Electronic cluster
-
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
తెలంగాణా రాష్ట్రానికి ఐటీఐఆర్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ విధానాన్ని పునః సమీక్షించాలని.. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పా టు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఏడున్నరేళ్లలో రూ.1.47 లక్షల కోట్లకు చేరాయని.. ఈ రంగంలో రాష్ట్రానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో 24వ ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సును కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్క్లస్టర్లను అభివృద్ధి చేశామని.. మరో రెండు క్లస్టర్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. బెంగళూరు, అహ్మదాబాద్ తరహాలో అంతరిక్ష పరిశోధనలకు కేంద్రంగా, అనేక రక్షణ రంగ పరిశోధన సంస్థలకు నిలయంగా ఉన్న హైదరాబాద్‌లో.. ఇన్‌స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచీ పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన పౌరసేవలు అందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2017లో ‘మీసేవ’ను ఆధునీకరించామని.. రాష్ట్రంలోని 4,500 కేంద్రాల ద్వారా రోజూ లక్ష మందికి సేవలు అందించే వేదికగా తీర్చిదిద్దామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ‘ఈ–తాల్’ గణాంకాల ప్రకారం ‘మీసేవ’ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం.. ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఎస్తోనియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. 2019 నుంచి ఈ టెక్నాలజీ ఆధారంగా పౌర సేవలు నిరంతరం అందిస్తున్నామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ నుంచి రిటైర్డ్ ఉద్యోగుల లైఫ్ సర్టిఫికెట్లు, ఓటర్ల గుర్తింపు వంటి అనేక అంశాల్లో ఈ–గవర్నెన్స్‌కు పెద్దపీట వేస్తున్నామన్నారు. టీ–ఫైబర్ ద్వారా మొదటిదశలో రాష్ట్రంలోని 30వేల ప్రభుత్వ కార్యాలయాలను, రెండో దశలో 51 లక్షల గ్రామీణ, 32 లక్షల పట్టణ గృహాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో 3 కేటగిరీల్లో 2021 ఈ–గవర్నెన్స్ జాతీయ అవార్డులను అందజేశారు. తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ‘మన ఇసుక వాహనం’కు అవార్డు లభించింది. తెలంగాణలో ఎంతో ‘స్పేస్’ దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచామని.. ఇప్పటికే అంతరిక్ష రంగ స్టార్టప్‌లకు వేదికగా ఉన్న తెలంగాణకు ఈ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని జితేంద్రసింగ్ అన్నారు. అంతరిక్ష రంగ సాంకేతికతలో ప్రపంచ ప్రమాణాలను అందుకునే శక్తి రాష్ట్రానికి ఉందన్నారు. ఈ మేరకు అంతరిక్ష పరిశోధనలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటామన్నారు. కోవిడ్ సమయంలో డిజిటల్ గవర్నెన్స్ తో ప్రజలను చేరుకోగలిగామని చెప్పారు. ప్రధాని మోదీ కృషి వల్లే దేశంలో డిజిటల్ జీవితం సాధ్యమవుతోందన్నారు. పౌరసేవల్లో రాష్ట్రాలు అమలు చేస్తున్న ఈ–గవర్నెన్స్ విధానాల్లోని సారూప్య అంశాలను జోడిస్తూ కొత్త నమూనాకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
రూ.70 కోట్లతో ఎలక్ట్రానిక్ క్లస్టర్
సాక్షి, అనంతపురం: జిల్లాలో ప్రగతి పరుగులందుకోనుంది. వెనకుబడిన అనంతపురం జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పారిశ్రామికీకరణే మార్గం అని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కల్పించే ప్రత్యేక రాయితీతో సాఫ్ట్వేర్ పారిశ్రామికుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలూ సానుకూల ఫలితాలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల పలువురు పారిశ్రామిక వేత్తలు జిల్లాకు తరలివస్తున్నారు. ప్రధానంగా చిలమత్తూరు మండలానికి మంచి రోజులు రాబోతున్నాయి. రూ.70 కోట్లతో ఎసినా రాఘమయూరి ఎలక్ట్రానిక్స్ పార్కు ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో చిలమత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. క్లస్టర్ పరిధిలో దేశ, విదేశాలకు చెందిన ఆరు సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉత్పత్తుల నెలకొల్పే యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు గురువారం రాష్ర్ట ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎల్సినా రాఘమయూరి ఎలక్ట్రానిక్ పార్కు ప్రైవేటు లిమిటెడ్ ఎండా కె.జే.రెడ్డి, సీఈఓ భాస్కర్‌రెడ్డి, జేసీ ఎస్.సత్యనారాయణలు చిలమత్తూరులో పర్యటించారు. ఈ మేరకు ఎసినా రాఘమయూరి ఎలక్ట్రానిక్స్ పార్కు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న పనులను పరిశీలించారు. క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేజే రెడ్డికి మంత్రి హామీనిచ్చారు. ఫలితంగా మరికొన్ని కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో భూగర్భ జలాలను పరిశీలించగా, జలాలు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించారు. వ్యవస్థాపరమైన నిర్మాణాలు చేపట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అప్పగించనున్నట్లు సంస్థ ఎండీ కేజీరెడ్డి తెలిపారు. క్లస్టర్ పరిధిలో ఉన్న హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ ప్రాంతాలలో విద్యావంతులైన యువతీ, యువకులు అందుబాటులో ఉన్నారని, దాదాపు పది వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ క్లష్టర్ సమీపంలోనే ఇంకుబేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అనువైన భూమి ఉందని జేసీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.