గిరిజన తెగలకు రిజర్వేషన్ కల్పించాలి
Published Fri, Jul 29 2016 11:17 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
బెల్లంపల్లి : రాష్ట్రంలో పన్నెండు గిరిజన తెగలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ గిరిజన రిజర్వేషన్ సాధన సమితి(జీఆర్‌ఎస్‌ఎస్) జిల్లా అధ్యక్షుడు పెందూరు ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కుడిమెత తిరుపతి డిమాండ్ చేశారు. పట్టణంలోని పద్మశాలి భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అనాది నుంచి గిరిజన తెగలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నాయని అన్నారు. గిరిజన తెగల అభివృద్ధి, సంక్షేమానికి పాలక ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం గిరిజన తెగలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు.
విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో న్యాయం చేయాలని అన్నారు. వాల్మీకి, బోయ, కైతిలంబాడి గిరిజన తెగలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెన్నప్ప కమిషన్ చేసిన సిఫారసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గిరిజన తెగలకు పది శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని డెప్యూటీ తహసీల్దార్ వాసంతికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు తహశీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. జిల్లా కార్యదర్శులు దాసరి విజయ, ఉండాడి మల్లయ్య, కుర్సింగ సూర్యభాన్, ప్రచార కార్యదర్శి జోడి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement