సాక్షి, హైదరాబాద్: గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ)లో కారుణ్య నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కరుణించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదుల సంఖ్యలో ఉద్యోగులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. అయితే వరుసగా మూడేళ్లు లాభాలతో కొనసాగినప్పుడే కారుణ్య నియామకాలు చేపట్టాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూడేళ్ల నుంచి లాభాలు గడించినప్పటికీ కోవిడ్–19 కారణంగా ఆ తర్వాత నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ లాభాల బాటలో ఉంది. ఈ నేపథ్యంలో జీసీసీ కారుణ్య నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఈ ఫైలుపై సీఎం సంతకం చేశారు. దీంతో కారుణ్య నియామకాల ఆర్జీలకు అతి త్వరలో మోక్షం కలగనుంది.
330 మంది ఉద్యోగులతో..
తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటీవ్ కార్పొరేషన్(టీఎస్‌జీసీసీ) పరిధిలో 330 మంది ఉద్యోగులు శాశ్వత, తాత్కాలిక పద్దతిలో పనిచేస్తున్నారు. మూడు డివిజినల్ కార్యాలయాలు, 18 సొసైటీలు, 311 రెగ్యులర్ డిపోలు, 158 సబ్ డిపోలున్నాయి. మరో 125 స్వయం సహాయక సంఘాలతోనూ జీసీసీ అనుసంధానమై కార్యకలాపాలు సాగిస్తోంది. జీసీసీ ద్వారా తేనె, ఇప్పపువ్వు, గమ్, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులతోపాటు సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, కందిపప్పు, ఇతర ఆహార మసాలాలు, సుగంధ ద్రవ్య పొడి(పౌడర్)లు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలకు వంట సరుకులన్నీ దాదాపు జీసీసీ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు జీసీసీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ తయారీ యూనిట్లు విశాఖ కేంద్రంగా నడిచేవి.
అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రతి యూనిట్ కొత్తగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో జీసీసీకి ఏటా కేటాయింపులు జరిపినప్పటికీ రాబడి అంతంత మాత్రంగా ఉండేది. ఇప్పుడు లాభాల బాటలో కార్పొరేషన్ ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. టీఎస్‌జీసీసీ పరిధిలో ఎనిమిదేళ్లలో 30 ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించారు. ఇందుకు సంబంధించి క్లెయిమ్స్ పూర్తి చేసినప్పటికీ కారుణ్య నియామకాలకు అర్హులైన వారసులు 30 మంది దరఖాస్తులు సమర్పించారు. తాజాగా వీరి దరఖాస్తులు పరిశీలించి కారుణ్య నియామకాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది.
Comments
Please login to add a commentAdd a comment