సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనులపై కపట ప్రేమను చూపిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ఫలాలను కేంద్రం నిలువరిస్తోందని ఆమె మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 % రిజర్వేషన్లు దక్కాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10% రిజర్వేషన్లను అమలు చేస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆగ్రహించారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన జాతీయ బంజారా మీట్–2023 కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల కోసం ఏం చేసిందో స్పష్టం చేయాలన్నారు.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన నూతన పార్లమెంటు భవనం గిరిజనులదేనని అన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రతిష్టాత్మకంగా గిరిజన, ఆదివాసీభవన్‌లను ఏర్పాటు చేసిందన్నా రు. ఢిల్లీలో సంత్ సేవాలాల్ భవనాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలన్నారు.
15 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బంజారాల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు.
సదస్సులో చేసిన ముఖ్య తీర్మానాలు..
♦ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో బంజారా భాషను చేర్చాలి.
♦ దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలను గిరిజనులుగా గుర్తించి ఎస్టీ రిజర్వేషన్లను వర్తింపచేయాలి.
♦ పార్లమెంటు ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా పేరిట బంజారా భవన్‌ను నిర్మించాలి.
♦ పార్లమెంట్ ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా విగ్రహం ఏర్పాటు చేయాలి.
♦ తెలంగాణలో గిరిజన వర్సిటీని ప్రారంభించాలి.
♦ ప్రైవేటు రంగంలోనూ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి.
♦ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో గిరిజనులకు ప్రాధాన్యం కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment