శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో కరోనా నిబంధనలు పాటిస్తూ పలకరించుకుంటున్న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ విధానాన్ని పునః సమీక్షించాలని.. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పా టు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఏడున్నరేళ్లలో రూ.1.47 లక్షల కోట్లకు చేరాయని.. ఈ రంగంలో రాష్ట్రానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
శుక్రవారం హైదరాబాద్‌లో 24వ ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సును కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్‌క్లస్టర్లను అభివృద్ధి చేశామని.. మరో రెండు క్లస్టర్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. బెంగళూరు, అహ్మదాబాద్ తరహాలో అంతరిక్ష పరిశోధనలకు కేంద్రంగా, అనేక రక్షణ రంగ పరిశోధన సంస్థలకు నిలయంగా ఉన్న హైదరాబాద్‌లో.. ఇన్‌స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన పౌరసేవలు అందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2017లో ‘మీసేవ’ను ఆధునీకరించామని.. రాష్ట్రంలోని 4,500 కేంద్రాల ద్వారా రోజూ లక్ష మందికి సేవలు అందించే వేదికగా తీర్చిదిద్దామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ‘ఈ–తాల్’ గణాంకాల ప్రకారం ‘మీసేవ’ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు.
స్మార్ట్ గవర్నెన్స్ కోసం..
ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఎస్తోనియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. 2019 నుంచి ఈ టెక్నాలజీ ఆధారంగా పౌర సేవలు నిరంతరం అందిస్తున్నామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ నుంచి రిటైర్డ్ ఉద్యోగుల లైఫ్ సర్టిఫికెట్లు, ఓటర్ల గుర్తింపు వంటి అనేక అంశాల్లో ఈ–గవర్నెన్స్‌కు పెద్దపీట వేస్తున్నామన్నారు.
టీ–ఫైబర్ ద్వారా మొదటిదశలో రాష్ట్రంలోని 30వేల ప్రభుత్వ కార్యాలయాలను, రెండో దశలో 51 లక్షల గ్రామీణ, 32 లక్షల పట్టణ గృహాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో 3 కేటగిరీల్లో 2021 ఈ–గవర్నెన్స్ జాతీయ అవార్డులను అందజేశారు. తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ‘మన ఇసుక వాహనం’కు అవార్డు లభించింది.
తెలంగాణలో ఎంతో ‘స్పేస్’
దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచామని.. ఇప్పటికే అంతరిక్ష రంగ స్టార్టప్‌లకు వేదికగా ఉన్న తెలంగాణకు ఈ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని జితేంద్రసింగ్ అన్నారు. అంతరిక్ష రంగ సాంకేతికతలో ప్రపంచ ప్రమాణాలను అందుకునే శక్తి రాష్ట్రానికి ఉందన్నారు. ఈ మేరకు అంతరిక్ష పరిశోధనలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటామన్నారు.
కోవిడ్ సమయంలో డిజిటల్ గవర్నెన్స్ తో ప్రజలను చేరుకోగలిగామని చెప్పారు. ప్రధాని మోదీ కృషి వల్లే దేశంలో డిజిటల్ జీవితం సాధ్యమవుతోందన్నారు. పౌరసేవల్లో రాష్ట్రాలు అమలు చేస్తున్న ఈ–గవర్నెన్స్ విధానాల్లోని సారూప్య అంశాలను జోడిస్తూ కొత్త నమూనాకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment