దడ పుట్టిస్తున్న ఈ–వేస్ట్‌ | E Waste: Electronic And Electrical Waste Is Flooding The World | Sakshi
Sakshi News home page

దడ పుట్టిస్తున్న ఈ–వేస్ట్‌

Published Fri, Oct 14 2022 3:29 AM | Last Updated on Fri, Oct 14 2022 8:33 AM

E Waste: Electronic And Electrical Waste Is Flooding The World - Sakshi

శ్రీకాంత్‌రావు.కె, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి
ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్‌ వ్యర్ధాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. రీసైక్లింగ్‌ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ వ్యర్ధాలపై (ఈ–వేస్ట్‌ (వ్యర్థ్ధాలు) పలు దేశాలు చట్టాలు చేసినా వాటి అమలుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ–వ్యర్థాలు భూమిలో కలిసిపోయేవి కాకపోవడంతో విషపూరితంగా మారి గాలిలో, భూమిలో, నీటిలోనూ కలుస్తూ ప్రాణకోణిపై ప్రభావం చూపెడుతున్నాయి.

సరైన విధానంలో వీటిని ధ్వంసం చేయకపోవడం, అవగాహన లేక తగలపెట్టడం వల్ల వాటిని నుంచి విష వాయువులు వాతావరణంలో కలుస్తున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా.. వీటిని ఉత్పత్తి చేస్తున్న సంస్థలు కానీ, వినియోగదారులు కానీ, చివరకు పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోక పోవడం వల్ల ఏటేటా ఈ–వ్యర్థ్ధాలు లక్షల మెట్రిక్‌ టన్నుల మేర పేరుకుపోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఈ–వ్యర్థ్ధాలున్నాయి. అయితే అందులో కొంతమేరకు రీసైక్లింగ్‌ జరిగాయి. ఏతావాతా గడచిన సెప్టెంబర్‌ చివరి నాటికి నికరంగా 34.7 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఈ–వ్యర్థ్ధాలు భూమిపై ఉన్నాయి.  

ఒక్క ఏడాదిలో 5.7 కోట్ల టన్నుల వ్యర్థ్ధాలు 
ఒక్క 2021 సంవత్సరంలోనే 5.7 కోట్ల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు జమ అయినట్లు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. వాస్తవంగా ఈ–వ్యర్థ్ధాల ముప్పును గుర్తించిన తరువాత.. 2014 నుంచి ప్రతియేటా ఏ మేరకు ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అంశంపై వివిధ సంస్థలు సీరియస్‌గా దృష్టి సారించాయి. 2014 ముందు ఎలక్ట్రానిక్‌ వ్యర్థ్ధాలకు సంబంధించి పూర్తి సమాచారం లేకున్నా అంచనాలు మాత్రం వేయగలిగారు.  

రీసైక్లింగ్‌లో నిర్లక్ష్యం 
తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఆధునికత పేరిట ప్రపంచం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ వస్తువుల వినియోగం వైపు పరుగులు పెడుతోంది. ఆధునిక వస్తువులు మార్కెట్లోకి వస్తున్న కొద్దీ.. అప్పటివరకు వినియోగించిన వస్తువులను పక్కన పడేస్తున్నారు. మార్కెట్లోకి కొత్తది వస్తేచాలు పాతది ఇక పనిచేయదన్న భావనలో పడిపోతున్నారు. మరింత సౌకర్యవంతమైన వాటి వెంట పడుతున్నారు.

దీంతో ప్రతి సంవత్సరం 20 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్ధాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్‌ వస్తువుల వినియోగం అధికంగా ఉన్న దేశాలు వీటిని రీసైకిల్‌ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పాతవాటిని సక్రమంగా డిస్పోజ్‌ చేయకుండా బాహ్య ప్రపంచంలో పారేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పువాటిల్లుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఈ–వ్యర్థ్ధాల్లో 17.4% మాత్రమే రీ సైకిల్‌ అవుతున్నట్లు సమాచారం. 

78 దేశాల్లో చట్టాలున్నా.. 
ప్రపంచ వ్యాప్తంగా 71 శాతం జనాభా కలిగిన మొత్తం 78 దేశాలు ఈ–వ్యర్థ్ధాలపై చట్టాలు, నియంత్రణ, విధానాలు తీసుకునివచ్చాయి. కానీ వాటి అమలు అంతంత మాత్రంగానే ఉంది. విచిత్రంగా అమెరికాలోని దాదాపు 25 రాష్ట్రాల్లో ఈ–వ్యర్థ్ధాలు రీసైక్లింగ్‌కు సంబంధించి ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం.  

టాప్‌ త్రీలో చైనా, అమెరికా, భారత్‌ 
ఈ–వ్యర్థ్ధాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా, అమెరికా, భారత్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏటా ఆసియాలో 2.4 కోట్ల మెట్రిక్‌ టన్నులు, అమెరికాలో 1.3 కోట్ల మెట్రిక్‌ టన్నులు, యూరోప్‌లో 1.2 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తలసరి ఉత్పత్తి యూరోప్‌లో 16.2 కిలోలు, ఓషియానియా దేశాల్లో 16.1 కిలోలు, అమెరికాలో 13.3 కిలోలుగా ఉంది. ఆఫ్రికా దేశస్తుల తలసరి ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అతితక్కువగా ఉంది.  

ఈ–వ్యర్థాల్లో ఏది ఎంత? 
ఈ వ్యర్థాల్లో మైక్రోవేవ్స్, వ్యాక్యూమ్‌ క్లీనర్స్, టోస్టర్స్, ఏవర్స్, హెయిర్‌ డ్రయ్యర్స్‌ (17.4 ఎంటీ), వాషింగ్‌ మెషీన్స్, టంబుల్‌ డ్రయ్యర్స్, స్టవ్స్, డిష్‌వాషర్స్, కుక్కర్స్‌ (13.4 ఎంటీ), రిఫ్రిజిరేటర్స్, ఎయిర్‌ కండీషనర్స్, హీట్‌పంప్స్‌ (10.8ఎంటీ), స్క్రీన్స్,మానిటర్స్, టెలివిజన్స్, నోట్‌బుక్స్, టాబ్లెట్స్‌ (6.7ఎంటీ), ఐటీ, టెలీఎక్విప్‌మెంట్, సెల్‌ఫోన్స్, వైర్‌లెస్‌ రూటర్స్, జీపీఎస్, కాలుక్యులేటర్స్‌ (4.7ఎంటీ), బల్బులు, ఎల్‌ఈడీ (0.9ఎంటీ)లు ఉన్నాయి. 

ప్రజలు ఏంచేయాలి.. 
►ప్రతి వ్యక్తీ తన స్థాయిలో ఈ–వ్యర్థ్ధాలను అరికట్టేందుకు సిద్ధం కావాలి. సరిగా డిస్పోజ్‌ చేయాలి. పర్యావరణహిత జీవనశైలి అలవర్చుకుంటే చాలా మార్పు వస్తుంది. 
►వస్తువు కొనుగోలు చేసేటప్పుడే ఆలోచించాలి. దాని వినియోగం ఎలా..?దాని కాలపరిమితి తీరిన తరువాత ఎలా డిస్పోజ్‌ చేయాలో తెలుసుకోవాలి. 
►పాత టెక్నాలజీతో కూడిన వాటిని తొందరపడి పారేయకూడదు. పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం కంటే వాటి మరమ్మతులు చేసేలా చూసుకోవాలి.  

విలువైన ముడి పదార్థాలు వ్యర్థంగా.. 
ఈ–వ్యర్థ్ధాలను రీసైక్లింగ్‌ చేయకుండా భూమిపై వదిలేయడంతో.. వాటిలో విలువైన ముడి పదార్థాలు ఎందుకు కొరగాకుండా పోతోంది. 2019 సంవత్సరంలో ఉత్పత్తి అయిన ఈ–వ్యర్థ్ధాలు 5.3 కోట్ల మెట్రిక్‌ టన్నులు అయితే.. అందులో వినియోగించిన విలువైన బంగారం, వెండి, రాగి, ఇనుము తదితర లోహాల విలువ దాదాపు 57 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు.

పది లక్షల సెల్‌ఫోన్‌లలోని సర్క్యూట్‌లను రీసైకిల్‌ చేయడం ద్వారా సుమారు 34 కిలోల బంగారం, 336 కిలోల వెండి, 17వేల కిలోల కాపర్, 17 కిలోల పల్లాడియం మెటల్‌ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవన్నీ రీసైకిల్‌ కాకపోవడంతో సాధారణ వ్యర్థ్ధాలతో కలిసి భూమిలోనే ఇమిడిపోతున్నాయి. ఇవి కాకుండా హానికారక సీసం, జింక్, నికెల్, క్రోమియం, బేరియం లాంటివి భూమిలో కలవడంతో పర్యావరణానికి నష్టం చేకూరుతోంది. వీటివల్ల ప్రజల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.  

రెండేళ్లకే గాడ్జెట్స్‌ మార్చేస్తున్నారు.... 
ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిత్యజీవితంలో భాగమయ్యాయి. ఆధునిక సాంకేతికతల్లో వేగంగా వస్తున్న మార్పులతో ఒకటి, రెండేళ్లకే ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు మార్చేస్తున్నారు. కంప్యూటర్లు, టీవీలు, సెల్‌ఫోన్లు, చార్జర్లు, ఇతర ఆక్సెసరీల వాడకం పెరిగింది. అదే సమయంలో మన దగ్గర ఈ–వేస్ట్‌ రీసైకిల్‌ చేస్తున్న ఏజెన్సీలు తక్కువ ఉన్నాయి. జనరల్‌ వేస్ట్‌తో కలిపి ఈ–వేస్ట్‌ను పడేస్తుండడంతో ప ర్యావరణం కలుషితమౌతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కంటే ఉత్పత్తిదారుడు, వినియోగదారులే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి.  
– పి.రఘువీర్, విశ్రాంత ఐఎఫ్‌ఎస్, మాజీ పీసీసీఎఫ్‌  

టేక్‌ బ్యాక్‌ పాలసీ ముఖ్యం.. 
ఈ–వేస్ట్‌ను సరైన పద్ధతుల్లో పడేయడం లేదా రీసైకిల్‌ చేయకపోతే ఎదురయ్యే సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. నగరాలు, ముఖ్య పట్టణాల్లో కాలంచెల్లిన, పాత ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇతర పరికరాలను వినియోగదారుల నుంచి వెనక్కు తీసుకునే ఏర్పా టు జరగలేదు.

అందువల్ల వీటి టేక్‌ బ్యాక్‌ పాలసీ (వెనక్కి తీసుకునే విధానం) ముఖ్యం. మొబైళ్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్‌ మెషీన్లు వంటి వాటిలో సూక్ష్మ స్థాయిలో గోల్డ్, కాపర్‌ వంటివి ఉంటాయి. వీటి కోసం వస్తువలు కాల్చేయడం వల్ల కేన్సర్‌ కారక విష వాయువులు విడుదలవుతున్నాయి.  
– మురళీకృష్ణ, ఈ–వేస్ట్‌ నిర్వహణ నిపుణులు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement