ఐటీఐఆర్‌కు పైసా ఇవ్వలేదు | UPA and NDA Government Not Give ITIR a Single Rupee | Sakshi
Sakshi News home page

ఐటీఐఆర్‌కు పైసా ఇవ్వలేదు

Published Sun, Sep 15 2019 3:37 AM | Last Updated on Sun, Sep 15 2019 9:05 AM

UPA and NDA Government  Not Give ITIR a Single Rupee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌కు (ఐటీఐఆర్‌) యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఒక్క పైసా ఇవ్వలేదని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం తన పదవీ కాలం చివరి సమయంలో ఐటీఐఆర్‌ను తీసుకొచ్చినా ఒక్క రూపాయి ఇవ్వలేదని, కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రాన్ని దాదాపు పది సార్లునేరుగా కలిసి అడిగినా, లేఖలు రాసినా స్పందించలేదని శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెల్లడించారు. నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వనందుకే ఐటీఐఆర్‌ ఇవ్వలేదని మాట్లాడారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలను ఆ మరుసటి రోజే దత్తాత్రేయకు చూపించామని తెలిపారు. దీనిపై అప్పటి సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సైతం ఐటీఐఆర్‌ మా పాలసీ కాదని, దాన్ని ముందుకు తీసుకెళ్లమని స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి ఆగలే దన్నారు.

గడిచిన ఏదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభ్యులు గాదరి కిషోర్‌ కుమార్, కేపీ వివేకానంద్, కాంగ్రెస్‌ సభ్యుడు డి.శ్రీధర్‌బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52 వేల కోట్లు కాగా, 2018–19 నాటికి రూ.1.09 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలతో రాష్ట్ర ఐటీలో 17 శాతం వృద్ధిని సాధించామని చెప్పారు. హైదరాబాద్‌ నలువైపులా ఐటీ కంపెనీలను విస్తరిస్తామని, కరీంనగర్‌లో వచ్చే నెలలో ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.   

మురుగు శుద్ధి లేకే జ్వరాలు: అక్బరుద్దీన్‌
హైదరాబాద్‌లో కేవలం 30% మాత్రమే మురుగు శుద్ధి జరుగుతోందని, కావాల్సినన్ని సీవరేజీ ట్రీట్‌మెంట్‌ప్లాంట్లు (ఎస్‌టీపీ) లేకపోవడంతో మురుగు పెరుగుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మురుగు శుద్ధి జరగక నగరంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు ప్రబలుతున్నాయని, దోమలు విజృంభిస్తున్నాయన్నారు. ఆరోగ్య అత్యయిక పరిస్థితి నెలకొందని, మురుగు శుద్ధి లేకపోవడం, మూసీ నదిలో వదులుతున్న వ్యర్థాలే దీనంతటికీ కారణమన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ బదులిస్తూ.. నగరంలో 735 ఎంఎల్‌డీల మురుగును శుద్ధి చేసే ఎస్‌టీపీలు 21 ఉన్నాయని, అయితే ఇవి చాలినంతగా లేవన్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొనే 2021 నాటికి మరో 700 ఎంఎల్‌డీల మురుగును శుద్ధి చేసేలా, 2036 నాటికి 3 వేల ఎంఎల్‌డీల మురుగు శుద్ధి జరిగేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. దోమల నివారణకు 200 జెట్టీ యంత్రాలతో స్ప్రే చేయిస్తున్నామని, డెంగీ నివారణపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రి దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మురుగు పారుదల వ్యవస్థ బలోపేతం చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసే బాధ్యతను ముంబైకు చెందిన షా కన్సల్టెన్సీకి అప్పగించిందని, ఈ నివేదిక డిసెంబర్‌లో వస్తుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement