సమావేశంలో ప్రధాని మోదీకి పూలమాల వేస్తున్న జేపీ నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 370 నియోజవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బీజేపీ సొంతంగానే 370 స్థానాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కనీసం 400 స్థానాలు దక్కించుకోవడానికి రాబోయే వంద రోజులు కష్టపడి పనిచేయాలని వెల్లడించారు.
గడిచిన పదేళ్ల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు లభిస్తున్నగౌరవాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమయ్యాయి. మరో మూడు నెలల్లోగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు.
తొలిరోజు భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కోర్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు సహా 11 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విజయాలను తెలిలియజేసే ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ, నడ్డా తదితరులు తిలకించారు. అనంతరం పలువురు ముఖ్యనేతలు ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యాలు, ప్రచార వ్యూహాలపై మార్గనిర్దేశం చేశారు.
ముఖర్జీకి నిజమైన నివాళి: మోదీ
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవడమే బీజేపీ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. శనివారం బీజేపీ జాతీయ ఆఫీసు–బేరర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. జమ్మూకాశీ్మర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆరి్టకల్ 370ని జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో 370 స్థానాలు సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 100 రోజుల ప్రణాళిక ప్రకారం కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో కొత్తగా 370 ఓట్లు అధికంగా బీజేపీకి లభించేలా చూడటంతోపాటు కొత్త ఓటర్లను ఆకర్షించాలని చెప్పారు.
తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: జేపీ నడ్డా
ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్ల కాలంలో బీజేపీ అనేక విజయాలు సాధించిందని జేపీ నడ్డా అన్నారు. 2014లో 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో బీజేపీ, 17 రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉందని గుర్తుచేశారు. పశి్చమ బెంగాల్‌లో బీజేపీకి 10 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పారీ్టకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ పరంగా గెలిచామని అన్నారు. రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేల సంఖ్య ఒక్కటి నుంచి 8కి, ఓట్ల శాతం 7.1 నుంచి 14కు పెరిగిందని వెల్లడించారు. తెలంగాణను వదిలిపెట్టబోమని, అక్కడ అధికారంలోకి వస్తామని, అందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజలంతా దీపాలు వెలిగించినా, ప్రతిపక్ష నేతలు మాత్రం ఈ మహత్కార్యానికి దూరంగా ఉన్నారని విమర్శించారు.
తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన నేతలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో పాటు సీనియర్ నేతలు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సీనియర్ నేతలు సోము వీర్రాజు, కిరణ్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధ్దన్‌రెడ్డి, సత్యకుమార్, కిలారు దిలీప్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment