతాన్ని గమనిస్తే ఎన్డీయే 41.1% ఓట్లు కైవసం చేసుకోనుండగా యూపీఏ 31.7, ఇతర పార్టీలు 27.2 % ఓట్లు సాధిస్తాయని తెలిపింది.



యూపీలో బీజేపీకి 58 సీట్లు
దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 58 స్థానాలు సాధిస్తుందని, కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలకు పరిమితమవు తుందని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ ఎగ్జిట్‌ పోల్‌ లెక్క గట్టింది. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎస్‌ఎల్‌పీలతో కూడిన మహాఘట్‌ బంధన్‌ 20 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. అలాగే 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్‌లో టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ అంచనాల ప్రకారం బీజేపీ 11 స్థానాలు గెలుచుకోవచ్చు. అదే సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ 28 స్థానాల్లోనూ, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లోనూ విజయం సాధించవచ్చు. మొత్తం 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమి 38 స్థానాల్లో విజయం సాధించనుండగా.. కాంగ్రెస్‌– ఎన్సీపీల కూటమి పది స్థానాలు గెలుచుకోనుంది. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో మొత్తం 26 ఎంపీ స్థానాలు ఉండగా బీజేపీ అత్యధికంగా 23 స్థానాలు గెలుచుకోనుంది. కాంగ్రెస్‌ మూడు స్థానాలకే పరిమితం కానుంది. తమిళనాడు విషయానికొస్తే డీఎంకే 29 స్థానాలు, ఏఐఏడీఎంకే తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశం ఉంది.


ఎన్డీయేకి 300 వరకు సీట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 300 వరకు సీట్లతో ఎన్డీయే సునాయాస విజయం సాధిస్తుందని ఎన్డీటీవీ పోల్‌ ఆఫ్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. యూపీఏ 127, ఇతర పార్టీలు 123 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్‌ల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు అత్యధిక స్థానా ల్లో విజయం సాధించనున్నట్లు అంచనా వేశాయి. హరియాణ, అసోం, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రా ల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేయనుంది. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లలో బీజేపీకి 49 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఎస్పీ, ఎస్పీల కూటమి 29 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లో (42 సీట్లు) 2014 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈసారి 14 సీట్లతో రెండంకెలకు చేరుకోనుంది.

టీఎంసీకి 26, కాంగ్రెస్‌కు 2 సీట్లు దక్కే అవకాశం ఉంది. మహారాష్ట్రలో (48 సీట్లు) బీజేపీ–శివసేనల విజయం సుస్పష్టమవుతోంది. ఒడిశాలో (21) మాత్రం బీజేపీ (10), అధికార బిజూ జనతాదళ్‌ (10) మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఒక సీటులో విజయం సాధించే అవకాశం ఉంది. తమిళనాడులో (38) బీజేపీ, ఏఐఏడీఎంకేల కూటమికి 11, డీఎంకే, కాంగ్రెస్‌ల కూటమి 27 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బిహార్‌లో (40) బీజేపీ, జేడీయూలు 32 సీట్లలో విజయకేతనం ఎగురవేయనున్నాయి. గుజరాత్‌లో (మొత్తం 26) 23 సీట్లతో, రాజస్తాన్‌లో (25) 22 సీట్లతో బీజేపీ దాదాపుగా క్లీన్‌స్వీప్‌ చేయనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ను బట్టి తెలుస్తోంది.


కర్ణాటక.. కాషాయానిదే హవా


దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలకు ఊపునిచ్చిన తొలి రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల అనంతరం జట్టు కట్టిన కాంగ్రెస్‌ జేడీఎస్‌లు ఒకవైపు.. బీజేపీ మరోవైపు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుందంటున్నాయి. కాంగ్రెస్‌–జేడీఎస్‌ పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరక్కపోవడంతోపాటు.. ఇరు పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు కూటమికి మైనస్‌ కానుంది. దీనికితోడు కర్ణాటకలోని తీర ప్రాంతంలో బీజేపీ పట్టు కొనసాగడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు గెలుచుకోగా, వీటిల్లో అత్యధికం కోస్తా ప్రాంతం నుంచే రావడం గమనార్హం.

తమిళనాడు .. డీఎంకేకు జై

ప్రాంతీయ పార్టీల కలగూర గంప తమిళనాడులో ఈసారి డీఎంకే పూర్తి అధిపత్యం కనబరుస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చి చెప్పాయి. మొత్తం 38 స్థానాలుండగా.. వెల్లూరు లోక్‌సభ స్థానం పోలింగ్‌ వాయిదా (భారీగా డబ్బు పట్టుబడడంతో) పడింది. కాంగ్రెస్, డీఎంకేతో సహా పలు పార్టీలకు యూపీయే కూటమిగా.. ఏఐఏడీఎంకే, పలు చిన్న పార్టీలతో బీజేపీ మరో కూటమిగా బరిలో నిలిచింది. ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం.. డీఎంకే కూటమి 34–38 స్థానాల్లో.. బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి గరిష్టంగా 5చోట్ల గెలవొచ్చని తెలుస్తోంది. న్యూస్‌ 18– ఐఎస్‌పీఎస్‌ఓస్‌ అంచనా కాస్త భిన్నంగా ఉంది. ఈ సర్వే డీఎంకే 22–24 స్థానాలు.. బీజేపీ–ఏఐఏడీఎంకే 14–16 స్థానాలను అంచనావేస్తోంది. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల మరణం తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలపై ఆసక్తి పెరిగింది.

కేరళ.. కాంగ్రెస్‌కు బలం

దశాబ్దాలుగా తమను గెలిపిస్తున్న అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీచేయాలన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిర్ణయాన్ని చాలామంది తప్పుపట్టినప్పటికీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను బట్టి చూస్తే అతడి నిర్ణయం సరైందే అనిపించకమానదు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోగలదని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతూండటం ఇందుకు కారణం. రాష్ట్రంలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. యూడీఎఫ్‌ 15 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 3స్థానాలు ఎక్కువ. ఇదే సమయంలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ 3చోట్ల బీజేపీ ఒకచోట గెలిచే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి.   

బెంగాల్‌..  దీదీ కోటకు బీటలు

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ కోటలోకి చొరబడాలన్న కమలనాథుల ఆశ నెరవేరనున్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో మమత ఆధ్వర్యంలోని తృణమూల్‌కు 24–28 సీట్లు వస్తాయని, బీజేపీ 14 సీట్లలో జయకేతనం ఎగురవేసే అవకాశం ఉందని సర్వేలంటున్నాయి. 2014 ఎన్నికల్లో తృణమూల్‌ 34 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి కేవలం 2 స్థానాలే దక్కాయి.  అయితే ప్రధాని మోదీ ఏకంగా రాష్ట్రంలో 17 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారంటే బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో పోలింగు హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, సీపీఎం శ్రేణులు పరోక్షంగా బీజేపీకి సహకరించడం మమతకు  నష్టం కలిగించి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

మహారాష్ట్ర..  ఎన్డీయేదే పైచేయి

దేశంలో యూపీ తర్వాత రెండో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈసారి కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయకే మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉంది. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే 38–42 సీట్లు.. యూపీయే 6–10 చోట్ల గెలుస్తాయని సర్వేలు పేర్కొన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమి 42 సీట్లు గెలుచుకుంది. బీజేపీ–శివసేనల విభేదాలను అనుకూలంగా మలుచుకోవాలన్న కాంగ్రెస్‌ ఆశ నెరవేరలేదు. పుల్వామా దాడి, బాలాకోట్‌ సర్జికల్‌ దాడుల నేపథ్యంలో బీజేపీ–శివసేన విజయం సాధిస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి.

గుజరాత్‌..  బీజేపీ క్లీన్‌ స్వీప్‌

మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేయనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలోని 26 లోక్‌సభ సీట్లలో.. బీజేపీకి 25 సీట్లు రావచ్చని న్యూస్‌18–ఐపీఎస్‌వోఎస్‌ సర్వేలో వెల్లడయింది. ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవచ్చని ఆ సర్వే వెల్లడించింది. న్యూస్‌ 24–చాణక్య సర్వే ప్రకారం బీజేపీ మొత్తం 26 సీట్లలోనూ జయకేతనం ఎగురవేయనుంది. ఇండియాటుడే–యాక్సిస్‌ సర్వేలో కాంగ్రెస్‌కు ఒక సీటు రావచ్చని వెల్లడయింది. 2014 ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలూ బీజేపీకే దక్కాయి.  

యూపీ..  మహాఘట్‌బంధన్‌ సత్తా


అత్యధిక లోక్‌సభ సీట్లున్న యూపీలోని 80 సీట్లలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని టైమ్స్‌ నౌ (58), రిపబ్లిక్‌ టీవీ–జన్‌కీబాత్‌ (53), ఇండియాటుడే (62–68) ఎగ్జిట్‌పోల్స్‌ సూచిస్తున్నాయి. కాగా, బీఎస్పీ–ఎస్పీ–ఆర్‌ఎల్డీ మహాఘట్‌బంధన్‌కు 20 స్థానాలకు పైనే దక్కుతాయని టైమ్స్‌ నౌ (20), జన్‌కీ బాత్‌ (24), సీ–ఓటర్‌ (40), న్యూస్‌ ఎక్స్‌ (41), నీల్సన్‌ (56) అంచనావేశాయి. ఎగ్జిట్‌పోల్‌ అంచనాల ప్రకారం ఎస్పీ–బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ బాగానే జరిగిందనీ, ఎస్సీ, బీసీలతోపాటు ముస్లింలు పెద్ద సంఖ్యలో కూటమికి ఓట్లేశారని అర్థమౌతోంది. కాంగ్రెస్‌కు 2–4 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.

బిహార్‌..  ఎన్డీయే కూటమిదే..

బిహార్‌లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మూడొంతులకు పైగా సీట్లు లభిస్తాయని మెజారిటీ సర్వేలు సూచిస్తున్నాయి. 40 లోక్‌సభ సీట్లున్న బిహార్‌లో ఎన్డీయే కూటమికి టైమ్స్‌ నౌ (30 సీట్లు), సీ–ఓటర్‌ (33), జన్‌కీ బాత్‌ (29) సీట్లు రావొచ్చని సర్వేలు అంచనావేశాయి. యూపీయే మహాకూటమికి 7–10 సీట్లే దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. లాలూ యాదవ్‌ జైల్లో ఉండడం, కుటుంబంలో విబేధాల కారణంగా ఆర్జేడీకి ఓటేయలేదని తెలుస్తోంది.

రాజస్తాన్‌.. 20కి పైనే

2014లో రాజస్తాన్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈసారి కూడా 20కి పైగానే స్థానాలు కాషాయపక్షం గెలుచుకుంటుందని ఇండియా టుడే (22), టైమ్స్‌–నౌ (21), సీ–ఓటర్‌(22), టుడేస్‌ చాణక్య (25), ఏబీపీ నీల్సన్‌ (19) వస్తాయని అంచనావేశాయి. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గరిష్టంగా ఆరుకు మించి సీట్లు రావనే అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం చెప్పాయి. రాజస్తాన్‌ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజేపై వ్యతిరేకతతో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే మోదీ మళ్లీ ప్రధాని కావాలని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని భారీ స్థాయిలో గెలిపిస్తున్నారని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు.  

ఒడిశా, మధ్యప్రదేశ్‌

ఎగ్జిట్‌ పోల్స్‌లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్డీయే గాలి వీస్తుండగా ఒడిశాలో (21 సీట్లు) మాత్రం బీజేపీ పక్షాలు, బిజూ జనతాదళ్‌ మధ్య పోటాపోటీ వాతావరణం కన్పిస్తోంది. ఎన్డీటీవీ బీజేడీ, బీజేపీలకు చెరో 10, కాంగ్రెస్‌కు 1 సీటు వస్తుందని అంచనా వేస్తే, సీఓటర్‌ బీజేడీకి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య మాత్రం బీజేపీ 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

మధ్యప్రదేశ్‌లో

(29 సీట్లు) బీజేపీ గాలి వీస్తుండటం గమనార్హం. ఎన్డీటీవీ, సీఓటర్, టైమ్స్‌ నౌ మూడూ బీజేపీ 24 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement