electronic machines
-
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
దడ పుట్టిస్తున్న ఈ–వేస్ట్
శ్రీకాంత్‌రావు.కె, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్ధాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలపై (ఈ–వేస్ట్ (వ్యర్థ్ధాలు) పలు దేశాలు చట్టాలు చేసినా వాటి అమలుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ–వ్యర్థాలు భూమిలో కలిసిపోయేవి కాకపోవడంతో విషపూరితంగా మారి గాలిలో, భూమిలో, నీటిలోనూ కలుస్తూ ప్రాణకోణిపై ప్రభావం చూపెడుతున్నాయి. సరైన విధానంలో వీటిని ధ్వంసం చేయకపోవడం, అవగాహన లేక తగలపెట్టడం వల్ల వాటిని నుంచి విష వాయువులు వాతావరణంలో కలుస్తున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా.. వీటిని ఉత్పత్తి చేస్తున్న సంస్థలు కానీ, వినియోగదారులు కానీ, చివరకు పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోక పోవడం వల్ల ఏటేటా ఈ–వ్యర్థ్ధాలు లక్షల మెట్రిక్ టన్నుల మేర పేరుకుపోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థ్ధాలున్నాయి. అయితే అందులో కొంతమేరకు రీసైక్లింగ్ జరిగాయి. ఏతావాతా గడచిన సెప్టెంబర్ చివరి నాటికి నికరంగా 34.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థ్ధాలు భూమిపై ఉన్నాయి. ఒక్క ఏడాదిలో 5.7 కోట్ల టన్నుల వ్యర్థ్ధాలు ఒక్క 2021 సంవత్సరంలోనే 5.7 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జమ అయినట్లు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. వాస్తవంగా ఈ–వ్యర్థ్ధాల ముప్పును గుర్తించిన తరువాత.. 2014 నుంచి ప్రతియేటా ఏ మేరకు ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అంశంపై వివిధ సంస్థలు సీరియస్‌గా దృష్టి సారించాయి. 2014 ముందు ఎలక్ట్రానిక్ వ్యర్థ్ధాలకు సంబంధించి పూర్తి సమాచారం లేకున్నా అంచనాలు మాత్రం వేయగలిగారు. రీసైక్లింగ్‌లో నిర్లక్ష్యం తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఆధునికత పేరిట ప్రపంచం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగం వైపు పరుగులు పెడుతోంది. ఆధునిక వస్తువులు మార్కెట్లోకి వస్తున్న కొద్దీ.. అప్పటివరకు వినియోగించిన వస్తువులను పక్కన పడేస్తున్నారు. మార్కెట్లోకి కొత్తది వస్తేచాలు పాతది ఇక పనిచేయదన్న భావనలో పడిపోతున్నారు. మరింత సౌకర్యవంతమైన వాటి వెంట పడుతున్నారు. దీంతో ప్రతి సంవత్సరం 20 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉన్న దేశాలు వీటిని రీసైకిల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పాతవాటిని సక్రమంగా డిస్పోజ్ చేయకుండా బాహ్య ప్రపంచంలో పారేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పువాటిల్లుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఈ–వ్యర్థ్ధాల్లో 17.4% మాత్రమే రీ సైకిల్ అవుతున్నట్లు సమాచారం. 78 దేశాల్లో చట్టాలున్నా.. ప్రపంచ వ్యాప్తంగా 71 శాతం జనాభా కలిగిన మొత్తం 78 దేశాలు ఈ–వ్యర్థ్ధాలపై చట్టాలు, నియంత్రణ, విధానాలు తీసుకునివచ్చాయి. కానీ వాటి అమలు అంతంత మాత్రంగానే ఉంది. విచిత్రంగా అమెరికాలోని దాదాపు 25 రాష్ట్రాల్లో ఈ–వ్యర్థ్ధాలు రీసైక్లింగ్‌కు సంబంధించి ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. టాప్ త్రీలో చైనా, అమెరికా, భారత్ ఈ–వ్యర్థ్ధాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా, అమెరికా, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏటా ఆసియాలో 2.4 కోట్ల మెట్రిక్ టన్నులు, అమెరికాలో 1.3 కోట్ల మెట్రిక్ టన్నులు, యూరోప్‌లో 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తలసరి ఉత్పత్తి యూరోప్‌లో 16.2 కిలోలు, ఓషియానియా దేశాల్లో 16.1 కిలోలు, అమెరికాలో 13.3 కిలోలుగా ఉంది. ఆఫ్రికా దేశస్తుల తలసరి ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అతితక్కువగా ఉంది. ఈ–వ్యర్థాల్లో ఏది ఎంత? ఈ వ్యర్థాల్లో మైక్రోవేవ్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, టోస్టర్స్, ఏవర్స్, హెయిర్ డ్రయ్యర్స్ (17.4 ఎంటీ), వాషింగ్ మెషీన్స్, టంబుల్ డ్రయ్యర్స్, స్టవ్స్, డిష్‌వాషర్స్, కుక్కర్స్ (13.4 ఎంటీ), రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండీషనర్స్, హీట్‌పంప్స్ (10.8ఎంటీ), స్క్రీన్స్,మానిటర్స్, టెలివిజన్స్, నోట్‌బుక్స్, టాబ్లెట్స్ (6.7ఎంటీ), ఐటీ, టెలీఎక్విప్‌మెంట్, సెల్‌ఫోన్స్, వైర్లెస్ రూటర్స్, జీపీఎస్, కాలుక్యులేటర్స్ (4.7ఎంటీ), బల్బులు, ఎల్ఈడీ (0.9ఎంటీ)లు ఉన్నాయి. ప్రజలు ఏంచేయాలి.. ►ప్రతి వ్యక్తీ తన స్థాయిలో ఈ–వ్యర్థ్ధాలను అరికట్టేందుకు సిద్ధం కావాలి. సరిగా డిస్పోజ్ చేయాలి. పర్యావరణహిత జీవనశైలి అలవర్చుకుంటే చాలా మార్పు వస్తుంది. ►వస్తువు కొనుగోలు చేసేటప్పుడే ఆలోచించాలి. దాని వినియోగం ఎలా..?దాని కాలపరిమితి తీరిన తరువాత ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసుకోవాలి. ►పాత టెక్నాలజీతో కూడిన వాటిని తొందరపడి పారేయకూడదు. పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం కంటే వాటి మరమ్మతులు చేసేలా చూసుకోవాలి. విలువైన ముడి పదార్థాలు వ్యర్థంగా.. ఈ–వ్యర్థ్ధాలను రీసైక్లింగ్ చేయకుండా భూమిపై వదిలేయడంతో.. వాటిలో విలువైన ముడి పదార్థాలు ఎందుకు కొరగాకుండా పోతోంది. 2019 సంవత్సరంలో ఉత్పత్తి అయిన ఈ–వ్యర్థ్ధాలు 5.3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే.. అందులో వినియోగించిన విలువైన బంగారం, వెండి, రాగి, ఇనుము తదితర లోహాల విలువ దాదాపు 57 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. పది లక్షల సెల్ఫోన్లలోని సర్క్యూట్లను రీసైకిల్ చేయడం ద్వారా సుమారు 34 కిలోల బంగారం, 336 కిలోల వెండి, 17వేల కిలోల కాపర్, 17 కిలోల పల్లాడియం మెటల్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవన్నీ రీసైకిల్ కాకపోవడంతో సాధారణ వ్యర్థ్ధాలతో కలిసి భూమిలోనే ఇమిడిపోతున్నాయి. ఇవి కాకుండా హానికారక సీసం, జింక్, నికెల్, క్రోమియం, బేరియం లాంటివి భూమిలో కలవడంతో పర్యావరణానికి నష్టం చేకూరుతోంది. వీటివల్ల ప్రజల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. రెండేళ్లకే గాడ్జెట్స్ మార్చేస్తున్నారు.... ఎలక్ట్రానిక్ పరికరాలు నిత్యజీవితంలో భాగమయ్యాయి. ఆధునిక సాంకేతికతల్లో వేగంగా వస్తున్న మార్పులతో ఒకటి, రెండేళ్లకే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మార్చేస్తున్నారు. కంప్యూటర్లు, టీవీలు, సెల్ఫోన్లు, చార్జర్లు, ఇతర ఆక్సెసరీల వాడకం పెరిగింది. అదే సమయంలో మన దగ్గర ఈ–వేస్ట్ రీసైకిల్ చేస్తున్న ఏజెన్సీలు తక్కువ ఉన్నాయి. జనరల్ వేస్ట్‌తో కలిపి ఈ–వేస్ట్‌ను పడేస్తుండడంతో ప ర్యావరణం కలుషితమౌతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కంటే ఉత్పత్తిదారుడు, వినియోగదారులే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. – పి.రఘువీర్, విశ్రాంత ఐఎఫ్ఎస్, మాజీ పీసీసీఎఫ్ టేక్ బ్యాక్ పాలసీ ముఖ్యం.. ఈ–వేస్ట్‌ను సరైన పద్ధతుల్లో పడేయడం లేదా రీసైకిల్ చేయకపోతే ఎదురయ్యే సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. నగరాలు, ముఖ్య పట్టణాల్లో కాలంచెల్లిన, పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలను వినియోగదారుల నుంచి వెనక్కు తీసుకునే ఏర్పా టు జరగలేదు. అందువల్ల వీటి టేక్ బ్యాక్ పాలసీ (వెనక్కి తీసుకునే విధానం) ముఖ్యం. మొబైళ్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి వాటిలో సూక్ష్మ స్థాయిలో గోల్డ్, కాపర్ వంటివి ఉంటాయి. వీటి కోసం వస్తువలు కాల్చేయడం వల్ల కేన్సర్ కారక విష వాయువులు విడుదలవుతున్నాయి. – మురళీకృష్ణ, ఈ–వేస్ట్ నిర్వహణ నిపుణులు -
భారత్‌లో తొలిసారి, కొత్త వాషింగ్ మెషీన్ వచ్చిందోచ్.. నోటితో చెప్తే ఉతికేస్తుంది!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో బోలెడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన డివైజ్‌లు, మిషీన్లు మరో ఏడాదికల్లా అదనపు ఫీచర్లతో కస్టమర్లను పలకరిస్తున్నాయి. తాజాగా టచ్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్‌తో ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్ (Washing Machine) మార్కెట్లోకి వచ్చేసింది. ఈ తరహా టెక్నాలజీతో రావడం భారత్‌లో ఇదే తొలిసారి. ఈ వాషింగ్ మెషీన్‌ను హోమ్ అప్లయెన్సెస్, కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్ సంస్థ హయర్(Haier) విడుదల చేసింది. ప్రత్యేకంగా ఇందులో ఏఐ డైనమిక్ బ్యాలన్స్ సిస్టమ్, ఇన్‌బిల్ట్ వాయిస్ కంట్రోల్, డైరెక్ట్ మోషన్ మోటర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది. డైరెక్ట మోషన్ మోటార్ అదిరిపోయే ఫీచర్లు కొత్త వాషింగ్ మెషీన్లో ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్ మోషన్ మోటార్ ఉంది. ఇది గణనీయంగా మెషిన్ వైబ్రేషన్‌ని తగ్గిస్తుంది, తద్వారా మిషన్ సౌండ్ లేకుండా పని చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ మెషీన్ లైఫ్టైంను కూడా పెంచుతుంది. ఇందులో 30పైగా వాషింగ్ ప్రోగ్రామ్‌లతో డిజైన్ చేయబడింది. పాటు వివిధ రకాల బట్టలను సునాయాసంగా వాష్ చేసేస్తుంది. అదనంగా హై-ఎఫిషియన్సీ ABT (యాంటీ బాక్టీరియల్ టెక్నాలజీ) ఉంది. ఇందులోని డిటర్జెంట్ డిస్పెన్సర్‌ను శుభ్రంగా ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ డ్యూయల్ స్ప్రే టెక్నాలజీ, బ్యాక్టీరియా, అలెర్జీ కారకాలను సమర్థవంతంగా తొలగించే పూరిస్టీమ్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా కస్టమర్లు ఇంట్లో ఎక్కడ నుంచైనా ఇచ్చే ఆదేశాలతో ఈ వాషింగ్ మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్లో 10కేజీల దీని ధర రూ.96వేల వరకు ఉంది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
తాళం చెవితో పనిలేదు.. ‘సెల్ఫీ’ కొడితే స్కూటర్ రయ్ రయ్..
సాక్షి, హైదరాబాద్: తాళం చెవితో పనిలేదు.. ఈ–స్కూటర్ వద్దకు వెళ్లి యాప్‌ను ఆన్‌చేసి సెల్ఫీ తీస్తే చాలు.. అది స్టార్ట్ అయిపోతుంది. యాప్ ద్వారానే స్కూటర్ నడిపిన తర్వాత పేమెంట్ కూడా చేయొచ్చు. ఈ మేరకు రూపొందించిన ‘హల’మొబిలిటీ యాప్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం, అద్దె, చార్జింగ్ స్టేషన్లు తదితర సేవలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. పలు విద్యాసంస్థల ఆవరణలో ఒకే సీటు ఉన్న ‘ఈ స్కూటర్’సేవలను ఇప్పటికే ‘హల’అందిస్తోంది. తాజాగా ఆవిష్కరించిన ‘హల’మొబిలిటీ యాప్ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ‘ఈ స్కూటర్’సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. స్మార్ట్ బ్యాటరీతో పనిచేసే ఈ–స్కూటర్ల కోసం ట్రిపుల్ ఐటీ ఆవరణలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనాల్లో బ్లూ టూత్ కనెక్షన్, జీపీఎస్ వంటి టెక్నాలజీ ఉండటంతో మొబైల్ ఫోన్లోని హల మొబిలిట్ యాప్ ద్వారా డిజిటల్ తాళాన్ని తెరిచి ప్రయాణించొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ యాప్ ప్రయాణికుడి సెల్ఫీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు వివరాలు క్షణాల్లో సేకరించి ‘ఈ స్కూటర్’పై ప్రయాణానికి అనుమతిస్తుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను ‘హల’తీరుస్తుందని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రయాణాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే 12 నెలల్లో ఆరు నగరాల్లో ‘హల’యాప్ ద్వారా పనిచేసే 15వేల స్కూటర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదిలాఉంటే, టి హబ్‌లోని ‘ల్యాబ్ 32 ప్రాజెక్టు’ కింద ‘హల మొబిలిటీ యాప్’ పురుడుపోసుకున్నట్లు టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. -
‘ఎలక్ట్రానిక్’ మోసం.. 70 శాతం ఆఫర్
సనత్‌నగర్: వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తామని వినియోగదారుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసిన ఆన్లైన్ సంస్థ నిర్వాహకులు చివరకు బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను నిలదీస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బేగంపేట ప్రకాష్ నగర్‌లోని అద్నాన్ ఛాంబర్స్‌లో ‘హిమోగల్ టెక్నాలజీ సంస్థ’ఈ ఏడాది జులై 29న ప్రారంభమైంది. దీనికి మహ్మద్ తస్లీమ్ సయీద్, ఆదిత్యలు యజమానులుగా ఉన్నారు. వీరు కాల్ సెంటర్ మార్కెటింగ్ పేరిట సుమారు 90 మంది ఉద్యోగులను నియమించుకున్నారు. ఉద్యోగంలో చేరే సమయంలో వీరికి కాల్ సెంటర్, ఈవెంట్స్ మేనేజ్మెంట్ వంటి పనులు ఉంటాయని చెప్పారు. తీరా విధుల్లోకి చేరాక ప్రజలకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించే పనిని అప్పగించారు. మొదట్లో ఉద్యోగులకు వస్తువులపై 70 శాతం ఆఫర్ ప్రకటించి, దీని కోసం ‘వావ్ జీ యాప్స్’ పేరిట ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో కస్టమర్లు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కోసం ఆర్డర్లు చేశారు. ఎక్కువ మంది ఆన్లైన్లో డబ్బులు చెల్లించగా, కొందరు సంస్థ కార్యాలయానికి వచ్చి నగదు చెల్లించి వస్తువులు బుక్ చేసుకున్నారు. నెల రోజుల్లోనే సుమారు 1,500 ఆర్డర్లు వచ్చాయి. వచ్చిన ఆర్డర్లలో 50 నుంచి 100 వరకు చిన్న చిన్న వస్తువులను అందజేశారు. ఆ తరువాత ఆర్డర్ చేసిన వస్తువులు పంపకుండా నిర్వాహకులు జారుకున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక హిమోగల్ టెక్నాలజీ సంస్థ ఉద్యోగులు ఆదివారం బేగంపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సంస్థ నిర్వాహకుడు తస్లీమ్ సయీద్‌ను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు ఆదిత్య పరారీలో ఉన్నాడు. -
స్పైడర్‌మేన్ రోబో..!
లండన్: గోడకు అమర్చిన ఎలక్ట్రానిక్ పరికరంలా కనిపిస్తున్న ఇది ఓ వినూత్న రోబో. సాలీడు మాదిరిగా దారపుపోగును విడుదల చేసి దాని ఆధారంగా గోడలను ఎగబాకడం, నిటారుగా దిగేయడం దీని ప్రత్యేకత. ప్రత్యేక థర్మోప్లాస్టిక్ పదార్థాన్ని వేడిచేసి ఇది ఓ గొట్టం ద్వారా వేగంగా వదులుతుంది. ఆ పదార్థం బయటికి వచ్చి గట్టిపడుతూ రాళ్లు, ఇతర ఉపరితలాలకు అతుక్కుని కడ్డీ మాదిరిగా మారుతుంది. దీనిని ఆధారం చేసుకుని చక్రాలతో ఉపరితలంపై జారుతూ ఈ రోబో కిందకు దిగుతుంది. ప్రస్తుతానికి నిటారు దారపు పోగులు (కడ్డీలు) మాత్రమే ఏర్పర్చి నిమిషానికి 12 సెం.మీ. మాత్రమే కిందికి దిగగలదు. భవిష్యత్తులో సమాంతర కడ్డీలు, సాలెగూడులా అల్లికలు ఏర్పర్చి ఎక్కువ బరువును మోస్తూ ఏ వైపు అయినా కదలగలిగేలా కూడా దీనిని అభివృద్ధిపర్చనున్నట్లు స్విట్జర్లాండ్‌లోని బయో-ఇన్స్పైర్డ్ రోబోటిక్స్ ల్యాబ్ శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఓటరవుదాం.. ఓటేద్దాం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఓటరుగా నమోదవం.. ఓటు హక్కును వినియోగించుకోవడం సామాజిక బాధ్యత. నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మంచి పాలకులు.. ప్రభుత్వాలు సాధ్యం. తద్వారా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న పండగలా నిర్వహిస్తోంది. శనివారం 4వ విడత కార్యక్రమ నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటరు దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాంసృతిక కార్యక్రమాలు, మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఆసక్తి చూపని యువత ఓటరుగా నమోదయ్యేందుకు యువత ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మొత్తం ఓటర్లలో 18, 19 ఏళ్ల యువత 3.66 శాతం ఉన్నారు. ఈ లెక్కన జిల్లాలో 1.55 లక్షల మంది యువత ఓటర్లుగా నమోదు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 82వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ విషయంలో మార్పు తీసుకొచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకున్నా ఫలితం లేకపోయింది. పెరిగిపోతున్న బోగస్ ఓటర్లు జిల్లాలో బోగస్ ఓటర్లు గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. జనాభాలో ఓటర్లు 64.6 శాతం ఉండాలి. కానీ జిల్లాలో 69 నుంచి 70 శాతం ఉండటం గమనార్హం. 1000 మంది పురుష ఓటర్లకు 988 మంది మహిళా ఓటర్లు ఉండాల్సిన స్థానంలో.. మహిళలు 1010 మంది ఉండటం బోగస్‌కు నిదర్శనం. నేతల స్వార్థమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. నవంబర్ 18న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 28,39,987 మంది కాగా.. పురుషులు 14,12,951.. మహిళలు 14,27,036 మంది ఉన్నట్లు వెల్లడైంది. జిల్లాలో మొత్తం 1.83 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ నిర్ధారించింది. ఇటీవల అధికారులు దాదాపు 60వేల బోగస్ ఓటర్లను తొలగించినా.. ఇప్పటికీ 1.24 లక్షల బోగస్ ఓటర్లు ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారానే పోలింగ్ ఈ ఏడాది జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలనే వినియోగించనున్నారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ ఫిబ్రవరి నెల 20వ తేదీ తర్వాత ఏ రోజైనా వెలువడే అవకాశం ఉంది. త్వరలో జిల్లాకు కొత్త ఓటింగ్ యంత్రాలు రానున్నాయి. ఈవీఎంలను భద్రపరిచేందుకు కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో శాశ్వత ప్రాతిపదికన రూ.1.05 కోట్లతో గోదామును నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఓటరు నమోదుకు ఎప్పుడైనా అవకాశం 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదయ్యేందుకు నిరంతరం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఫారం-6ను పూర్తి చేసి పంపవచ్చు. దీనిపై సందేహాలు ఉంటే 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్, ఇతరత్రా వివరాలు తెలుసుకునేందుకు 18004251110 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఓటర్లుగా నమోదైన వారు మీ సేవ కేంద్రాల్లో రూ.10 చెల్లించి ఫొటో ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చు. -
డెబిట్, క్రెడిట్ కార్డులతో పన్నుల చెల్లింపు
మునిసిపల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్‌కు పురపాలక శాఖ ఏర్పాట్లు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం మునిసిపాలిటీల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ యంత్రాలు చిన్నపాటి మొబైల్ మిషిన్ల ద్వారా ఇళ్లవద్దే వసూళ్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పన్ను మొత్తాలు ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా స్వీకరించేందుకు పురపాలక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆన్లైన్లో, అలాగే కార్పొరేషన్.. మునిసిపల్ కార్యాలయూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా, చిన్నపాటి మొబైల్ మిషన్ల ద్వారా ఇళ్ల వద్దే పన్ను చెల్లింపులకు శ్రీకారం చుడుతోంది. మునిసిపాలిటీల్లో ప్రస్తుతం వసూలు అవుతున్న పన్నులు వెంటనే బ్యాంకుల్లో జమ కాకపోవడం, ప్రజలు చెక్కుల రూపంలో చెల్లిస్తున్న పన్నులు మునిసిపల్ ఖాతాల్లో జమ అవుతున్నదీ లేనిదీ సరిగా తెలియకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పురపాలక శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వసూలైన పన్నులు పారదర్శకంగా ఎప్పటికప్పుడు బ్యాంకులో, అటునుంచి ప్రభుత్వ ఖజానా(ట్రెజరీ)లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ‘మునిసిపల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్’ పేరిట డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని పురపాలక సంఘాలు, పురపాలక సంస్థల్లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం టెండర్ల విధానంలో రెండు బ్యాంకులు యూక్సిస్, ఐడీబీఐలను ప్రభుత్వం గుర్తించింది. ఈ రెండు బ్యాంకులకు ఆయా మున్సిపాలిటీలు పన్నుల వసూళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇంటి నంబర్లు, ఇంటి యజమాని పేరుతోపాటు, చెల్లించాల్సిన పన్ను ఎంత అన్న వివరాలను అందజేస్తారు. ఈ బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో పన్ను మొత్తాలను స్వీకరిస్తారుు. ప్రజలు కట్టే సొమ్ము సదరు బ్యాంకులోని మునిసిపల్ ఖాతాలో జమ అవుతారుు. పన్ను ఎవరు చెల్లించారో వెంటనే సదరు మునిసిపాలిటీకి తెలిసిపోతుంది. బ్యాంకులో పన్ను చెల్లించగానే.. మున్సిపాలిటీలోని ఈ-సువిధ కేంద్రంలో ఆ సమాచారం నమోదు అవుతుందని అధికారవర్గాలు వివరించాయి. మరోవైపు ఆ బ్యాంకులు మున్సిపాలిటీలకు ఎలక్ట్రానిక్ యంత్రాలు, సులువుగా ఆపరేట్ చేయగలిగిన చిన్నపాటి మొబైల్ మిషన్లను అందజేస్తారుు. మునిసిపాలిటీలకు వెళ్లి అక్కడ బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా కూడా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి పన్నులు చెల్లించవచ్చు. మరోవైపు ప్రస్తుతం విద్యుత్ శాఖ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్న మాదిరి గానే చిన్నపాటి మొబైల్ మిషిన్ల ద్వారా ప్రజల ఇంటి వద్దే పన్నులు వసూలు చేస్తారు. ఇక్కడ కూడా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధమైన చెల్లింపులు జరిపిన వెంటనే ప్రజలకు మొబైల్ ఫోన్లలో ఎస్ఎంఎస్ వచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మునిసిపాలిటీ నుంచి పన్ను చెల్లించాలని ఎలాంటి నోటీసు రాకపోయినా ఈ బ్యాంకుల నుంచి సమాచారం తీసుకుని చెల్లించడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు. వసూలు అయిన ప్రతి పైసా ఉద్యోగుల వద్ద అట్టిపెట్టుకునే అవకాశం లేకుండా చేయడంతోపాటు, నిధులు దుర్వినియోగం కాకుండా ఉండడానికి ఈ చర్యలు దోహదపడతాయని భావిస్తున్నట్లు పురపాలక శాఖ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో ఈ సౌకర్యం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంది.