పరీక్షా పే చర్చ నిర్వహించే మోదీ నీట్ అవకతవకలపై సమాధానమివ్వాలి
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోని కేంద్రం
గ్రేస్ మార్కులు, పేపర్‌లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన
సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలి
ఎన్డీఏ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, ఇతర వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్–యూజీ ఎంట్రన్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలను ప్రధాని మోదీ నివృత్తి చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశా రు. తమ పిల్లలు డాక్టర్లు కావాలని కలలుగన్న తల్లి దండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన వ్యవహారంతో నీళ్లు చల్లినట్టయిందని ధ్వజమెత్తారు.
బిహార్‌లో రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్ర యించారని, ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివారం రాసిన బహిరంగ లేఖలో నీట్ పరీక్షపై పలు సందేహాలను వెలిబుచ్చారు. ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని...నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విచారకరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్య లు తీసుకొని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు.
67 మందికి మొదటి ర్యాంకు ఎలా?
నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ అన్నారు. ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన 8 మంది విద్యార్థు లు 720 మార్కులు సాధించడం చూస్తే ..పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకొనేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చ ర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎనీ్టఏ) 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని.. అంతమందికి ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు కలిపారో స్పష్టం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా పేపరే లీకేజీ ఆరోపణలపైనా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్, బిహార్ లో అవకతవకలకు పాల్పడిన కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారని.. వరుసగా బయటపడుతున్న వివాదస్పద వ్యవహారాల కారణంగా పరీక్ష తీరుపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నష్టం
తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ వల్ల వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించేలా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment