అరవింద్ భరద్వాజ్, అనుపమ్ కుమార్
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్‌ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు..
ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది.
బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్‌లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్.
‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్.
మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్‌లో ఉపయోగిస్తారు.
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్‌లో కెరీర్‌ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్‌ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్‌లను వేరు చేసేవాడు.
‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు.
మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లు గ్రాంట్ ఇచ్చాయి.
‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ.
కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం.
ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment